బీజేపీకి ఇప్పటికైనా అర్ధమవుతోందా ?

ఏపీలో బీజేపీ పరిస్థితి దారుణం. ఇక్కడ ఉన్న అసలు నాయకుల కంటే కొసరు నాయకులు చాలా పెద్ద కబుర్లు చెబుతారు. తామే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాబోతున్నట్లుగా [more]

Update: 2020-06-24 08:00 GMT

ఏపీలో బీజేపీ పరిస్థితి దారుణం. ఇక్కడ ఉన్న అసలు నాయకుల కంటే కొసరు నాయకులు చాలా పెద్ద కబుర్లు చెబుతారు. తామే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాబోతున్నట్లుగా బిల్డప్ ఇస్తారు. మరి జాతీయ భావాలు కలిగిన పార్టీ, తేడా గల పార్టీ అని గొప్పగా చెప్పుకునే బీజేపీలో ఇలాంటి అయారాం, గయారాంలను ఎలా భరిస్తోందన్నదే ఆ పార్టీని అభిమానించే వారి బాధ. మోడీ హయాంలో ఇలా బీజేపీ కేవలం రాజకీయం కోసమే అన్ని పార్టీల వారిని చేర్చుకుని పూర్తిగా ఏపీలో కంపుకొట్టించేసుకుంటోందని అర్ధమైంది. నిజానికి సుజనా చౌదరి కాకుండా ఏపీలో ఏ బీజేపీ నేత కూడా ఇలాంటి హోటల్ మీటింగులు, సీక్రేట్ భేటీలు పెట్టరు. ఎంత చెడ్డా బీజేపీకి ఒక సిధ్ధాంతం అంటూ ఉంది. పైగా ఆరెస్సెస్ ట్రైనింగ్ కొంత నైతికత మప్పుతుంది. ఆబగా వచ్చారు కదా టీడీపీ నుంచి వచ్చిన వారిని చేర్చేసుకున్నందుకు నిజంగా బీజేపీ ఇపుడు బాధపడుతూ ఉంటుందా.

ఇక్కడ తిని ….

వెనకటికి ఒక అవకాశవాది తిన్న చోట ఇంటి వాసాలు లెక్కపెట్టి పొరుగువాడికి సహాయం చేశాట్ట. బీజేపీలో చేరిన సుజనా చౌదరి తదితరుల కధ ఇలాగే ఉంది. వారికి బాబు మీద వల్లమాలిన అభిమానం అని అందరికీ తెలిసినా బీజేపీ పెద్దలకు తెలియదు అనుకోవాలేమో. తెలిసినా రాజకీయం అంటూ సరిపుచ్చుకుంటారేమో. ఎన్ని చేసినా కూడా ఏపీలో పార్టీ పరువు పోతున్నా కూడా వారికి అర్ధం కావడం లేదా అన్నదే ఇక్కడ పాయింట్. ఇంత అయోమయం గల పార్టీ ఇన్ని కలగూర గంపలతో నిండిన పార్టీ ఏపీలో ఒక్క బీజేపీ తప్ప మరోటి లేదంటే నమ్మాలి. ఏపీలో అధికారంలోకి వస్తామని ఫోజులు కొడుతున్న పార్టీ ఉండాల్సిన తీరు ఇదేనా. రాజ్యాంగ విలువలు మరచి ఒక ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తిని పావుగా మార్చి రాజకీయం ఆడడమేనా. దీన్ని చూసినపుడు ఏపీ జనానికి బీజేపీ అంటే మరింత ఆగ్రహం కలుగకమానదు.

కుట్ర కోణమా…?

ఇక సుజనా చౌదరికి చంద్రబాబు కుడిభుజం అన్న పేరు ఉంది. ఆయన బీజేపీలో చేరింది కూడా బాబు రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చడానికే. ఇక ఏపీలో వైసీపీ సర్కార్ని అస్థిరపరచాలని బాబు కనుక కుట్ర పన్నితే అందులో సుజనా చౌదరి భాగం అయితే ఆ పాపం ఎవరికి చుట్టుకుంటుంది. ఎంతో బలం, బలగం కలిగిన కేంద్రానికి ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు తెలియవు అనుకోగలమా. అంటే నాడు ఎన్టీయార్ మీద కేంద్రం కన్నేసి దించేసినట్లుగా అతి పెద్ద ప్రజా మద్దతుతో అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ ని దించడానికి ఏమైనా కుట్ర పన్నుతున్నారా. అదేంటో చెప్పమని వైసీపీ నేత అంబటి రాంబాబు లాంటి వారు గట్టిగానే అడుగుతున్నారు.

అభాసు పాలేనా…?

ఏపీలో బీజేపీని అధికారంలో ఉన్నన్నాళ్ళు తనకు అనుకూలంగా వాడుకుని కంపుకొట్టించిన చంద్రబాబు ఇపుడు తన మనిషిని ఆ పార్టీలోకి పంపి మరింతగా దెబ్బ తీస్తున్నారని కమలం పార్టీలోనే మండిపడుతున్న వారు ఉన్నారు. నిజానికి సుజనా చౌదరి ప్రజా నాయకుడు కాడు, ప్రత్యక్ష ఎన్నికల్లో ఎపుడూ గెలవలేదు, ఆయన్ని చేర్చుకుని బీజేపీ ఏపీలో ఎలా బలపడగలమనుకుందో తెలియదు, విలువలకు తిలోదకాలు ఇచ్చేసి రాజ్యసభలో మెంబర్ షిప్ పెరిగింది అనుకోవడానికే కేంద్ర నాయకత్వం అనుమతిస్తే వచ్చిన అవకాశాన్ని ఫుల్ గా వాడేసుకుని సుజనా చౌదరి లాంటి వారు ఏపీలో బీజేపీకి గబ్బు పట్టిస్తున్నారు. మొత్తానికి ఇపుడు ఏపీలో టీడీపీ పరువు ఎటూ పోయింది. ఇపుడు బీజేపీ కూడా బదనాం అయింది. ఇది అన్ని విధాలుగా జగన్ కే మేలు చేసే వ్యవహారమే. ఇక బీజేపీకి వచ్చే ఎన్నికల్లో కూడా ఆశలు పెట్టుకోనక్కరలేదని తాజా పరిణామాలు సహా గత ఏడాది వ్యవహారాలు గట్టిగానే చెబుతున్నాయి. ఇలా ఇన్ని విధాలుగా జరిగినా కమలానికి ఇప్పటికైనా అర్ధమ‌వుతోందా.

Tags:    

Similar News