సిగ్నల్స్ పంపినా..?

రాష్ట్రంలో ఘోర పరాజయం తర్వాత తెలుగుదేశం పార్టీకి చుక్కలు కనిపించాయి. రాజకీయంగా సరైన నిర్ణయాలు సకాలంలో తీసుకోవడం లో అధినేత వైఫల్యం చెందడంతో అటుఇటు కాని అయోమయ [more]

Update: 2020-02-10 15:30 GMT

రాష్ట్రంలో ఘోర పరాజయం తర్వాత తెలుగుదేశం పార్టీకి చుక్కలు కనిపించాయి. రాజకీయంగా సరైన నిర్ణయాలు సకాలంలో తీసుకోవడం లో అధినేత వైఫల్యం చెందడంతో అటుఇటు కాని అయోమయ పరిస్థితిని తెలుగుదేశం ఎదుర్కోవాల్సి వచ్చింది. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే చాలు నలుగురైదుగురు మినహా టీడీపీ ఎమ్మెల్యేలంతా వైసీపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమైపోయారు. అయితే అప్పటికే వైసీపీ కిక్కిరిసిపోవడంతో జగన్ ఆకర్షక చర్యలకు పూనుకోలేదు. టీడీపీ ఊపిరిపోసుకుంది. తెలుగుదేశం పార్టీ తరహాలో తాము ఫిరాయింపులకు పాల్పడమంటూ నైతికంగా ఆ పార్టీని వైసీపీ అధినేత ఇరకాటంలో పెట్టారు. ఏడునెలల తర్వాత ఒకసారి పాలనను తిరిగి చూసుకుంటే సంక్షేమపథకాలు ఉరకలెత్తుతున్నాయి. తెలుగుదేశం తీవ్రంగా దెబ్బతిని ఉంది. ఈ నేపథ్యంలో సైద్దాంతికమైన అజెండాతో తాము ప్రత్యామ్నాయ పక్షంగా ఎదగవచ్చని బీజేపీ భావించింది. కానీ అదంత సులభం కాదని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. అందులోనూ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీయే తమ ఎదుగుదలకు అన్యాపదేశంగా మోకాలడ్డుతోందని బీజేపీ వాపోతోంది.

టీడీపీ కి పునరుజ్జీవం…

శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్లుగా వైసీపీ, బీజేపీలకు ఉమ్మడి శత్రువు తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ పూర్తిగా దెబ్బతింటే ఆ స్థానంలోకి రావచ్చనేది బీజేపీ యోచన. అటు కేంద్రంలోని పరిశోధక విభాగాలు, ఇటు రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు కలసి గతంలో రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రముఖుల అక్రమాలను వెలికి తీసే పనిలో పడ్డాయి. దీంతో పార్టీ కుదేలైపోయే పరిస్థితులు తలెత్తాయి. రానున్న రెండు మూడేళ్లలో ఈ పరిస్థితిని సానుకూలంగా చేసుకుంటూ పోతే టీడీపీ తీవ్రంగా బలహీనపడుతుందనేది రాజకీయ అంచనా. రాష్ట్రంలో మూడో బలమైన పార్టీగా ఉన్న జనసేనను సైతం తనదారిలోకి కమలం పార్టీ తెచ్చుకోగలిగింది. వైసీపీ ,టీడీపీల తరఫున రెండు సామాజిక వర్గాలే ప్రాబల్యం వహిస్తున్నాయన్న ప్రచారమూ ప్రజల్లో ఉధృతమవుతోంది. ప్రజల్లో ప్రాంతీయ పార్టీలపై నెలకొంటున్న అసహనాన్ని సొమ్ము చేసుకునేందుకు ఒక జాతీయ పార్టీగా తనకు మంచి చాన్సు దక్కుతుందని బీజేపీ భావించింది. విధానపరమైన నిర్ణయాల్లో వైఫల్యంతో వైసీపీ సర్కారు మళ్లీ టీడీపీకి ప్రాణం పోస్తోందని బీజేపీ అగ్రనాయకులు విశ్లేషిస్తున్నారు. 40 శాతం మేరకు ఓట్లు తెచ్చుకున్నప్పటికీ పసుపు కుంకుమ వంటి పథకాల కారణంగా టీడీపీకి పదిశాతం మేరకు ఓటింగు పెరిగిందని అంచనా. లేకపోతే 30శాతం ఓట్లకే పార్టీ పరిమితమై ఉండేదని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుని సంక్షేమ పథకాలను చక్కగా అమలు చేస్తే వైసీపీకి పెద్దగా ఢోకా ఉండకపోవును. రాజధానుల సహా అనేక అంశాలను తిరగదోడటం, అభివ్రుద్ధి పనులను పూర్తిగా పక్కనపెట్టడంతో టీడీపీ తిరిగి ప్రజల్లోకి వెళ్లేందుకు సానుకూల వాతావరణం ఏర్పడింది.

పవన్ కాడె దింపేస్తారా..?

వైసీపీ సర్కారుపై పోరాటం చేసే అంశాల్లో విపక్షాలన్నిటిదీ ఏక సూత్రమే. వ్యతిరేకిస్తున్న అంశాలూ ఒకటే. ఆ స్థితిలో ఎవరు పెద్దన్న పాత్ర పోషిస్తే వారికే క్రెడిట్ దక్కుతుంది. ఇసుక ఆందోళనల వంటి విషయాల్లో బీజేపీ, జనసేనలు ముందంజ వేశాయి. కానీ రాజధాని ఆందోళనకు వచ్చేటప్పటికి టీడీపీ ముందుకొచ్చేసింది. రివర్స్ టెండరింగ్ విషయంలోనూ పనులు ముందుకు సాగకపోతే అవినీతి జరిగినా టీడీపీ కాలమే మంచిదనే జనాభిప్రాయం ఏర్పడుతోంది. దీనిని బీజేపీ జీర్ణించు కోలేపోతోంది. కోలుకోలేనంతగా దెబ్బతిన్న తెలుగు దేశం పార్టీకి వైసీపీ విధానాలు ప్రాణం పోస్తున్నాయి. పెద్ద పార్టీగా ప్రజల్లోకి వెళితే మళ్లీ ప్రత్యామ్నాయంగా ఆదరణ పొందేందుకు అవకాశం ఏర్పడుతోంది. ఒకవైపు తెలుగుదేశం పార్టీ దీనస్థితిని ఆసరాగా చేసుకుంటూ పవన్ కల్యాణ్ జనాకర్షణ శక్తి అండగా ప్రజల్లోకి దూసుకుని వెళ్లవచ్చని కమలం పార్టీ నాయకులు లెక్కలు వేసుకున్నారు. బీజేపీతో చేతులు కలిపిన తర్వాత పవన్ కల్యాణ్ రిలాక్స్ అయిపోయారు. వరస సినిమాలకు అంగీకరిస్తున్నారు. ఇది బీజేపీకి సంబంధించి పెద్ద అశనిపాతంగానే భావించాలి. కూటమిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పవన్ అసెట్ గా మారుతారని ఆశలు పెట్టుకుంటే రాజకీయాలకు పూర్తిగా అందుబాటులో ఉంటారో లేదో తెలియనిస్థితి ఏర్పడింది.

ఆఫర్లే ఆఫర్లు…

తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీ కి మంచి ఆఫర్లే వస్తున్నాయి. బీజేపీకి దూరమై తాము తప్పు చేశామంటూ పార్టీ అధినేత చంద్రబాబు పశ్చాత్తాపం ప్రకటించారు. తమ రాజ్యసభ ఎంపీలు నలుగురు బీజేపీలోకి వెళ్లేందుకు పరోక్షంగా సహకరించారు. ఇవన్నీ కేంద్ర నాయకత్వాన్ని మచ్చిక చేసుకునేందుకే . తమ చర్యల ద్వారా చేతులు కలిపేందుకు సిద్దంగా ఉన్నట్లుగా టీడీపీ సంకేతాలు పంపుతోంది. శ్రేయోభిలాషుల ద్వారా చర్చలు జరుపుతోంది. అయితే టీడీపీ విషయంలో బీజేపీ ఒక స్థిరమైన నిర్ణయానికే వచ్చినట్లుగా ఢిల్లీ వర్గాల సమాచారం. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఎదుగుదలను చంద్రబాబే నిరోధించారనేది ఆ పార్టీ అంచనా. చేతులు కలిపిన సందర్బాల్లోనూ, 2019లో వ్యతిరేకించిన సందర్భంలోనూ బీజేపీకి బాగా నష్టం వాటిల్లిందని బలంగా విశ్వసిస్తున్నారు. అందువల్ల టీడీపీ నుంచి ఎంతటి ఆపర్లు వచ్చినా వాటిని స్వీకరించేందుకు కేంద్రం సిద్ధంగా లేదు. జనసేనతో కలిసి ప్రత్యామ్నాయ శక్తిగా బలపడాలనేదే కమలం పార్టీ దీర్ఘకాలిక ప్రణాళిక. ఈ క్రమంలో మరోసారి వైసీపీ అధికారంలోకి వచ్చినా ఫర్వాలేదు. టీడీపీకి మాత్రం అవకాశం దక్కకూడదనేది అత్యున్నత స్థాయిలో తీసుకున్న నిర్ణయంగా చెబుతున్నారు. అయితే టీడీపీ నిర్వీర్యమవుతున్న దశలో వైసీపీ అనాలోచిత చర్యలతో తెలుగుదేశం పార్టీ కి ఇమేజ్ పెంచుతోందని బీజేపీ ఆందోళన చెందుతోంది. టీడీపీ బలపడితే వైసీపీని సవాల్ చేసే మూడో కూటమిగా బీజేపీ , జనసేనలకు అధికార పోటీలో చాన్సులు సన్నగిల్లుతాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News