మాటల్లేవు… మాట్లాడుకోవడాల్లేవు…ఇక తేల్చుకోవడాలే

మాటల్లేవు, మాట్లాడుకోవడాల్లేవు . ఇక తేల్చుకోవడాలే అన్నట్లుగా కమలం దూకుడు వ్యూహాన్ని ఆంధ్రప్రదేశ్ లో అమలు చేయాలనుకుంటోంది. గతంలో ఏపీకి సంబంధించి కొంతమేరకు సంప్రదాయ రాజకీయాలను నడుపుతూ [more]

Update: 2020-08-11 15:30 GMT

మాటల్లేవు, మాట్లాడుకోవడాల్లేవు . ఇక తేల్చుకోవడాలే అన్నట్లుగా కమలం దూకుడు వ్యూహాన్ని ఆంధ్రప్రదేశ్ లో అమలు చేయాలనుకుంటోంది. గతంలో ఏపీకి సంబంధించి కొంతమేరకు సంప్రదాయ రాజకీయాలను నడుపుతూ వచ్చింది కమలం పార్టీ. దీనికి భిన్నంగా పూర్తి సంచలనాత్మకమైన స్టాండ్ తో ముందుకు వెళ్లాలనేది తాజా ఎత్తుగడ. ఈ కార్యాచరణను అమలు చేసే బాధ్యత సోము వీర్రాజుదే. రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీలకు రెండు సామాజిక వర్గాలు పునాదులుగా నిలుస్తున్న మాట వాస్తవం. అందరూ అంగీకరించే విషయమే. అయితే ఆ సామాజిక వర్గాలు మాత్రమే ఆయా పార్టీలకు గెలుపోటములు తెచ్చిపెట్టవు. కానీ ఆయా పార్టీలకు మూలాధారంగా ఉంటూ ఆర్థికంగా, సామాజికంగా మద్దతు సమకూర్చి పెడుతుంటాయి. రాష్ట్రంలో మిగిలిన పార్టీలకు అటువంటి ప్రాతిపదిక లోపించింది. 2009లో ప్రజారాజ్యం ఏర్పాటైన కొత్తలో మూడో సామాజిక వర్గం స్ట్రాంగ్ సపోర్టు బేస్ గా ఏర్పడుతుందనే భావన వచ్చింది. కానీ ప్రజారాజ్యం మూన్నాళ్ల ముచ్చటగా ముగిసిపోయింది. ఆశలు ఆవిరైపోయాయి.

చేదు అనుభవమే…

జనసేన రూపంలో పవన్ కల్యాణ్ మరోపార్టీకి 2014లో శ్రీకారం చుట్టారు. తొలి దశలో పార్టీ ప్రభావం ప్రజాక్షేత్రంలో చూపించలేదు. సార్వత్రిక పోటీకి దూరంగా నిలిచారు. తెలుగుదేశం పార్టీకి మద్దతునిచ్చి ఆ పార్టీ గెలుపులో భాగస్వాములయ్యారు. దీంతో పార్టీ తొలి ఇంపాక్ట్ లేకుండా పోయింది. సొంతంగా పార్టీ పెట్టి ఒక బలమైన సామాజిక వర్గ పునాది నిర్మించుకునే అవకాశాన్ని చేజేతులారా పోగొట్టుకున్నారు. ఈ పరిణామంసహజంగానే ప్రధాన పార్టీలైన టీడీపీ , వైసీపీలకు కలిసొచ్చింది. 2019లో జనసేన పోటీ చేసినప్పటికీ గెలుపోటములను తారుమారు చేయగల ప్రభావాన్ని చూపలేకపోయింది. భారీస్థాయి ఓటింగును చేజిక్కించుకోలేకపోయింది. పవన్ సామాజిక వర్గం జనసేనను పూర్తిగా సొంతం చేసుకోలేకపోవడం ఇందుకు ఒక కారణమని పరిశీలకుల అంచనా. అందులోనూ అప్పటి అధికార పార్టీ అయిన టీడీపీకి మద్దతుగా ఓట్లను చీల్చే ఉద్దేశంతోనే విడిగా రంగంలోకి దిగారనే ప్రచారం సైతం జనసేనను కొంత డ్యామేజ్ చేసింది. పవన్ కు ఉన్న అభిమానుల ఫాలోయింగ్ దృష్ట్యా సొంత సామాజికవర్గాన్ని క్లెయిం చేసుకునే రాజకీయ సాహసాన్ని ఆయన చేయలేకపోయారు. అది కొంతమేరకు పవన్ బలహీనతే. భారతీయ జనతాపార్టీకి విభిన్న సమీకరణలతో ఈ మొహమాటానికి స్వస్తి పలకాలని భావిస్తోంది.

ఏపీలో అంతే…

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఒక బలమూ ఉంది. అలాగే బలహీనతా వెంటాడుతోంది. రెండు సామాజిక వర్గాలు ప్రధాన పార్టీలకు వెన్నుదన్నుగా ఉండటం, వాటి చుట్టూ ఇతర సామాజిక వర్గాల సమీకరణ బలంగా సాగుతుండటంతో రాజకీయ స్థిరత్వం నెలకొంది. అదే సమయంలో సమాజంలోని మిగిలిన వర్గాలకు సమ ప్రాధాన్యంతో ప్రాతినిధ్యం లభించడం లేదనే ఆవేదన కొనసాగుతోంది. రాష్ట్రంలో రెండు పార్టీలు ముఖాముఖిగా సమీకరించడంతో మూడో పక్షానికి అవకాశం లేకుండాపోతోంది. జాతీయపార్టీలు కాలూనుకోలేకపోతున్నాయి. ఈ బలహీనత కారణంగానే తృతీయ ప్రత్యామ్నాయం మాట వరసకే మిగిలిపోతోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రాన్ని చూస్తుంటే వామపక్షాలు నామమాత్రమైపోయాయి. గతంలో ఏదో ఒక పార్టీతో చేరితే కొన్ని సీట్లలో ప్రభావం చూపుతుండేవి. కనీసం పది పన్నెండు స్థానాల్లో గెలుపోటములను ప్రభావితం చేస్తుండేవి. భారతీయ జనతాపార్టీ భావోద్వేగం పెల్లుబికినప్పుడు ఎంతోకొంత ఫలితాలను సాధిస్తోంది. కానీ సాధారణ పరిస్థితుల్లో మిగిలిన జాతీయ పార్టీల తరహాలోనే మిగిలిపోతోంది. భారతీయ జనతా పార్టీకి ఇక్కడ సామాజిక పునాది లేకపోవడం ఇందుకు ఒక కారణంగా చెప్పాలి.

‘మెగా’ పాఠాలు…

చిరంజీవి ప్రజారాజ్యానికి, పవన్ కల్యాణ్ జనసేనకు వారి సామాజిక వర్గం చేదోడుగా నిలిచింది. కానీ ఆ వర్గ మద్దతును పూర్తి స్థాయిలో సంఘటితం చేస్తూ కొనసాగించడంలో మెగా హీరోలు సక్సెస్ కాలేకపోయారు. ఇప్పుడు భారతీయ జనతాపార్టీ ఆ లోపాన్ని పూరించాలని చూస్తోంది. భారతీయ జనతాపార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన సోము వీర్రాజు పై ఈ బాధ్యతను అధిష్ఠానం ఉంచినట్లుగా పరిశీలకులు భావిస్తున్నారు. ఆర్థికంగా వైసీపీ, టీడీపీలను వెన్నంటి ఉన్న సామాజిక వర్గాలకు దీటుగా పోటీనివ్వగల సత్తా ఈ సామాజిక వర్గానికి ఉందనే విశ్వాసం బీజేపీలో నెలకొంది. పైపైచ్చు అధికార, ప్రతిపక్ష పార్టీలకు దన్నుగా నిలుస్తున్న సామాజిక వర్గాల కంటే ఈ వర్గం ఓటు బ్యాంకు నాలుగు రెట్లు ఎక్కువ.

కర్ణాటక మోడల్…

పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో లింగాయత్ సామాజిక వర్గ దన్నుతో బీజేపీ అధికారం సాధించగలిగింది. ఆ సామాజిక వర్గానికి చెందిన యడియూరప్ప తీరుపై బీజేపీలో అసంత్రుప్తి ఉన్నప్పటికీ సంఘటితంగా ఓటు బ్యాంకును తెచ్చిపెట్టడంలో ఆయన పాత్రను తోసిపుచ్చలేకపోతోంది. ఓ వర్గం నుంచి అత్యధిక ఓట్లను తెచ్చుకుంటే మిగిలిన వర్గాల నుంచి ఓ మోస్తరు ఓట్లను సమీకరించగలిగినా బహుముఖ పోటీల్లో అధికారానికి బాటలు పడతాయి. ఆంధ్రప్రదేశ్ లో సైతం ఈతరహా మోడల్ ను అనుసరించేందుకు అవకాశం ఉంది. పవన్ కల్యాణ్ జనసేనతో బీజేపీకి ఇప్పటికే మైత్రి బంధం ఉంది. పవన్ గ్లామర్, ఇమేజ్, బీజేపీ ఐడియాలజీ, నరేంద్ర మోడీ కరిష్మా కలగలిసి కచ్చితంగా ప్రత్యామ్నాయ శక్తి అవుతుందని బీజేపీ శ్రేణులు విశ్వసిస్తున్నాయి.

పునాది చుట్టూ భవనం…

బేస్ గా ఒక సామాజికవర్గం ఉంటూ దాని ఓటు బ్యాంకు కు ఇతర వర్గాల చేరికలు కలిస్తే వైసీపీ, టీడీపీల కు సవాల్ విసరగలుగుతుంది. ప్రధాన పార్టీలకు పోటీగా, దీటుగా రంగంలో ఉన్నట్లుగా ప్రజల్లో విశ్వాసం కలిగిస్తేనే బీజేపీ, జనసేనకు తటస్థుల నుంచి మద్దతు లభిస్తుంది. ఆ వ్యూహం ఫలించాలంటే బలమైన సామాజిక వర్గం అండగా ఉందనే సంకేతాలు పంపించాలి. అందుకే మొహమాటం లేకుండా రాష్ట్రంలో దాదాపు 15 శాతం వరకూ ఓటింగ్ ఉన్న బలమైన సామాజిక వర్గ మద్దతు సమీకరణ యత్నాలు చేపట్టింది బీజేపీ. సోము వీర్రాజు బాధ్యతల స్వీకరణ సందర్భంలో బీజేపీ జాతీయ నాయకుడైన రాం మాధవ్ రాష్ట్రంలో ప్రతిపక్షం స్థానం ఖాళీగా ఉందని చెప్పేశారు. ప్రతిపక్ష స్థానం లక్ష్యంగా టీడీపీని బలహీనపరుస్తూ బలపడాలనేది బీజేపీ దీర్ఘకాలిక వ్యూహం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News