వెలిగిపోవాలంటే ఎలా మరి..?

ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచి మేమే 2024లో నెగేస్తామంటూ జబ్బలు చరచుకుంటున్న బీజేపీ ఆ దిశగా కనీస కార్యక్రమాలు చేస్తోందా అన్న ప్రశ్నలు [more]

Update: 2019-09-04 00:30 GMT

ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచి మేమే 2024లో నెగేస్తామంటూ జబ్బలు చరచుకుంటున్న బీజేపీ ఆ దిశగా కనీస కార్యక్రమాలు చేస్తోందా అన్న ప్రశ్నలు సొంత పార్టీ నుంచే వస్తున్నాయి. ఏపీలో రాజకీయంగా బలపడడానికి బీజేపీ అనుసరిస్తున్న విధానాలు ఏంటి అంటే కేవలం ఫిరాయింపులను నమ్ముకోవడం ఒక్కటే కనిపిస్తోంది. కేంద్రంలో మోడీ గాలి ఉంది, దాంతో గెలిచేస్తామన్న భ్రమలు కూడా బాగానే ఉన్నట్లున్నాయి. ఎన్ని ఉన్నా సరే బీజేపీ ఏపీ పట్ల చూపిస్తున్న నిర్లక్ష్యం చివరికి ఆ పార్టీకి ముప్పు తెచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. తాజాగా గవర్నర్ల నియామకం విషయంలోనూ ఏపీ బీజేపీకి కేంద్రం మొండి చేయి చూపించడంతో ఈ చర్చ అంతా వస్తోంది.

సీనియర్లు ఉన్నా కూడా….

ఏపీ బీజేపీని దశాబ్దాల పాటు ఏ ప్రతిఫలం లేకుండా మోసిన సీనియర్లు ఎందరో ఉన్నారు. వారిలో అగ్రగణ్యుడు పీవీ చలపతిరావు. ఆయన 1980లలో ఏపీ బీజేపీకి తొలి అధ్యక్షుడిగా పనిచేశారు. జనతా ప్రభుత్వం నుంచి విడిపోయాక బీజేపీ ఏర్పడినపుడు జాతీయ స్థాయిలో వాజ్ పేయి ప్రెసిడెంట్ అయితే ఇక్కడ పీవీ కొనసాగారు. ఆయన రెండు సార్లు జనసంఘ్ నుంచి ఎమ్మెల్సీగా గెలిచారు. అంతే కాదు, ఆయన అనేక ఎంపీ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసి మరీ బలోపేతానికి కృషి చేశారు. అటువంటి పీవీకి గవర్నర్ పదవి ఇవ్వవచ్చు కదా అన్న చర్చ సాగుతోంది. 85 ఏళ్ళ కురువృధ్ధుడు ఒడిషాకు చెందిన బిశ్వభూషణ్ హరిచందన్ కి గవర్నర్ ఇచ్చినపుడు పీవీకి ఏం తక్కువ అన్న వారూ ఉన్నారు.

రాజుగారి ఆశలూ అంతే….

ఇక కేంద్రంలో రెండు మార్లు మంత్రిగా పనిచేసిన సినీ నటుడు యూవీ క్రిష్ణంరాజు గవర్నర్ పదవి చేపట్టాలన్న ఆశ చాలాకాలంగా ఉంది. ఆయన తన మనసులో మాటను మోడీతోను, షాతోనూ కూడా చెప్పేశారు. చూద్దామంటూనే తాజా నియామకాల్లో ఏపీ వాటా నుంచి ఆయనకు ఛాన్స్ ఇవ్వకుండా చేశారని అంటున్నారు. దాంతో గోదావరి జిల్లాల్లో బలమైన రాజులు కూడా గుర్రుగా ఉన్నారు. వీరే కాకుండా ఆర్ఎస్ఎస్ లో, బీజేపీలో పనిచేసిన ఎంతో మంది సినియర్లు, మేధావులు, ప్రముఖుల పేర్లను కూడా గవర్నర్ పదవికి కాషాయ పెద్దలు అసలు పరిశీలించలేదని అంటున్నారు.

కేంద్ర మంత్రి కూడా లేదే….?

ఇక తెలంగాణాకు గవర్నర్, కేంద్ర మంత్రి పదవులు ఇచ్చిన బీజేపీ ఏపీకి మాత్రం ఏమీ లేకుండా చేసిందన్న విమర్శలు ఉన్నాయి. కిషన్ రెడ్డిని అక్కడ మంత్రిని చేసిన వారు ఇక్కడ కనీసం రాజ్యసభకు మాజీ ఎంపీ హరిబాబునైనా పంపలేదని అంటున్నారు. ఏపీకి కనీసం ఒక కేంద్ర మంత్రిని కూడా ఇవ్వకుండా రాజకీయంగా కధ నడిపిస్తామంటే కుదిరే పనేనా అని కూడా అంటున్నారు. ఓ వైపు విభజన హామీలకు సున్నా చుడుతూ పదవులను కూడా ఇవ్వకుండా ఏపీలో బీజేపీ వెలిగిపోవాలంటే కుదిరే పనేనా అంటున్నారు ఏపీ బీజేపీ నేతలు.

Tags:    

Similar News