కన్నేసి…కప్పేసి…కొట్టేశారు…?

వరసగా రాష్ట్రాల్లో ఓటములు కమలనాధులను ఇబ్బంది పెట్టాయి. మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ వరసగా ఓటములు చవి చూడటంతో అమిత్ షా, మోడీ నాయకత్వంపై నమ్మకం కోల్పోయేలా తయారయింది. [more]

Update: 2020-03-20 18:29 GMT

వరసగా రాష్ట్రాల్లో ఓటములు కమలనాధులను ఇబ్బంది పెట్టాయి. మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ వరసగా ఓటములు చవి చూడటంతో అమిత్ షా, మోడీ నాయకత్వంపై నమ్మకం కోల్పోయేలా తయారయింది. లోక్ సభ ఎన్నికల్లో సూపర్ విక్టరీ ఆనందం వారిలో ఎంతో సేపు నిలవలేదు. మహారాష్ట్రలో మిత్రపక్షమైన శివసేన హ్యాండివ్వడంతో అక్కడ అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఢిల్లీ తీర్పు ఏకపక్షంగా మారింది. ఈ పరిస్థితుల్లో కసి మీద ఉన్న కమలనాధులు మధ్యప్రదేశ్ పై కన్నేశారు.

చాలా జాగ్రత్తగా….

మధ్యప్రదేశ్ లో ఆపరేషన్ ఆకర్ష్ ను చాలా జాగ్రత్తగా డీల్ చేశారు. ఎమ్మెల్యేలకంటే ముందు జ్యోతిరాదిత్య సింధియాను రప్పించుకోగలిగితే రాష్ట్రం తమ వశమయినట్లేనని భావించారు. అందుకే మూడు నెలల నుంచి అదే పని మీద ఉన్నారు. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే సయితం కొంత చేయి వేయడంతో జ్యోతిరాదిత్య బీజేపీ గూటికి చేరిపోయారు. ఆయనతో పాటు 22 మంది ఎమ్మెల్యేలు రావడంతో మధ్యప్రదేశ్ లో అధికారం సులువుగా చిక్కిందనే చెప్పాలి.

ప్రభుత్వ ఏర్పాటుకు….

ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రయత్నంలో బీజేపీ నేతలు ఉన్నారు. కమల్ నాధ్ రాజీనామా చేయడంతో తమకు బలం ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని బీజేపీ నేతలు గవర్నర్ కోరునున్నారు. త్వరలోనే బీజేపీ నేతలు గవర్నర్ లాల్జీ టాండన్ ను కలసి విజ్ఞప్తి చేయనున్నారు. గవర్నర్ కు కూడా బీజేపీకి మించి మరో ఆప్షన్ లేదు. 107 మంది సభ్యులున్న బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం దక్కుతుంది.

ఉప ఎన్నికల్లోనూ……

అయితే ఇప్పటికే రాజీనామాలు చేసిన 22 మందిలో మంత్రులుగా పనిచేసిన ఆరుగురువి మాత్రమే ఆమోదం పొందాయి. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం16 మంది రాజీనామాలను స్పీకర్ ప్రజాపతి ఆమోదించారు. అంటు 22 స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ ఉప ఎన్నికల్లో మరోసారి గెలుచుకుని అధికారాన్ని దక్కించుకోవచ్చని కాంగ్రెస్ భావిస్తుంది. ఉప ఎన్నికలు జరిగే స్థానాలన్నీ కాంగ్రెస్ వే కాబట్టి అందులో సగం స్థానాలు గెలుచుకున్నా తామూ పూర్తి కాలం అధికారంలో ఉంటామని బీజేపీ భావిస్తోంది. మొత్తం మీద మధ్యప్రదేశ్ రాజకీయాలు మరో ఆరు నెలలు హాట్ హాట్ గానే ఉండనున్నాయి.

Tags:    

Similar News