సవాళ్లు కాదు.. ఆనవాళ్లు ఉంటాయా?

స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే రెండు ప్రధాన పార్టీలకే అవకాశం. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అధికారంలో ఉన్న వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీకే స్థానిక [more]

Update: 2021-01-28 00:30 GMT

స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే రెండు ప్రధాన పార్టీలకే అవకాశం. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అధికారంలో ఉన్న వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీకే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువగా గెలుపు అవకాశముంది. కానీ బలోపేతం అవుదామనుకుంటున్న బీజేపీకి స్థానిక సంస్థల ఎన్నికలు ఇబ్బందిగా మారనున్నాయి. ఈ ఎన్నికల తర్వాత బీజేపీ ఏపీలో మరింత బలహీనపడుతుందన్న విశ్లేషణలయితేే వెలువడుతున్నాయి.

ఓటు బ్యాంకు ఏదీ?

వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి పెద్దగా ఓటు బ్యాంకు లేదు. టీడీపీతో కలసి పోటీ చేసినప్పుడే దానికి గెలుపు అవకాశం లభించింది. అదీ అసెంబ్లీ ఎన్నికల్లోనే అది సాధ్యమయింది. క్షేత్రస్థాయిలో బీజేపీ బలంగా లేకపోవడం, ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అనుసరిస్తున్న వైఖరితో దానిపట్ల ఎవరూ మొగ్గు చూపే అవకాశం లేదు. కాపు సామాజిక వర్గం కొంత అనుకూలంగా మారితే కొంత సానుకూలత లభిస్తుంది. ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీలకే గ్రామస్థాయిలో క్యాడర్, ఓటు బ్యాంకు ఉంది.

రెండు కలసి పోటీ చేసినా?

అయితే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే బీజేపీ, జనసేనల కలసి పోటీ చేయనున్నాయి. బీజేపీ ని పక్కన పెడితే జనసేన పరిస్థితి కూడా అంతంత మాత్రమే. పట్టణ ప్రాంతాల్లో తప్ప గ్రామీణ ప్రాంతాల్లో జనసేనకు కూడా పెద్దగా ఓటు బ్యాంకు లేదు. పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తుతో జరగకపోయినా బీజేపీ, జనసేనలు తమ మద్దతుదారులను బరిలోకి దించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దొరికినా వారు విజయం సాధించే అవకాశాలు తక్కువే.

టీడీపీ అదే కోరుకుంటుంది…..

మొన్న జరిగిన ఎన్నికల్లోనే బీజేపీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ఈ ఇరవై నెలల్లో పార్టీ పెద్దగా పుంజుకుంది లేదు. ఓటు బ్యాంకు పెరిగింది లేదు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగి ఫలితాలు వెలువడితే బీజేపీ మరింత బలహీనం కాక తప్పదంటున్నారు. ఈ ఎన్నికల కోసమే టీడీపీ కూడా ఎదురు చూస్తుంది. బీజేపీ తన బలం తాను తెలుసుకుని తమతో కలసి వస్తుందన్న నమ్మకంతో చంద్రబాబు ఉన్నారు. మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికలు సై అంటున్న బీజేపీ నేతలు ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రం డీలా పడక తప్పదంటున్నారు.

Tags:    

Similar News