దీదీ ధీమా అదే

గత ఏడాది లోక్ సభ ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీకి ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదురవ్వలేదు. ప్రాంతీయ పార్టీల నుంచి కూడా [more]

Update: 2020-02-27 16:30 GMT

గత ఏడాది లోక్ సభ ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీకి ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదురవ్వలేదు. ప్రాంతీయ పార్టీల నుంచి కూడా పెద్దగా ప్రతిఘటన ఎదురు కాలేదు. కానీ నాట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ నుంచి మాత్రం గట్టి సవాళ్లు ఎదురయ్యాయి. తొమ్మిదో దశకంలో యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా చక్రం తిప్పిన చంద్రబాబు కాంగ్రెస్ తో కలసి నడవటంతో ప్రధాని మోదీ ఒకింత ఇబ్బందిని ఎదుర్కొన్న మాట వాస్తవం. అదే విధంగా యూపీ, మహారాష్ట్ర తర్వాత అత్యధికంగా 42 లోక్ సభ స్థానాలు గల తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ నుంచి ప్రధాని మోదీకి గట్టి సవాల్ ఎదురయింది.

మోదీని ఢీకొట్టాలంటే….?

అయితే లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో మోదీకి ఎదురులేక పోవడంతో కాంగ్రెస్ తో పాటు ప్రాంతీయ పార్టీలు చతికలపడ్డాయి. దీంతో మోదీని ఇప్పట్లో ఎదుర్కోవడం కష్టమన్న అంచనాకు వచ్చాయి. జాతీయ స్థాయి రాజకీయాలను పక్కన పెడితే ముందు తమ రాష్ట్రాల్లో మనుగడపై ప్రాంతీయ పార్టీల అధినేతలు దృష్టి సారించారు. అలాంటి వారిలో మమత బెనర్జీ ప్రధమురాలు. బలవంతుడను కున్న చంద్రబాబు చతికలపడటంతో కమలనాధులు మమత బెనర్జీ పై దృష్టి పెట్టారు. ఆమెను ఓడించడమే తమ లక్ష్యంగా పెట్టుకున్నారు. నాటి లోక్ సభ ఎన్నికల ఫలితాలు కూడా పార్టీకి ఇందుకు అనుకూలించాయి. బెంగాల్ లోని మొత్తం 42 లోక్ సభ స్థానాలకు గాను బీజేపీ 18 స్థానాలను గెలుచుకుని మమత పునాదులను పెకిలించింది. ఈ అనూహ్య పరిణామాలకు మరింత బిత్తరపోయింది. 2014లో కేవలం రెండు స్థానాలు గల బీజేపీ 2019 నాటికి అనూహ్యంగా పుంజుకోవడం తృణమూల్ కాంగ్రెస్ ను కలవరపర్చింది. కాంగ్రెస్ కేవలం రెండు స్థానాలకు పరిమిత కాగా, రాష్ట్రాన్ని సుదీర్ఘకాలం ఏలిన సీపీఎం కనీసం ఖాతా కూడా తెరవలేదు.

అధికారమే లక్ష్యంగా…..

ఎన్నికల ఫలితాల ఊపుతో గత ఏడెనిమిది నెలలుగా మమత బెనర్జీపై కమలనాధులు చెలరేగిపోయారు. 2021 అసెంబ్ల ఎన్నికల్లో రైటర్స్ బిల్డింగ్ లో తాము అడుగుపెడతామన్న ధీమా వెలిబుచ్చారు. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా నియమితులైన బాబుల్ సుప్రియో, దేబశ్రీభేధురి ఈ దిశగానే పావులు కదుపుతున్నారు. తమ మనిషి అయిన గవర్నర్ జగదీష్ థంకర్ ద్వారా మమత పై ఒత్తిడి తెస్తున్నారు. తాము గెలుచుకున్న 18 లోక్ సభ స్థానాల పరంగా చూస్తే కనీసం 125 స్థానాలను సాధించవచ్చన్న అంచనాల్లో బీజేపీ ఉంది. దీంతో మమత బెనర్జీ ఒకింత కంగారు పడిన మాట వాస్తవం.

రాష్ట్రాల్లో జరిగిన…..

కానీ లోక్ సభ ఎన్నికల అనంతరం జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరాజయంతో ప్రాంతీయ పార్టీల నేతల్లో ముఖ్యంగా మమత బెనర్జీ లో సరికొత్త ధైర్యం వచ్చింది. మహారాష్ట్రలో కూటమి పరంగా మెజారిటీ సాధించినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీ వైఫల్యం మమత బెనర్జీ వంటి ప్రాంతీయ నేతలకు పెద్ద ఊరట. ఇక హర్యానాలో చావుతప్పి కన్ను లొట్ట పోయినట్లు మెజారిటీకి దూరంగా ఆగిపోవడం, దేవీలాల్ మునిమనవడు దుష‌్యంత్ చౌతాలాతో పొత్తుపెట్టుకుని బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం మమత లో ధైర్యాన్ని నింపింది. ఇక గత ఏడాది డిసెంబరులో జరిగిన జార్ఖండ్, ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కమలనాధుల సంపూర్ణ వైఫల్యం మమత బెనర్జీ లో మరింత ఉత్సాహాన్ని నింపింది. ఎందుకంటే మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, ఢిల్లీలో లోక్ సభ ఎన్నికల్లో కమలానికి ఎదురు లేకుండా పోయింది. ఢిల్లీో ఏడుకు ఏడు, జార్ఖండ్ లో పన్నెండుకు పది, హర్యానాలో పదికి పది, మహారాష్ట్రలో మెజారిటీ 23 లోక్ సభ సీట్లను సాధించి కమలం ముందంజలో ఉంది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో…..

ఈ ప్రాతిపదికన చూస్తే కమలం పై రాష్ట్రాల్లో సునాయాసంగా విజయం సాధించాల్సి ఉంది. కానీ ఫలితాలు తారుమారయ్యాయి. ఈ కోణంలో చూస్తే పశ్చిమ బెంగాల్ లో కూడా బీజేపీ తిరుగులేని శక్తి ఏమీ కాదన్న విషయం మమతకు అర్థమయింది. 2016 ఎన్నికలలో మొత్తం 294 స్థానాలకు గాను 211 స్థానాలను సాధించిన మమత అజేయశక్తిగా నిలిచారు. నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ 44 స్థానాలతో రెండో స్థానంలోనూ, సీపీఎం 26 స్థానాలతో మూడో స్థానంలో ఉన్నారు. కమలం పార్టీ కేవలం మూడు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే లోక్ సభ ఫలితాలు, సీఏఏ , ఎన్సార్సీ కారణంగా హిందూ ఓటర్లు తమ వైపునకు మొగ్గు చూపుతారన్నది కమలం అంచనా. బెంగాల్ లో ముస్లిం జనాభా అధికం. పొరుగున ఉన్న బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసదారులు అసోం తర్వాత ఎక్కువగా వచ్చింది బెంగాల్ కే. వీరితో పాటు స్థానిక ముస్లింలు మొదటి నుంచి కాంగ్రెస్ కు తర్వాత సీపీఎంకు మద్దతుగా ఉండేవారు. అనంతర కాలంలో వారు మమత వైపు మొగ్గు చూపారు. దీంతో మమత బెనర్జీ అధికారంలోకి వచ్చారు. దీంతో ముస్లింలను మచ్చిక చేసుకునేందుకు తమ రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేసేది లేదని మమత భీష్మిస్తున్నారు. పౌరసత్వ చట్టంతో హిందు ఓటు బ్యాంకు ను కైవసం చేసుకోవచ్చన్నది కమలం అంచనా. దీనికి ప్రతిగా హిందూయేతర ఓటు బ్యాంకుతో ఎన్నికల గోదారిని ఈదవచ్చన్నది మమత బెనర్జీ ఆలోచన. మొత్తం మీద ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మమత బెనర్జీలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. మోదీని ఢీకొనగల ధీమాను పెంచాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News