ఉండేదెంత? ఊడేదెంత?

భారతీయ జనతా పార్టీ, జనసేన కలిస్తే ఏమవుతుంది? బొమ్మ దుమ్ము లేపుతుందా? ఇదీ ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్. ఈ జోడీ ఎవరి ఓట్లను చీలుస్తుంది? [more]

Update: 2020-01-19 08:00 GMT

భారతీయ జనతా పార్టీ, జనసేన కలిస్తే ఏమవుతుంది? బొమ్మ దుమ్ము లేపుతుందా? ఇదీ ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్. ఈ జోడీ ఎవరి ఓట్లను చీలుస్తుంది? ఎవరికి దెబ్బకొడుతుంది? అన్నది విలేజ్ లెవెల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే రెండు పార్టీలూ కలసినా ఎవరికీ పెద్దగా నష్టం ఏమీ లేదనే వాదన కూడా ఉంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతాన్ని ఒకసారి పరిగణనలోకి తీసుకుంటే అదే అనిపించక మానదు.

2014 ఎన్నికల్లో…..

2014 ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ లు కలసి బరిలోకి దిగాయి. ఆ ఎన్నికల్లో జనసేన పోటీ చేయకపోయినా బయట నుంచి మద్దతు ఇచ్చింది. టీడీపీ అధికారంలోకి వచ్చింది కానీ అఖండ విజయమేదీ కాదన్నది అందరికీ తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో మోదీ, పవన్ కల్యాణ్ హవా వల్లనే గెలిచిందని టీడీపీ పై ఇప్పటికీ కొందరు సెటైర్లు వేస్తుంటారు. నిజానికి ఈ మూడు పార్టీలో క్షేత్రస్థాయిలో బలమున్నది ఒక్క టీడీపీకే. అంతకు ముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ టీడీపీ అధిక స్థానాలను గెలుచుకుంది.

తాజా ఎన్నికల్లో…..

ఇదే అంశాన్ని టీడీపీ చెప్పినా దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. పవన్ కల్యాణ్ ,మోడీ వల్లనే చంద్రబాబు గెలిచారని ఇప్పటికీ అనుకునే వారు అనేక మంది. అయితే 2019 ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే జనసేన పార్టీకి 6 శాతం ఓట్లు వచ్చాయి. బీజేపీ ఒక్క శాతంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అధికార వైసీపీకి యాభై శాతం ఓట్లు వస్తే, విపక్ష టీడీపీకి 40 శాతం ఓట్లు వచ్చాయి. జనసేన, బీజేపీలు అధికార, విపక్ష దరిదాపుల్లో లేవు.

ప్రజలు నమ్ముతారా?

ిఇక ఏపీని ప్రత్యేకంగా చూడాలి. ఇక్కడ బీజేపీని సమర్థించడానికి ఏ ఒక్క అంశమూ లేదు. మోదీ జాతీయ స్థాయిలో ఎన్నో దేశాభివృద్ధికి కార్యక్రమాలు చేపడుతున్నా ఏపీకి మాత్రం రిక్తహస్తమే చూపించారు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ దగా చేసింది. అటువంటి పార్టీని ఏపీ ప్రజలు ఎప్పటికీ ఆదరించే అవకాశమే లేదు. కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఏపీలో దాని ప్రభావం చూపిస్తుందనుకోలేం. అందుకని బలహీనంగా ఉన్న ఒక పార్టీ, అత్యంత దయనీయంగా ఉన్న మరొక పార్టీతో పొత్తు పెట్టుకున్నా ప్రయోజనం ఉండదన్నది విశ్లేషకుల అంచనా.

Tags:    

Similar News