ఇక్కడ షో కుదరదులే షా

హుజూర్ నగర్ ఉప ఎన్నిక భారతీయ జనతా పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. తెలంగాణలో బీజేపీ తిరుగులేని శక్తిగా ఎదిగిందని, ఇక ఎప్పుడు ఎన్నికలు వచ్చినా విజయం తమదేనని [more]

Update: 2019-10-06 03:30 GMT

హుజూర్ నగర్ ఉప ఎన్నిక భారతీయ జనతా పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. తెలంగాణలో బీజేపీ తిరుగులేని శక్తిగా ఎదిగిందని, ఇక ఎప్పుడు ఎన్నికలు వచ్చినా విజయం తమదేనని బీజేపీ నేతలు ఇప్పటి వరకూ చెబుతూ వచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిర్వీర్యమయిపోయిందని, టీఆర్ఎస్ కు అసలైన ప్రత్యర్థి తామేనని బీజేపీ నేతలు చంకలు గుద్దుకున్నారు. అయితే ఇప్పుడు ఎన్నిక రానే వచ్చింది. ఉప ఎన్నికలో కమలనాధుల సత్తా తేలిపోనుంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో బీజేపీ పట్టు సాధించలేకపోతే పరువుతో పాటు మళ్లీ కథ మొదటికొచ్చేలా ఉంది.

లోక్ సభ ఎన్నికల్లో…..

గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో పూర్తిగా దెబ్బతినింది. 2014 ఎన్నికల్లో ఐదు అసెంబ్లీ స్థానాల్లో గెలిచిన బీజేపీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క స్థానాన్ని గెలవలేకపోయింది. ఇక తెలంగాణలో బీజేపీ పని అయిపోయిందనుకున్నారు. కానీ లోక్ సభ ఎన్నికల్లో మాత్రం బీజేపీ సత్తా చాటింది. నాలుగు లోక్ సభ స్థానాలను గెలుచుకుంది. ముఖ్యంగా టీఆర్ఎస్ కు కంచుకోటగా ఉన్న నిజామాబాద్, కరీంనగర్ ఎంపీ స్థానాలను గెలుచుకోవడంతో ఇక టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని బీరాలు పోయారు.

రెండు పార్టీలు బలంగా…

అయితే తాజాగా హుజూర్ నగర్ ఉప ఎన్నిక జరుగుతోంది. బీజేపీ అభ్యర్థిగా కోట రామారావును ప్రకటించింది. అభ్యర్థి ఎంపిక కూడా ఆలస్యంగా ప్రకటించింది. అయితే హుజూర్ నగర్ లో పరిస్థితి చూస్తే బీజేపీకి అంత అనుకూలంగా లేదనే చెప్పాలి. అక్కడ అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు బలంగా ఉన్నాయి. ఇక్కడ టీడీపీ, సీపీఎం లు కూడా పోటీ బరిలోకి దిగాయి. దీంతో ఇక్కడ బీజేపీ పెద్దగా ప్రభావం చూపదనే చెప్పాలి. నల్లగొండ జిల్లాలో బీజేపీ కొద్దో గొప్పో క్యాడర్ ఉన్న మాట వాస్తవమే అయినా విజయం అంత సీన్ లేదన్నది అందరికీ తెలిసిందే.

ఎన్ని ప్రయత్నాలు చేసినా…

కానీ బీజేపీ నేతలు మాత్రం తాము గట్టి పోటీ ఇస్తామని చెబుతున్నారు. తమకు ప్రత్యేక ఓటు బ్యాంకు ఉందంటున్నారు. జాతీయ స్థాయిలో మోడీ చరిష్మా కూడా ఉప ఎన్నికల్లో పనిచేస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. ప్రచారానికి పార్టీ జాతీయ స్థాయి నేతలను ఆహ్వానించేందుకు సిద్ధమవుతున్నారు. వీలయినంత మంది కేంద్ర మంత్రులను ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనేలా చేయాలని వ్యూహాన్నిరూపొందించారు.అయితే బీజేపీ ఎన్ని ప్రయత్నాలుచేసినా గెలుపు అంత సులువు కాదన్నది అందరికీ తెలిసిందే. అయితే నోటా కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకుంటే అదే గెలుపు అన్నదిపార్టీ ఇన్నర్ వర్గాల టాక్.

Tags:    

Similar News