తిరుపతి బైపోల్ కు ముందే బలమేంటో చూపిస్తారట

తమ లక్ష్యం మొదటి స్థానం కాదు. రెండోస్థానమే. ప్రతిపక్ష హోదా దక్కించుకోవడమే. మూడు నెలల ముందు బీజేపీ సీనియర్ నేత రామ్ మాధవ్ చేసిన వ్యాఖ్యలు ఇవి. [more]

Update: 2021-01-04 14:30 GMT

తమ లక్ష్యం మొదటి స్థానం కాదు. రెండోస్థానమే. ప్రతిపక్ష హోదా దక్కించుకోవడమే. మూడు నెలల ముందు బీజేపీ సీనియర్ నేత రామ్ మాధవ్ చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇప్పుడు ఏపీలో బీజేపీ రెండోస్థానం కోసం ప్రయత్నిస్తుంది. అధికారంలో ఉన్న వైసీపీని ఎలాగూ బలహీనం చేయడం కష్టం కాబట్టి విపక్ష టీడీపీనే వీక్ చేయాలన్నది బీజేపీ లక్ష్యంగా కన్పిస్తుంది. ఇందుకు తిరుపతి ఉప ఎన్నికను బీజేపీ వేదికగా మలచుకోనుంది. ఇక్కడ పట్టు సాధిస్తే టీడీపీని వీక్ చేయడం పెద్దగా కష్టమేమీ కాదని బీజేపీ భావిస్తుంది.

కేంద్రమంత్రుల పర్యటనలతో…..

ఆ దిశగా అగ్రనాయకత్వం చర్యలు ప్రారంభించిందంటున్నారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర మంత్రులు విస్తృతంగా పర్యటించేలా ఒక రూట్ మ్యాప్ ను బీజేపీ తయారు చేసింది. ఏపీకి బీజేపీ అన్యాయంచేసిందని, విభజన హామీలను అమలు చేయలేదన్న అసంతృప్తి ఏపీలో ఉంది. దానిని తొలగించేందుకు బీజేపీ తొలుత ప్రయత్నం చేయనుంది. కేంద్ర మంత్రుల ద్వారా గత ఏడేళ్లలో ఆంధ్రప్రదేశ్ కు ఎన్ని నిధులు కేటాయించింది? వివరణాత్మకంగా ప్రజలకు తెలియజేయాలని నిర్ణయించారు.

కొందరికి బాధ్యతలు….

ఇందుకు కేంద్రమంత్రులు నితిన్ గడ్కరి, నిర్మలా సీతారామన్, పియూష్ గోయల్ వంటి వారికి బాధ్యతలను అప్పగించారని చెబుతున్నారు. దీంతో పాటు జనసేన, బీజేపీ కలసి పోటీ చేస్తాయి కాబట్టి తిరుపతి ఉప ఎన్నికలో రెండోస్థానం రావడం పెద్ద కష్టమేదీ కాదన్నది బీజేపీ నేతల అభిప్రాయం. తెలంగాణలో కాంగ్రెస్ ను ఎలాగైతే వెనక్కు నెట్టామో? ఏపీలో టీడీపీని బలహీనపర్చే యత్నాలు బీజేపీ మొదలుపెట్టింది.

చేరికలతో …..

తిరుపతి ఉప ఎన్నికలకు ముందే పెద్దయెత్తున చేరికలు ఉండేలా చూసుకోవాలని కేంద్ర నాయకత్వం నుంచి ఆదేశాలు అందినట్లు తెలిసింది. దీంతో బీజేపీ రాష‌్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నలుగురు ముఖ్యమైన నేతలకు ఈ బాధ్యతలను అప్పగించారు. ప్రధానంగా అసంతృప్తి ఉన్న టీడీపీ నేతలపై వీరు దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. తిరుపతి ఉప ఎన్నికలకు ముందే వీరిని బీజేపీలోకి చేర్చుకోవాలని నిర్ణయించారు. కొందరిపేర్లను అధినాయకత్వానికి పంపినట్లు తెలిసింది. అయితే చేరికలతో బీజీపీ బలోపేతమై, టీడీపీ బలహీనమవుతుందా? అంటే దానికి సమాధానం మాత్రం లేదు.

Tags:    

Similar News