మళ్లీ సీఎంలు వీరేనట

వివిధ రాష్టాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జాతీయ పార్టీలు ఓ విచిత్రమైన సమస్యను ఎదుర్కొంటాయి. ముఖ్యమంత్రి అభ్యర్థులను ముందే ప్రకటించాలా? వద్దా? అనే విషయమై ఆయా పార్టీల్లో [more]

Update: 2019-09-15 16:30 GMT

వివిధ రాష్టాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జాతీయ పార్టీలు ఓ విచిత్రమైన సమస్యను ఎదుర్కొంటాయి. ముఖ్యమంత్రి అభ్యర్థులను ముందే ప్రకటించాలా? వద్దా? అనే విషయమై ఆయా పార్టీల్లో సందిగ్ధత నెలకొంటుంది. సీఎం అభ్యర్థులను ప్రకటిస్తే ఒక ఇబ్బంది. ప్రకటించకపోతే మరో ఇబ్బంది. దీంతో నిర్ణయం తీసుకునేందుకు పార్టీలు వెనకడగు వేస్తుంటాయి. సీఎం అభ్యర్థులను ప్రకటిస్తే ఆయన ప్రత్యర్థులు అంతా ఏకమై ఆయనను ఓడించడమో… లేదా ఆయనకు సహకరించకపోవడమో, లేదా పార్టీ గెలుపునకు మనస్పూర్తిగా పనిచేయకపోవడమే జరుగుతుంది. ఒకవేళ అభ్యర్థిని ప్రకటించకపోయినా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎవరు బాధ్యత తీసుకంటారో తెలియదు. ఎవరికి వారు తమకు సంబంధలేదని, అంటీ ముట్టనట్లుగా వ్వవహరిస్తారు. దీంతో ఒక్కోసారి పార్టీ మునిగిపోయే ప్రమాదం ఉంది. ఈ రకమైన ఇబ్బందులవల్ల పార్టీలు ఇతమిత్తమైన నిర్ణయం ప్రకటించవు. ఎన్నికలు అయిన తర్వాత చూద్దామని ముందు అందరూ కలిసి పనిచేసి పార్టీని గెలిపించాలని కోరతుంటాయి. దాదాపుగా ఇప్పటి వరకు జాతీయపార్టీలు అనుసరిస్తున్న విధానం ఇదీ.

భిన్నమైన వైఖరితో…..

కానీ ఈ సారి బీజేపీ ఇందుకు భిన్నమైన వైఖరితో ముందుకు వెళ్లనుంది. ఈ ఏడాదిఆఖరులోగా జరగనున్న మహారాష్ట, జార్ఖండ్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ముందుగానే ముఖ్యమంత్రుల అభ్యర్థులను ప్రకటించింది. దేవేంద్ర ఫడ్నవిస్, మనోహర్ లాల్ ఖట్టర్, రఘు బర్ దాస్ లు మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ ముఖ్యమంత్రి అభ్యర్థులని పార్టీ స్పష్టంగా ప్రకటించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఇటీవల హర్యానాలో జరిగిన ఓ ఎన్నికల ప్రచార సభలో షా ఈ మేరకు ప్రకటన చేశారు. రాష్ట్రములోని జింద్ లో జరిగిన పార్టీ ర్యాలీలో షా ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ప్రస్తుత ముఖ్యమంత్రుల సారధ్యంలోనే పార్టీ ఎన్నికలకు వెళుతుందని స్ఫష్టం చేశారు. గతంలో ఎప్పుడూ పార్టీ ఇలాంటి ప్రకటన చేయలేదు. ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల అనతరం ఎమ్మెల్యేకాని యోగి ఆదిత్యానాథ్ ను సీఎం చేశారు. ఆయన గోరఖ్ పూర్ పార్లమెంట్ సభ్యుడు, ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య ఇద్దరూకూడా పార్లమెంట్ సభ్యులే కావడం గమనార్హం. మౌర్య పుల్ పూర్ ఎంపీ ఇది తొలి ప్రధాని పండిట్ నెహ్రూ నియోజకవర్గం కావడం విశేషం.

ఫడ్నవిస్ నే కంటిన్యూ చేయాలని….

ముఖ్యమంత్రి అభ్యర్థుల ప్రకటన వెనుక బీజేపీ భారీ కసరత్తే చేసింది. ఆషా మాషీగా తీసుకున్న నిర్ణయం కాదిది.పెద్ద రాష్ట్రమైన మహారాష్ట్ర సీఎంగా గత అయిదేళ్లుగా దేవేంద్ర ఫడ్నవిస్ కొనసాగుతున్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన యువకుడైన ఫడ్నవిస్ ఎంపిక అప్పట్లో ఆశ్యర్యం కలిగించింది. మహారాష్ట్ర రాజకీయాల్లో బ్రాహ్మణ సామాజిక వర్గానికి పెద్దగా పట్టులేదు. కేవలం ఆర్.ఎస్.ఎస్ నేపథ్యం, నిజాయితీ పరుడు కారణంగానే అప్పట్లో ఫడ్నవిస్ ను ఎంపిక చేశారు. గత అయిదేళ్లుగా ఆయన పాలన సంతృప్తి కరంగా సాగుతుంది. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. మిత్రపక్షమైన శివసేనతో కలిసి ముందుకు సాగుతున్నారు. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 48 స్థానాలకు గాను 43 స్థానాలను గెలుచుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 288 స్థానాలకు గాను బీజేపీ 122 స్థానాలను సాధించింది. 63 స్థానాలను గెలుచుకున్న శివసేన మద్దతుతోసర్కార్ ఏర్పాటు చేసింది. ఈ సారి సొంతంగా మెజార్టీసాధించాలన్న ది బీజేపీ యోచన.

వీరిద్దరు కూడా….

ఎన్నికలు జరగనున్న మరో పెద్ద రాష్ట్రం హర్యానా. గత అయిదేళ్లుగా మనోహర్ లాల్ ఖట్టర్ కొనసాగుతున్నారు. ఆర్.ఎస్.ఎస్ కార్యకర్త, బ్రహ్మచారి అయిన ఖట్టర్ ను అప్పట్లో సీఎంగా ఎంపికచేశారు. ఇంతకాలం ఏ పార్టీ గెలిచినా జూట్ సామాజికవర్గానికి చెందిన వారే సీఎం అవుతున్నారు. కానీ బీజేపీ ప్రయోగాత్మకంగా వెనుకబడిన వర్గానికి చెందిన ఖట్టర్ ను ఎంపికచేసింది. ఖట్టర్ పాలన గత అయిదేళ్లుగా సాఫీగా సాగుతోంది. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో పదికి పదిస్థానాలను గెలుచుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 90స్థానాలకు పార్టీ 47 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ 17, ఇండియన్ నేషనల్ లోక్ దల్ (INLD) 18స్థానాలను గెలుచుకున్నాయి. వెనుకబడిన రాష్ట్రమైన జార్ఖండ్ సీఎంగా గత అయిదేళ్లుగా రఘురాం దాస్ కొనసాగుతున్నారు. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 14 స్థానాలకు గాను కమలం పార్టీ 12 గెలుచుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 81 స్థానాలకు 43 స్థానాలు సాధించింది. మొత్తానికి కమలం పార్టీ ఈ సారి ముఖ్యమంత్రుల ఎంపిక విషయంలో ముందస్తు నిర్ణయం తీసుకుని సంచలనం సృష్టించింది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News