ఇప్పటికి అర్థమయిందా? సీన్ అదేనా?

అధికారం కోసమే ఎవరైనా రాజకీయం చేస్తారు, పదవులో కోసమే ఎవరైనా పాకులాడతారు. నాకు ఏమీ వద్దు అంటూ రాజకీయం మొదలుపెడితే జనసేనాని పవన్ కళ్యాణ్ కధ లాగానే [more]

Update: 2020-08-20 14:30 GMT

అధికారం కోసమే ఎవరైనా రాజకీయం చేస్తారు, పదవులో కోసమే ఎవరైనా పాకులాడతారు. నాకు ఏమీ వద్దు అంటూ రాజకీయం మొదలుపెడితే జనసేనాని పవన్ కళ్యాణ్ కధ లాగానే ఉంటుంది. ముఖ్యమంత్రి పదవి కోసం కాదు, ప్రశ్నిద్దామని రాజకీయాల్లోకి వచ్చానని పవన్ చెప్పుకున్నారు. అందుకే జనం ఆయన పాలిటిక్స్ ని సీరియస్ గా తీసుకోలేదు. ఇక బీజేపీతో జట్టు కట్టి సమరోత్సాహంతో పవన్ ఉన్నారు. మరో వైపు ఏపీ బీజేపీ కొత్త కామందు ఏదో చేస్తారని కార్యకర్తలు కూడా ఆశపడుతున్నారు. వీటిని పూర్తిగా పూర్వపక్షం చేస్తూ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ సొంత పార్టీకే షాక్ ఇచ్చేశారు.

కష్టమేనా….

ఏపీలో అధికారంలోకి బీజేపీ, జనసేన కూటమి రావడం కష్టమేనని అనేక విశ్లేషణలు చెబుతున్నాయి. అది వారి మాట. కానీ రేసులో ఉన్న వారు అలా అనుకోకూడదు, అనుకుంటే నిరాశే మిగులుతుంది. అడుగు కూడా ముందుకు పడదు, అర్జునుడి చూపు పక్షి కన్ను మీదనే ఉండాలి. ఇది రాజనీతి, యుధ్ధరీతి. కానీ రాం మాధవ్ మాత్రం ఏపీలో అధికారం దుర్లభం అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఏపీలో సీటు పట్టాలంటే కష్టమేనని కూడా ఒక విశ్లేషకుడి మాదిరిగా చెబుతున్నారు. ఇది నిజంగా కమలనాధులకు ఇబ్బంది కలిగించేదే. ఏపీలో స్పేస్ ఉందా లేదా అన్నది పక్కన పెడితే కనీసం సొంత క్యాడర్ అయినా జనంలోకి వెళ్లాలంటే గట్టిగా బూస్ట్ ఇవ్వాలి. కానీ రాం మాధవ్ అబ్బే టార్గెట్ రీచ్ కాలేమేమో అని నిట్టూర్పులు విడుస్తున్నారు.

అది మాత్రమేనా…?

అయితే రాం మాధవ్ ఇంకో మాట అన్నారు. ఏపీలో విపక్షం సీటు ఖాళీగా ఉంది. ముందు అక్కడకు వెళ్లి కర్చీఫ్ వేద్దామని చెబుతున్నారు. నిజానికి ఏపీలో ఈ మూడు ముక్కలాటలో బీజేపీ ఎకాఎకీన ఫస్ట్ ప్లేస్ లోకి వస్తుందన్న అంచనాలు ఎవరికీ లేదు, కానీ మూడు నుంచి ఒకటికి ఎగబాకాలి అనుకుంటే రెండు దాకా అయినా వస్తారు, కానీ మన టార్గెట్ ఫస్ట్ కాదు సెకండ్ అని పెద్ద నాయకుడే అంటే జావగారిపోతారు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉండిపోతుంది. ఓ వైపు సోము వీర్రాజు పవన్ కళ్యాణ్, మెగాస్టార్లను కలిసి మరీ వచ్చారు. ఏపీలో ఓ బలమైన కులాన్ని మద్దతుగా పెట్టుకుని ముందుకు సాగాలనుకుంటున్నారు. కానీ కేంద్ర నాయకత్వం మాత్రం బడాయి వద్దు అంటోందిగా.

అయోమయమే….

ఇక ఏపీలో బీజేపీ టార్గెట్ ఎవరు. ఇది కూడా అయోమయమే. బాబు, జగన్ ఈ ఇద్దరూ అని చెబుతున్న ఫస్ట్ బాబే అని జాతీయ నాయకత్వం చెబుతోంది. పొత్తు పెట్టుకున్న జనసేనకు జగన్ టార్గెట్ . ఇలా ఎటూ కూటమిలో ఆ అయోమయం ఉంది. ఇది చాలదన్నట్లుగా మూడు రాజధానుల మీద కూడా బీజేపీలో క్లారిటీ లేదు, అమరావతి రాజధానిగా ఉండాలన్నది మా ఆలోచన అంటూనే కేంద్రానికి ఈ విషయంలో సంబంధం లేదని చెబుతారు. ఇక మూడు రాజధానుల విషయంలో వారి ఇష్టమంటూ వైసీపీకి సపోర్టుగా ఉన్నట్లుగా మరో వైపు మాట్లాడుతారు. ఇంకో వైపు కర్నూలు కి హైకోర్టు రావాలని తామే డిక్లరేషన్లో పెట్టిన‌ట్లుగా చెప్పుకుంటారు. మొత్తానికి ఇటు విధానపరంగా, అటు రాజకీయంగా బీజేపీ అయోమయంలో ఉందని అంటున్నారు. మరి దీన్ని సరిచేసుకోకుండా బీజేపీ ముందుకు సాగితే 2024లో కూడా ఇబ్బందే అవుతుందన్న విశ్లేషణలు ఉన్నాయి.

Tags:    

Similar News