అది దక్కదూ.. ఇది చిక్కదూ ?

రెండు తెలుగు రాష్ట్రాలు. 42 ఎంపీ సీట్లు, ఓ విధంగా దక్షిణాదిన అతి పెద్ద నంబర్. సౌత్ లో పాగా వేస్తే ఇలాగే వేయాలి. గతంలో రెండు [more]

Update: 2020-08-12 03:30 GMT

రెండు తెలుగు రాష్ట్రాలు. 42 ఎంపీ సీట్లు, ఓ విధంగా దక్షిణాదిన అతి పెద్ద నంబర్. సౌత్ లో పాగా వేస్తే ఇలాగే వేయాలి. గతంలో రెండు సార్లు కాంగ్రెస్ కేంద్రంలో జెండా ఎగరేయడానికి ఉమ్మడి ఏపీలో మెజారిటీ సీట్లు బాగా ఉపయోగ‌పడ్డాయి. బీజేపీకి కూడా ఇపుడు తెలుగు రాష్ట్రాల మీద ఎక్కడ లేని మోజు కలుగుతోంది. ఎందుకంటే ఇక్కడ గెలుచుకుంటేనే రేపటి రోజున మళ్ళీ ఢిల్లీ పీఠం చేతిలోకి వస్తుంది, ఉత్తరాది నుంచి మాగ్జిమం పిండేశారు. ఇక అక్కడ ఒక్క సీటూ కొత్తగా రాలకపోగా ఉన్న సీట్లకు గండి పడనుంది.

కేటీయారేనా ….?

అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేయడం అంత ఈజీ కాదు, రెండు బలమైన ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి. తెలంగాణాలో కేసీయార్ చరిష్మా ఎక్కడా చెక్కుచెదరలేదు. ఆయన‌కు తోడుగా కేటీయార్ యువ నేతగా ఎదుగుతున్నాడు. కేసీయార్ 2023 ఎన్నికల నాటికి తప్పుకుని కుమారుడికి పగ్గాలు అప్పచెబుతారు. ఆయనకు తెలంగాణాలో పోటీ పెద్దగా లేదనే చెప్పాలి. ఉందీ అంటే అది కాంగ్రెస్ నుంచే. ఆ కాంగ్రెస్ గెలవదు కానీ మరో జాతీయ పార్టీ బీజేపీకి అడ్డుగా మారుతుంది. ఈ రెండు జాతీయ పార్టీలదీ తూర్పు పడమరల వ్యవహారం. దాంతో వాళ్ళు అలా విడిగా ఎంత తన్నుకుంటే అంతగా టీయారెస్ కి రాజకీయ ఉపయోగం.

జగనే మళ్ళీ…..

ఇక ఏపీలో చూసుకుంటే జగన్ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. అందరికీ ఏపీలో అభివృధ్ధి జరగలేదన్నది కనిపించవచ్చు కానీ జగన్ చూపు మాత్రం ఓట్ల రాజకీయం మీదనే ఉంది. ఆయన తన అధికారాన్ని ఉపయోగించి వరసగా ఓట్ల విత్తనాలు వేసుకుంటూ పోతున్నారు. రేపటి రోజున ఆ పంటతో వచ్చే ఫలితాలు అన్నీ వైసీపీకే అనుకూలం కానున్నాయి. ఇక ఏపీలో కూడా జగన్ కి ఒక అడ్వాంటేజ్ ఉంది. టీడీపీ బీజేపీ, జనసేన కూటమి త్రిముఖ పోటీలో ఉంటే మళ్ళీ మళ్ళీ గెలవడడం సులువు. ఆ పార్టీల మధ్య పోటీతో వైసీపీనే జగన్ ఆదరిస్తారు. ఓట్ల చీలిక కూడా అలా కలసివస్తుంది. పైగా బలమైన పునాదిని కూడా వైసీపీకి జగన్ వేస్తున్నారు. దాంతో జగన్ ఓటు బ్యాంక్ ని కనీసం టచ్ చేసే స్థితిలో బీజేపీ ఉండదు, బీజేపీ ఎంత ఎదిగితే అంత టీడీపీకి దెబ్బ. ఈ రెండు ఎంత ఎదిగినా వైసీపీ బలానికి సగానికి కూడా రాలేవు. ఇదే రకమైన అంచనాలతో వైసీపీ దూకుడు మీద ఉంది.

కష్టమేనా …?

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను గెలుచుకోవడం వేరు. తెలుగు రాష్ట్రాల రాజకీయం వేరు. బీజేపీకి ఇక్కడ బలమైన ప్రాంతీయ శక్తులే అడ్డుకట్ట వేస్తాయి. పైగా తెలంగాణాలో కేసీయార్ వయో వ్రుధ్ధుడైతే కేటీయార్ యువ నేతగా ఉన్నారు. ఏపీలో చంద్రబాబు టీడీపీ ఓడిందంటే మరో యువనేత జగన్ రూపంలో ఎదురు నిలబడ్డారు. అందువల్ల ఎన్ని ప్రయోగాలు చేసినా, మరెంతగా ఆవేశపడినా, ఆశపడినా బీజేపీకి తెలంగాణా దక్కదు, ఏపీ చిక్కదు అన్నట్లుగా పొలిటికల్ సీన్ క్లియర్ గా ఉంది. దాంతో తెలుగు వారితో పొత్తు పెట్టుకుని నెగ్గే రోజు ఎపుడా అన్నదే కమలనాధుల అంతర్మధనంగా ఉందిపుడు.

Tags:    

Similar News