త్రిశూల వ్యూహమే కమలం ప్లాన్ …?

తెలుగు రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికల నాటికి ప్రత్యామ్నాయ శక్తిగా మారాలన్నది జాతీయ బిజెపి నిర్ధేశించుకున్న లక్ష్యం. అందుకోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో బిజెపి సారథుల్లో మార్పు చేసింది [more]

Update: 2020-08-02 11:00 GMT

తెలుగు రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికల నాటికి ప్రత్యామ్నాయ శక్తిగా మారాలన్నది జాతీయ బిజెపి నిర్ధేశించుకున్న లక్ష్యం. అందుకోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో బిజెపి సారథుల్లో మార్పు చేసింది కమలం. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లలో జాతీయ పార్టీ కాంగ్రెస్ కుదేలయింది. ముఖ్యంగా ఏపీ లో అయితే మట్టికొట్టుకుని పోయి బంగాళాఖాతంలో కలిసి పోయింది. తెలంగాణ లో ఎపి కన్నా కాస్త బెటర్ గానే కాంగ్రెస్ ఉన్నప్పటికీ చాలామంది నేతలు గులాబీ కండువా లేదా కాషాయ కండువా కప్పేసుకుంటూ హస్తానికి షాక్ ఇస్తూ వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అన్న రణ నినాదాన్ని పార్టీ శ్రేణుల్లో నింపి రెండు రాష్ట్రాల్లో గట్టి పోరాటం చేస్తే ద్వితీయ స్థానం లో నిలవొచ్చన్నది కమలదళం ఆలోచన అంటున్నారు విశ్లేషకులు.

మోడీ అభివృద్ధి, మతం, కులం ….

ప్రధాని నరేంద్ర మోడీ సమర్ధ నాయకత్వం, అభివృద్ధి మంత్రాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలి. సున్నితమైన కులం, మతానికి సంబంధించి ఏ చిన్న అంశాన్ని విడవకుండా పెద్ద ఎత్తున పోరాటం చేయాలి. తెలంగాణ లో టీఆరెస్, కాంగ్రెస్ లను, ఎపి లో వైసిపి, టిడిపి లతో సమాన దూరం పాటిస్తూ రెండు పార్టీలపై యుద్ధం సాగించాలి. ఇలా త్రిశూల వ్యూహంతో ముందుకు సాగడంతో బాటు ప్రధాన పార్టీలనుంచి వచ్చే బలమైన నేతలకు కండువాలు కప్పుతూ బూత్ స్థాయిలో కార్యకర్తలను నియమిస్తూ ముందుకు వెళ్లాలన్నది బిజెపి నిర్ధేశిత లక్ష్యం అంటున్నారు. ఈ పనులన్నీ త్రికరణ శుద్ధిగా అమలు చేయాలి అంటే పార్టీని నమ్ముకున్న సుశిక్షితులైన ఆర్ ఎస్ ఎస్ భావజాలం ఉన్నవారే ఉండాలి. అందుకే తెలుగు రాష్ట్రాల దళపతులను సొంత వారిని నియమించి వారికి అసలు సిసలు పరీక్ష పెట్టింది కమలం అధిష్టానం.

టిడిపి వ్యూహాన్ని అడ్డుకోగలరా …?

అయితే తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ లో కొంతవరకు ఈ ప్లాన్ బాగా అమలు చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఎపి లో మాత్రం బిజెపి ఎదుగుదలకు దశాబ్దాలుగా భారతంలో సైంధవుడి లా తెలుగు దేశం విజయవంతంగా అడ్డుకుంటుంది. బిజెపి కి జాతీయ స్థాయిలో గాలి వీచినప్పుడల్లా ఆ పార్టీ తో జట్టు కట్టడం తరువాత వదిలేయడం వంటి వ్యూహాలతో తీవ్రంగా కమలాన్ని బలహీనపరిచింది సైకిల్ పార్టీ. చంద్రబాబు ఎత్తుగడలకు 99 లోను 2004 2014 , 2019 లో బిజెపి బాగా బలి అయిపోవడం లెక్కలే చెబుతాయి. చారిత్రక తప్పిదాలు కళ్ళముందే కనపడుతున్నా తాత్కాలిక రాజకీయ అవసరాల కోసం దీర్ఘ కాలిక ప్రయోజనాలు అందుకోలేకపోతుంది బిజెపి. అయితే ఈసారి ఇవన్నీ చదివేసిన మోడీ, అమిత్ షా ద్వయం సీరియస్ గానే దక్షిణాదిలోని తెలుగు రాష్ట్రాల పై కన్నేసింది. తమ లక్ష్యాలు కోసం ఇప్పటికే బాబు మళ్ళీ కలుస్తామని అంతర్గతంగా లాబీయింగ్ చేస్తూ బతిమాలుతున్నా టిడిపి ని బిజెపి దూరంగానే ఉంచింది. ఈ నేపథ్యంలో చూడాలి కొత్త ఫార్ములా ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో.

Tags:    

Similar News