జగన్ పై కోపం అందుకేనట

చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు జగన్ అన్న మూడు అక్షరాలనే పలికేందుకు బీజేపీ తెగ ఇబ్బంది పడేది. పైగా ఏపీలో అధికారంలోకి వచ్చేది వైసీపీనే అంటూ ఆ పార్టీ [more]

Update: 2019-09-29 02:00 GMT

చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు జగన్ అన్న మూడు అక్షరాలనే పలికేందుకు బీజేపీ తెగ ఇబ్బంది పడేది. పైగా ఏపీలో అధికారంలోకి వచ్చేది వైసీపీనే అంటూ ఆ పార్టీ కంటే కూడా ఎంతో ధీమా వ్యక్తం చేసేది. తెల్లారిలేస్తే చంద్రబాబు మీద ఒంటికాలుపై లేచేది. మొత్తానికి అనుకున్నట్లుగానే చంద్రబాబుని దించేశారు, జగన్ సీఎం అయ్యారు. ఆ వెంటనే బీజేపీకి ముఖ్యమంత్రి కుర్చీ మీద ఆత్రం ఒక్కసారిగా పెరిగిపోయింది. కనీస సమయం కూడా ఇవ్వకుండా జగన్ ని విమర్శిస్తూ రచ్చ రచ్చ చేస్తోంది. ఏపీలో తామే అసలైన ప్రత్యామ్నాయం అని గట్టిగా జబ్బలు చరచుకున్న బీజేపీకి గత నాలుగు నెలల రాజకీయంలో కలసివచ్చేది ఏదీ లేదని ఇప్పటికైతే అర్ధమైపోయింది. దాంతో మునుపటి ఉత్సాహం లేదు, ఆర్భాటం కూడా లేదు, మొత్తానికి వాస్తవ పరిస్థితిలోకి వచ్చినట్లుగా కనిపిస్తోంది.

జగనే అడ్డు….

ఏపీలో బీజేపీ ఎదుగుదలకు జగనే అడ్డుగా ఉన్నారని అనుమానంతో కమలనాధులు రగిలిపోతున్నారు. ఎమ్మెల్యేలు తమ పార్టీలో వచ్చి చేరాలంటే ఫిరాయింపు కత్తి వేలాడుతోంది. పార్టీ మారిన మరుక్షణం ఎటువంటి దయాదాక్షిణ్యం లేకుండా ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు చేసి పారేయమని జగన్ నిండు సభ సాక్షిగా స్పీకర్ కి పూర్తి స్వేచ్చ ఇచ్చేశారు. దాంతో బీజేపీలోకి ఎవరైనా దూకాలనుకున్న వారికి ఇబ్బందిగా ఉంది. ఇక మరో వైపు పార్టీ నాయకులను తీసుకుందామన్నా కూడా వారు బీజేపీ కంటే వైసీపీకే తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎవరైనా తమ్ముళ్ళు అసంతృప్తిగా ఉంటే వారిని తమ వైపు తిప్పుకోవడానికి బీజేపీ నేతలు వెంటనే అక్కడ వాలిపోతున్నారు. వారితో ఎన్ని రకాలుగా రాయబేరాలు నడిపినా కూడా ససేమిరా అంటున్నారు. కానీ అదే సమయంలో ఎంచక్కా వైసీపీ కండువా కప్పుకుంటున్నారు. దీంతో బీజేపీకి మండిపోతోందట.

నేల విడిచి సాము….

నిజానికి ఏపీలో బీజేపీ బలపడడానికి ఆ పార్టీ నేతలు చేసిందేంటి. అసలు బలం ఉంటే కొసరు బలం వచ్చి చేరుతుంది. ఫిరాయింపులతోనే మొత్తం తొట్టి నింపుకోవాలంటే అది ఎపుడు నిండుతుంది. రాజకీయ పంట ఎపుడు పండుతుంది. ఈ కనీస ఆలోచన బీజేపీకి కొరవడిందని అంటున్నారు. పైగా వచ్చిన వారు అధికారం అనే వెలుగు మసకబారగానే మళ్ళీ వెనక్కుపోతారు. ఈ రాజకీయం అర్ధమైనా కూడా బీజేపీ ఇంకా షార్ట్ కట్ మెథడ్స్ ని అనుసరించడమే ఆ పార్టీ ప్రస్తుత స్థితికి కారణం. ఏపీలో బీజేపీ సొంతంగా ఎదుగుతుందన్న ఆశ కల్పించడంతో పార్టీ నేతలు ఘోరంగా విఫలం అయ్యారన్నది నిజం. అందుకే గోదావరి జిల్లాలకు చెందిన టీడీపీ సీనియర్ నేత తోట త్రిమూర్తులు వైసీపీలో చేరిపోయారు. ఇక రాజమండ్రీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ కూడా రేపో నేడే జగన్ చెంతకు వెళ్లబోతున్నారు. విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమెష్ బాబు సైతం బీజేపీ వారు ఎంత పిలిచినా పలకకుండా ఫ్యాన్ నీడకే వచ్చేస్తున్నారు. ఈ పరిణామాలను చూస్తున్న బీజేపీకి జగన్ మీద కోపం వస్తోందట. తమ ఎదుగుదలకు అడ్డుగా ఉన్నారని గుర్రు మీద ఉన్నారట. కానీ అసలు లోపం ఎక్కడుందో తెలుసుకోకపోతే మాత్రం బీజేపీ మరో పదేళ్ళు అయినా కూడా ఏపీలో ఎదిగే చాన్సే లేదని సొంత పార్టీలోనే మాట వినిపిస్తోంది

Tags:    

Similar News