ఇక అది ఆశ మాత్రమేనట

బీజేపీకి తెలుగు రాష్ట్రాల మీద మోజు ఎక్కువ. ఎలాగైనా బలపడిపోవాలన్న అత్యాశ కూడా ఉంది. ఇక్కడ బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. రాజకీయం కూడా ఓ లెక్కల్లో [more]

Update: 2020-02-09 09:30 GMT

బీజేపీకి తెలుగు రాష్ట్రాల మీద మోజు ఎక్కువ. ఎలాగైనా బలపడిపోవాలన్న అత్యాశ కూడా ఉంది. ఇక్కడ బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. రాజకీయం కూడా ఓ లెక్కల్లో ఉంటుంది. కులాలు, మాతాలు, ప్రాంతాలు అన్నీ కలబోసుకుని తెలుగు రాజకీయాలు సాగుతాయి. వీటిలో ఎక్కడా కూడా బీజేపీ పాత్ర లేదు. ఆ పార్టీ ఉనికి కూడా లేదు. కానీ ఛాన్స్ ఇస్తే సీఎం సీటు మాదేనని తెగ హుషార్ చేస్తుంది. రాజకీయ విషాదం కాకపోతే పోయి పోయి బీజేపీతో ఎవరైనా తలగోక్కుంటారా? ఆ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. అయినా తెలుగు రాష్ట్రలా పట్ల వివక్ష చూపిస్తోంది. ఇలా ఓ కన్నుతో ఆగ్రహం చూపిస్తూ మరో కన్నుతో అనుగ్రహించంటే తెలుగు జనం ఆదరిస్తారా?

హోదాయే చిక్కు….

ఏపీ విషయానికి వస్తే బీజేపీ ప్రత్యేక హోదా విషయంలో ఆడుతున్న నాటకాలు ఆంధ్రులకు మండేలా చేస్తున్నాయి. గత ఆరేళ్ళుగా హోదా విషయంలో బీజేపీ మార్చినన్ని రంగులు ఎవరూ మార్చలేదు. హోదా ఇవ్వకుండా కుంటిసాకులు చెబుతూ బీజేపీ ఎప్పటికపుడు పబ్బం గడుపుకుంటోంది. జాతీయ స్థాయి వరకూ అది బాగానే ఉన్నా ఏపీలో మాత్రం ఆ పార్టీకి అదే శరాఘాతంగా మారుతోంది. హోదా ఇవ్వను అని బీజేపీ ఎంత గట్టిగా అంటే అంతే గట్టిగా ఆంధ్రా జనం కూడా ఏపీలో మీకు అధికారం ఇవ్వము అని అంతే గట్టిగా అంటారు. ఇదే కదా పరస్పర అధారిత సిధ్ధాంతం. బీజేపీ ఈ సత్యం తెలుసుకోకుండా హోదా గురించి డబాయింపు మాటలు మాట్లాడుతోంది. మందబలం ఉంది కదా అని పార్లమెంట్ లో ఏపీ ఎంపీలను చులకన చేస్తోంది.

జనంలో అలాగే ఉంది….

ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యాయమని పార్లమెంట్ సాక్షిగా ఆ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ క్లారిటీగా చెబుతున్నారు. ఆయన పార్టీకి అది ముగిసిన అధ్యాయమేమో కానీ ప్రజలకు మాత్రం కాదు అంటున్నారు. 2019 ఎన్నికలే అందుకు ఉదాహరణ అని కూడా చెబుతున్నారు. ఏపీకి సంబధించినంతవరకూ బీజేపీ కూడా కాంగ్రెస్ లాంటి దోషిగానే జనం చూస్తున్నారు. నోటా కంటే తక్కువ ఓట్లు కట్టబెట్టి ఏడాది క్రితం జరిగిన ఎన్నికల్లో కాషాయం పార్టీని ఖంగు తినిపించారు. అయినా సరే తీరు మార్చుకోకుండా ప్రత్యేక హోదా ఇవ్వమని బీజేపీ ఇప్పటికీ చెబుతోందంటే ఆ పార్టీకి ఏపీ మీద ఆశలు లేవనే అనుకోవాలా? లేక జనం అమాయకత్వం మీద తప్పుడు అంచనాలు పెట్టుకుందనుకోవాలా? ఏది ఏమైనా బీజేపీ ఏపీకి మళ్ళీ కోపం తెప్పించేసింది.

ఛాన్స్ అలా వస్తుంది…..

ఎవరైనా జనాలకు మేలు చేస్తేనే గుర్తుంచుకుని మరీ ఓటు వేస్తారు. ఆదరిస్తారు. బీజేపీకి ఇది తెలియనిది కాదు. బడ్జెట్లో ఎప్పటికపుడు మొండిచేయి చూపిస్తున్న బీజేపీ మీద ఏపీ జనాలకు పీకబండెడు కోపం ఇప్పటికే ఉంది. దానికి తగినట్లుగా విభజన హామీలు కూడా తీర్చకుండా నమ్మలేని పార్టీగా మారింది. ఇపుడు ఏపీలో రాజకీయ పరిస్థితులు చూస్తే మూడవ పార్టీకి అవకాశం కల్పించేలా ఉన్నాయి. అయితే బీజేపీ మాత్రం దాన్ని అందిపుచ్చుకునే ఎత్తుగడలు వేయడంలేదనిపిస్తోంది. నిజానికి మోడీ మొదటి విడతలోనే ప్రత్యేక హోదా ఇచ్చేస్తే ఈ పాటికి ఏపీలో బీజేపీ బాగా పుంజుకునేది. ఇపుడు రెండు ప్రాంతీయ పార్టీలను జనం చూశారు, బీజేపీ ఏమైనా ఏపీకి మేలు చేస్తే ఆ పార్టీకి ఛాన్స్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. కానీ బీజేపీ మాత్రం ఏమీ ఇవ్వం కానీ అధికారం ఇవ్వమంటోంది. ఇది కుదిరే పనేనా. ఓ విధంగా బీజేపీ ఏపీకి చేస్తున్న అన్యాయమే ఆ పార్టీని మొదలు నరికేలా చేస్తోంది. ఏపీలో ప్రాంతీయ పార్టీల నెత్తిన పాలు పోస్తోంది. బీజేపీతో కలసిన జనసేనాని కూడా బలపడే అవకాశాలు లేవు.

Tags:    

Similar News