కొంప ముంచనున్న బీజేపీ దూకుడు ?

బీజేపీ రాజకీయ చాతుర్యం ఎవరికీ చేతకాదు, వంటబట్టదు కూడా. ఏమీ లేని చోట కూడా ఎంతో ఉందనిపించే చాణక్యం బీజేపీది, లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో ధీటైన నాయకులుగా [more]

Update: 2020-12-03 05:00 GMT

బీజేపీ రాజకీయ చాతుర్యం ఎవరికీ చేతకాదు, వంటబట్టదు కూడా. ఏమీ లేని చోట కూడా ఎంతో ఉందనిపించే చాణక్యం బీజేపీది, లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో ధీటైన నాయకులుగా ఉన్న కేసీఆర్, జగన్, చంద్రబాబు లాంటి వారే తికమక పడేలా బీజేపీ ఒక్క లెక్కన దూకుడు చేస్తోంది. 119 సీట్లు ఉన్న తెలంగాణాలో బీజేపీ వాటా రెండే సీట్లు, అన్ని లోకల్ బాడీ ఎన్నికలూ టీయారెస్ గెలుచుకున్నా తులసీదళంలా ఒక్క దుబ్బాక చాలు మాకు అంటూ టీయారెస్ ని దెబ్బ తీసేసింది. దాంతో ఏనుగు లాంటి గులాబీ పార్టీ గ్రేటర్ ఎన్నికల వేళ తెగ పరేషాన్ అయిపోయింది.

కసిగా కమలం…

ఏపీలో చూసుకుంటే బీజేపీకి గుండు సున్నానే అంటారు. శాసనమండలిలో ఇద్దరు తప్ప మొత్తం ఏపీలో ఏ వైపు చూసినా ఆ పార్టీ ప్రజా ప్రతినిధి మూడోవారే అసలు కనిపించరు. ఇతర పార్టీల నుంచి జంప్ చేసిన వారిని కలుపుకుని వాపునే బలంగా బీజేపీ చూపిస్తోంది. ఇక తిరుపతిలో వైసీపీకి ఎంపీ అభ్యర్ధికి వచ్చిన మెజారిటీ రెండు లక్షల 28 వేలు. ఆ చివరి 28 వేల ఓట్లు కూడా బీజేపీ క్యాండిడేట్ కి 2019 ఎన్నికల్లో రాలేదు. కేవలం పదహారు వేల ఓట్లు మాత్రమే దక్కాయి. దాదాపుగా అయిదు లక్షల దాక టీడీపీ ఓట్లు రాబట్టింది. అయినా కూడా బీజేపీ తిరుపతి ఉప ఎన్నికల వేళ అపుడే షో మొదలెట్టేసింది.

ప్రభావం పడుతోందిగా..?

బీజేపీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలా గింజుకున్నా రెండకెల సీట్లు రావడం కష్టమన్న రాజకీయ విశ్లేషణలు ఓ వైపు ఉండగానే బీజేపీ మాత్రం నాదే భవిష్యత్తు అంటూ జబ్బలు చరుస్తోంది. ఆ విధంగా ప్రచారాన్ని అదరగొట్టడం వెనక టార్గెట్లు వేరేగా ఉన్నాయి. ఇప్పటిదాకా టీడీపీలో ఉంటూ అయోమయంగా చూస్తున్న నేతలను ఆకట్టుకోవడం ఒక ఎత్తు అయితే మరో వైపు జనాలకు తామే అసలైన ఆల్టర్నేషన్ అని సందేశాన్ని గట్టిగా పంపడం మరో ఎత్తుగడ. దీనికోసమే ప్రతీ ఎన్నికనూ బీజేపీ ఒక నిచ్చెనగా వాడుకుంటోంది. దాంతో ఇపుడు ఏపీలో వైసీపీలోకి పోలేక టీడీపీలో ఉండలేక ఉన్న నాయకులకు, ఇతర పార్టీల్లోని అసంతృప్తి నేతలకు బీజేపీ వేదికగా మారుతోంది.

ఇద్దరికీ ముప్పే…?

బీజేపీ అనే ఫ్యాక్టర్ దూకుడు చేయడం అంటే అది ఏపీలో చంద్రబాబుకే కాదు జగన్ కి కూడా ముప్పు తెచ్చిపెట్టేదేనని అంటున్నారు. ముందుగా బాబుని, ఆయన పార్టీని వంచేసి ముందుకు పోవాలని సోము వీర్రాజు పక్కా ప్లాన్ తో ఉన్నారు. ఈ జోరు ఇలాగే కొనసాగితే జగన్ ని ఆయన వైసీపీని కూడా డైరెక్ట్ గా టార్గెట్ చేసి అనుకున్న అధికార పీఠానికి చేరువ కావచ్చు అన్నది కూడా బీజేపీ వ్యూహం. నిజంగా ఏపీలోని రెండు బలమైన ప్రాంతీయ పార్టీల దయనీయమైన స్థితి ఏంటి అంటే బీజేపీని ఒక్క మాట కూడా అనలేని నిస్సత్తువతో ఉండడమే. ఎంతసేపూ మోడీని ప్రసన్నం చేసుకునే తాపత్రయంలో అసలు పట్టూ గుట్టూ చేజారిపోతున్నాయన్న సత్యాన్ని ఇరు పార్టీల పెద్దలు గ్రహించలేకపోతున్నారు. తీరా వెనక్కి తిరిగి చూసుకుంటే ఏముంటుందో 2024 ఎన్నికలే చెప్పాలి మరి.

Tags:    

Similar News