బీజేపీ ఆ…. కార్డ్.. వైసీపీకే మేలు ?

బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపిక ఏపీలో అనేక రాజకీయ సమీకరణలకు సూచికగా చూడాలి. ఇన్నాళ్ళూ ఏపీ రాజకీయాలను బీజేపీ కేవలం హిందూత్వ కోణంలోనే చూసింది. కులాల సంకుల [more]

Update: 2020-08-02 06:30 GMT

బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపిక ఏపీలో అనేక రాజకీయ సమీకరణలకు సూచికగా చూడాలి. ఇన్నాళ్ళూ ఏపీ రాజకీయాలను బీజేపీ కేవలం హిందూత్వ కోణంలోనే చూసింది. కులాల సంకుల సమరంగా ఉన్న ఏపీలో మతాల కంటే కులమే బెటర్ అని బీజేపీకి తెలిసివచ్చేసరికి పుణ్యకాలం గడచింది. ఇపుడు ఏపీలో కాపులను దరిచేర్చుకునే ఎత్తుగడలకు తెరలేపినట్లుగా స్పష్టం అవుతోంది. కాపులు ఏపీలో అధిక సంఖ్యలో ఉన్నా కూడా ఎన్నడూ వారికి రాజ్యాధికారం దక్కలేదు. దాంతో కన్నా లక్ష్మీనారాయణతో మొదట కాపు కార్డు తీసిన బీజేపీ ఇప్పుడు అచ్చమైన బీజేపీ నేతగా సోము వీర్రాజును కాపు కాయమంటోంది. మరోవైపు కాపు సామాజికవర్గానికే చెందిన జనసేనాని పవన్ పార్టీతో పొత్తు పెట్టుకుంది, ఈ రెండూ కలిపి చూస్తే రెడ్లు, కమ్మలకు ప్రత్యామ్నాయంగా కాపులకు కిరీటం అని బీజేపీ ముందుకు వస్తోంది.

కదిలేనా …?

ఏపీలో కాపులు ఎపుడూ సంఘటితంగా లేరు. మూడు దశాబ్దాలు తెలుగు తెరను దున్నేసిన మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినా కూడా కాపులు గుత్తమొత్తంగా ఓట్లు వేయలేదు. ఆనాడు కాంగ్రెస్, టీడీపీ కూడా కాపుల ఓట్లు పంచుకున్నాయి. ఇక 2014 నాటికి అదే సీన్ రిపీట్. నాడు కాపుల్లో ఎక్కువమంది టీడీపీ వైపు వెళ్తే అదే చోట వైసీపీని కూడా బాగానే వారు ఆదరించారు. 2019 నాటికి మెజారిటీ కాపులు వైసీపీ బాట పట్టగా, జనసేన, టీడీపీ కూడా కాపుల ఓట్లు పంచుకున్నారు. దీంతో ఇక్కడ ఒక విషయం స్పష్టమవుతోంది. కాపులు రెడ్లు, కమ్మల మాదిరిగా తమకంటూ రాజకీయ పార్టీని ఒకదానిని ఇప్పటికీ ఓన్ చేసుకోలేదని.

ముద్రగడ ఫెయిల్…..

కాపుల గొంతుకగా దశాబ్దాలుగా ఏపీలో వినిపించిన ముద్రగడ పద్మనాభం సైతం కాపులను ఒక పటిష్టమైన సామాజిక శక్తిగా మలచే విషయంలో ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. కాపులకు కార్పొరేషన్ అని చంద్రబాబు అల్లిబిల్లి గారడీలు చేస్తే అటే వారు మొగ్గారు, ఇక జగన్ కాపులకు బీసీ రిజర్వేషన్ ఇవ్వనని చెప్పినా గెలిచే పార్టీ అంటూ అటువైపూ వెళ్ళిపోయారు. తమ కులస్థుడు అయిన పవన్ జనసేన పెట్టినా కూడా వారి మొగ్గు చూపలేదు, దీనిబట్టి అర్ధం చేసుకోవాల్సింది ఏంటంటే కాపులకు మరీ అంతగా కుల దురాభిమానం లేదన్నది. అలాగే, వారు రాష్ట్రంలో రాజకీయ మార్పులకు ఎప్పటికపుడు తమ వంతుగా ప్రతిస్పందిస్తున్నారు తప్ప కుల పిచ్చితో ఎపుడూ ఎక్కడా వ్యవహరించలేదని తెలుస్తోంది.

జగన్ కే లాభం ……

బీజేపీ ఏపీ రాజకీయాలను అర్ధం చేసుకున్న తీరును బట్టి కాపులకే పెద్ద పీట వేయలనుకుంటోంది. అది ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ నెత్తిన పాలు పోసినట్లే. బీసీలను జగన్ ఇపుడు అక్కున చేర్చుకుంటున్నారు. బీసీలు ఎటూ బీజేపీ వెంట ఇప్పటికైతే లేరు. ఇక వైసీపీకి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ బలం అదనంగా ఉంది. రాజకీయంగా ఆధిపత్య కులంగా ఉన్న రెడ్ల సపోర్టు ఎటూ ఉంది. కాపుల విషయంలో ముందే చెప్పుకున్నట్లుగా వారంతా గుత్తమొత్తంగా ఒకే పార్టీకి వేసే చాన్సే లేదు, కానీ బీజేపీ, జనసేన కాంబో కొంతమేర కాపుల మీద ప్రభావం చూపించవచ్చు. అయితే అది ఏపీలో టీడీపీకే అది పెద్ద నష్టాన్ని చేకూరుస్తుంది. ఆ విధంగా టీడీపీ సామాజిక రాజకీయ బలం తగ్గుతుంది. ఈ మొత్తం పరిణామాల వల్ల బీసీలు మరింతగా వైసీపీ వైపు షిఫ్ట్ అవుతారు. అదే జగన్ కి మరోసారి భారీ ఆధిక్యతతో గోదావరి జిల్లాలు సహా రాష్ట్రమంతటా గెలిచేందుకు దోహదపడుతుందనిపిస్తోంది.

Tags:    

Similar News