తొంగి చూడటం లేదే… ఎందుకలాగ?

నిజానికి జనసేన, బీజేపీ పొత్తు ఉందంటే చేరికలు ఎలా ఉండాలి? కేంద్రంలో ఉన్న అధికార పార్టీ బీజేపీలో చేరికలు లేక వెలవెల బోతుంది. గత కొన్ని నెలలుగా [more]

Update: 2020-10-28 09:30 GMT

నిజానికి జనసేన, బీజేపీ పొత్తు ఉందంటే చేరికలు ఎలా ఉండాలి? కేంద్రంలో ఉన్న అధికార పార్టీ బీజేపీలో చేరికలు లేక వెలవెల బోతుంది. గత కొన్ని నెలలుగా ఏపీ బీజేపీ వైపు ఎవరూ కన్నెత్తి చూడటం లేదు. దీనికి కారణాలేంటన్న దానిపై చర్చ జరుగుతోంది. వాస్తవానికి 2019 ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ లో చేరేందుకు ఎవరూ రాకూడదు. ఎందుకంటే ఏపీలో నోటా కంటే బీజేపీకి తక్కువ ఓట్లు వచ్చాయి.

ఎన్నికల ఫలితాల తర్వాత కూడా……

అయితే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంతో పాటు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడటంతో తొలినాళ్లలో టీడీపీ నేతలు బీజేపీ వైపు నడిచారు. సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, వరదాపురం సూరి, రావెల కిశోర్ బాబు తదితర నేతలంతా బీజేపీ లో చేరారు. అయితే వీరంతా వైసీపీ ప్రభుత్వం నుంచి వేధింపులు తట్టుకోవడానికే బీజేపీ షెల్టర్ గా ఎంచుకుని చేరిపోయారన్న సంగతి అందరికీ తెలిసిందే.

బీజేపీ,జనసేన కలిసినా….

కానీ ఎన్నికల తర్వాత మరో బలమైన పార్టీ జనసేన బీజేపీతో జట్టుకట్టింది. దీంతో చేరికలు పెద్దయెత్తున ఉంటాయని అందరూ ఊహించారు. అటు కేంద్రంలో మోదీ ఇమేజ్, ఇటు రా‌‌ష్ట్రంలో పవన్ కల్యాణ్ చరిష్మా పనిచేస్తుంది కాబట్టి ఎక్కువ మంది ఆకర్షితులవుతారని అనుకున్నారు. అలాగే ఏపీలో తెలుగుదేశం పార్టీ బలహీనపడుతుండటంతో చేరికలు తమ పార్టీలో జోరుగా ఉంటాయని బీజేపీ నేతలు అంచనా వేశారు.

చేరికలు మాత్రం……

కానీ కొన్ని నెలలుగా బీజేపీ కండువా కప్పుకునే వారే ఏపీలో కరవయ్యారు. ఇందుకు రెండు ప్రధాన కారణాలు కన్పిస్తున్నాయి. ఒకటి బీజేపీ రెండు నాల్కల ధోరణి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను సమర్థిస్తుండటం, రాష్ట్ర పార్టీ దానిని వ్యతిరేకిస్తుండటం. మరో కారణం సోము వీర్రాజు పార్టీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన తర్వాత వరసగా సస్పెన్షన్లు చేస్తూ పోతుండటం. క్రమశిక్షణ పేరుతో సోము వీర్రాజు వరసగా చర్యలు తీసుకుంటుండటం కూడా చేరికలు లేకపోవడానికి కారణాలుగా చెబుతున్నారు. మొత్తం మీద బీజేపీ, జనసేన కలసినా ఎవరూ ఆ పార్టీ వైపు తొంగి చూడకపోవడానికి కారణాలను పార్టీ అగ్రనేతలే అన్వేషించుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News