ఇద్దరు సీఎంలకు ఇదో పరీక్ష

తెలంగాణ, ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రులకు ఇప్పుడొక విషమ సమస్య ఎదురుగా కూర్చుంది. రెండు రాష్ట్రాలపై బీజేపీ తీవ్రమైన రాజకీయ కసరత్తు ప్రారంభించింది. అయితే రెండు చోట్లా ఇంతవరకూ బీజేపీ [more]

Update: 2021-01-06 14:30 GMT

తెలంగాణ, ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రులకు ఇప్పుడొక విషమ సమస్య ఎదురుగా కూర్చుంది. రెండు రాష్ట్రాలపై బీజేపీ తీవ్రమైన రాజకీయ కసరత్తు ప్రారంభించింది. అయితే రెండు చోట్లా ఇంతవరకూ బీజేపీ తృతీయస్థానంలోనే ఉంది. కానీ ప్రతిపక్ష స్థానాన్ని ఆక్రమిస్తూ అధికార పార్టీలకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని తలపోస్తోంది. అందుకు తగిన సరంజామా సిద్ధం చేసుకుంటోంది. ముందుగా రెండు రాష్ట్రాల్లో ప్రధాన ప్రతిపక్షాలుగా ఉన్న తెలుగుదేశం, కాంగ్రెసులకు ఈ పరిణామం పొలిటికల్ హెచ్చరిక.. అదే సమయంలో అధికార పార్టీలకు మింగుడు పడని పరిణామమే. నిజానికి బలమైన రెండు ప్రతిపక్షాలు ఏర్పడితే అధికార పార్టీలకు చాలా సమస్య తీరిపోతుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల చీలికతో సునాయాసంగా మరోసారి పగ్గాలు చేజిక్కించుకోవచ్చు. కానీ ప్రత్యామ్నాయ శక్తిగా దూసుకువస్తున్న కమలం పార్టీ సంప్రదాయ విస్తరణకు భిన్నమైనది . అందుకే పవర్ లోని పార్టీలు జాగ్రత్త పడక తప్పని అనివార్యత ఏర్పడింది. కాంగ్రెసుకు కళ్లెం వేసి , ఒకరకంగా బీజేపీ పెరగడానికి కారణమై కేసీఆర్ తప్పులో కాలేశారు.. అటు జగన్ మోహన్ రెడ్డి సైతం తెలుగుదేశం పార్టీపైనే ఫోకస్ పెట్టి బీజేపీకి సైద్దాంతిక చాన్సులు పెరిగేలా చేసుకున్నారు. ఈ ఇద్దరు ముఖ్యమంత్రులకూ ఇంకా ప్రజల్లో బలమైన పట్టు ఉంది. ఇంకా ఆయా పార్టీలను కంట్రోల్ చేయగల రాజకీయ సామర్థ్యం ఉంది. అయితే ఏపార్టీలకు ముకుతాడు వేయాలి. ఎవరిని పెంచాలి? ఎవరిని తుంచాలనేదే పరీక్ష.

కాలుదువ్వుతున్న కమలం..

బీజేపీ సాధారణ సంప్రదాయ పార్టీ కాదు. ఆ పార్టీ సిద్ధాంతం దావానలం లాంటిది. ప్రజలందరిలోనూ చాలా వేగంగా వ్యాపిస్తుంది. మతపరమైన అజెండా అగ్గిలా రాజుకుంటోంది. ఈ రెండు రాష్ట ప్రభుత్వాలు చేసే తప్పిదాలు కనుక గాలిలా తోడైతే.. ఇక బీజేపీ విజృంభణను ఆపడం ఎవరివల్లా కాదు. అందుకే తనకు పరిమితమైన బలమున్న చోట్ల కూడా ఒక్కోసారి వాతావరణం కలిసి వస్తే కమలం పార్టీ అనూహ్య విజయాలు సాధిస్తోంది. అందులోనూ గడచిన ఏడేళ్లుగా దేశంలో ఆపార్టీ సాధిస్తున్న విజయాలు అసాధారణం. అనేక ప్రజా ప్రతికూల నిర్ణయాలు తీసుకున్నప్పటికీ వాటిని పార్టీకి అనుకూలంగా మలచుకోవడంలో సక్సెస్ అవుతోంది. ఈ స్థితిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో తాజా పరిస్థితులు సైద్ధాంతిక వాదన ముందుకు తీసుకెళ్లడానికి అనుకూలంగా మారుతున్నాయి. ఈ స్థితిలో అధికారపార్టీకి పరోక్షంగా సహకరించగలిగినవి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు మాత్రమే. ఇవి రెండూ ప్రభుత్వ వ్యతిరేక అజెండాను తమ సొంతం చేసుకుంటే బీజేపీ ఆటోమేటిక్ గానే కట్టడి అవుతుంది. బీజేపీయేతర ప్రతిపక్ష పార్టీల ఉద్యమాలు, ఆందోళనలకు అధికారపార్టీలు కొంచెం ఫ్రీ హ్యాండ్ ఇస్తే కొంతమేరకు టీఆర్ఎస్, వైసీపీ లకే లబ్ధి చేకూరుతుంది.

కూడగట్టుకుంటున్న కాంగ్రెస్…

తెలంగాణలో అందనంత దూరంలో ఉన్న టీఆర్ఎస్ ను చేరుకోవడం సంగతి ఓటరు ఎరుగు. దానికంటే ముందు తమ వెనకాల ఉన్న బీజేపీ తనను అధిగమించకుండా చూసుకోవడం ఇప్పుడు కాంగ్రెస్ కు తక్షణ కర్తవ్యంగా మారింది. ప్రజల్లో కొంత కరిష్మా ఉండి , రెడ్డి సామాజిక వర్గం నుంచి బలమైన దన్ను ఉన్న రేవంత్ రెడ్డిని పీసీసీ సారథిని చేయాలని అధిష్ఠానం ఆలోచించింది. పార్టీ నష్టపోయినా పర్వాలేదు, తమ అజెండాయే ప్రధానమనుకునే పెద్దలు మోకాలడ్డారు. దీంతో ఈ కార్యం నెరవేరేలా లేదు. రేవంత్ పార్టీ నుంచి జారిపోకుండా, సీనియర్లు అలక వహించకుండా మధ్యేమార్గంలో ఫార్ములా సిద్ధం చేస్తోంది కాంగ్రెస్. రేవంత్ వంటి వారు వస్తే అక్కున చేర్చుకోవడానికి బీజేపీ ఇప్పటికే సిద్ధంగా ఉంది. అయితే కాంగ్రెసు తరహాలో పెద్ద పదవులు ఇవ్వచూపడం లేదు. బీజేపీలో అగ్రవర్ణ సామాజికవర్గ నాయకత్వమూ బలంగా ఉంది. అదే సమయంలో బండి సంజయ్, లక్ష్మణ్, అరవింద్ వంటి వారితో బీసీ నాయకత్వమూ పటిష్ఠంగా ఉంది. అందువల్ల అక్కడ ఖాళీ లేదు. తనకు పెద్దగా ప్రాధాన్యం దక్కదనే ఉద్దేశంతోనే రేవంత్ కాంగ్రెసులో కొనసాగుతున్నారనే వాదన సైతం ఉంది. బీజేపీ దూకుడుతో వాస్తవం గ్రహించిన కేసీఆర్ కాంగ్రెసు నేతలపై ఉక్కుపాదం మోపకూడదని ఆంతరంగికంగా నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది కాంగ్రెసు పార్టీకి ఉత్సాహాన్నిచ్చే పరిణామమే.

టీడీపీ వర్సెస్ బీజేపీ…

ఆంధ్రప్రదేశ్ లో బైబిల్ పార్టీయా, భగవద్గీత పార్టీయా నినాదం ప్రజల ముందుకొస్తోంది. టీడీపీ గురించి చర్చ రానివ్వకుండా చేయాలనేది ఈ నినాదంలో అంతర్గతంగా దాగిన వ్యూహం. కేంద్ర పెద్దలను ఎంతగా మచ్చిక చేసుకోవాలని చూసినప్పటికీ టీడీపీకి అపాయింట్ మెంట్లు దొరకడం లేదు. ఒకవేళ ఇచ్చినా మొక్కుబడి తంతు మాత్రమే. తెలుగుదేశాన్ని పూర్తిగా రాజకీయంగా నాశనం చేసే బాధ్యత వైసీపీదేనని బీజేపీ విశ్వాసం. ఆ తర్వాత ఏకంగా అధికారపార్టీతో డీకొట్టవచ్చని భావిస్తున్నారు. అందువల్లనే టీడీపీని, వైసీపీని ఒకేగాటన కట్టే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ నాయకులు. టీడీపీ నేతలు ప్రభుత్వ వ్యతిరేక అంశం ఏది మాట్టాడినా మీ హయాంలో కూడా అదే జరిగిందని బీజేపీ ఎదురుదాడి చేస్తోంది. టీడీపీ ఏరకంగానూ పొలిటికల్ పాయింట్ ను క్లెయిం చేసుకోకుండా అడ్డుకట్ట వేస్తోంది. విగ్రహాల ధ్వంసం , దేవాలయాలపై దాడుల విషయంలోనూ వైసీపీ ప్రభుత్వంతోపాటు టీడీపీని కూడా బీజేపీ టార్గెట్ చేసింది. చంద్రబాబు నాయుడి హయాంలో ఆలయాల కూల్చివేత, విగ్రహాల ను మునిసిపల్ ట్రాక్టర్లపై తరలింపు అంశాలను ప్రస్తావిస్తోంది. ఇది వైసీపీకి ఆనందం కలిగించే చర్య. కానీ తాత్కాలికమే. టీడీపీ పూర్తిగా నిర్వీర్యమయ్యాక వైసీపీ పైనే పూర్తి ఫోకస్ పెడుతుంది బీజేపీ. అందులోనూ వైసీపీ నాయకత్వానికి చట్టపరమైన కేసుల బలహీనతలున్నాయి. అందువల్ల టీడీపీ, బీజేపీల్లో ఎవరు తనకు ప్రత్యర్థో తేల్చుకోవడం జగన్ మోహన్ రెడ్డికి కూడా సవాలే.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News