ఆ రెండు జరిగితేనేగా

భారతీయ జనతాపార్టీకి మళ్లీ ఆంధ్రప్రదేశ్ లో బలమైన మిత్రుడు దొరికాడు. రాష్ట్రంలో బీజేపీ, జనసేనల తృతీయ ప్రత్యామ్నాయం ఆవిర్బవించింది. జనబాహుళ్యంలో జనసేన పవన్ కల్యాణ్ కు ఉన్న [more]

Update: 2020-01-16 15:30 GMT

భారతీయ జనతాపార్టీకి మళ్లీ ఆంధ్రప్రదేశ్ లో బలమైన మిత్రుడు దొరికాడు. రాష్ట్రంలో బీజేపీ, జనసేనల తృతీయ ప్రత్యామ్నాయం ఆవిర్బవించింది. జనబాహుళ్యంలో జనసేన పవన్ కల్యాణ్ కు ఉన్న ఆకర్షణ జాతీయంగా బీజేపీకి ఉన్న బలమైన నాయకత్వం కలగలిసి 2024 నాటికి రాష్ట్రంలో అధికార విపక్షాలకు పోటీదారుగా రంగంలో నిలిచే ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే టీడీపీ, వైసీపీలు రెండే పెద్ద పార్టీలుగా ఉన్నా ప్రస్తుత రాజకీయ వాతావరణంలో పెనుమార్పులు సంభవించినప్పుడే ఈ కూటమి ఆశలు, ఆశయాలు ఫలించేందుకు అవకాశాలున్నాయి. వైసీపీకి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత, టీడీపీ తీవ్రంగా బలహీనపడటం వంటి పరిణామాలు చోటు చేసుకున్నప్పుడే బీజేపీ, జనసేనలకు మంచి చాన్సు దొరుకుతుంది.

జంట దొరికింది…

టీడీపీ, జనసేన దూరం పెట్టడంతో మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ దారుణంగా నష్టపోయింది. అటు తెలంగాణ రాష్ట్రంలో నాలుగు లోక్ సభ స్థానాలు గెలుచుకున్న కేంద్రంలోని అధికారపార్టీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం చతికిలపడింది. దాదాపు అన్నిచోట్ల డిపాజిట్లు కోల్పోయి, ఒకశాతం ఓట్లకే పరిమితమై సంస్థాగతంగా ఉన్న బలాన్ని కూడా నిరూపించుకోలేకపోయింది. అటు వామపక్షాలతో జట్టుకట్టిన జనసేన, ఇటు టీడీపీ, మరోవైపు వైసీపీ సైతం కేంద్రంలోని బీజేపీని రాష్ట్ర వెనకబాటుతనానికి ప్రధాన ముద్దాయిగా చూపించడానికి పోటీలు పడ్డాయి. ఫలితంగా దేశవ్యాప్తంగా బీజేపీ పవనాలు వీచినప్పటికీ ఏపీలో మాత్రం దెబ్బతింది. అప్పట్నుంచి పట్టుకోసం ప్రయత్నిస్తున్న బీజేపీకి పవన్ కల్యాణ్ రూపంలో ఒక జనసమ్మోహక శక్తి అండ దొరికింది. భవిష్యత్ రాజకీయాలను ఈ పొత్తు ఎలా ప్రభావితం చేస్తుందనే సంగతిని పక్కనపెట్టినా ఇక బీజేపీ , జనసేన సభలకు ప్రజాకర్షణకు కొరత ఉండదు. కులాలు, ప్రాంతాలు, సామాజిక సమీకరణలతో చీలిపోయిన రాష్ట్ర ఓటరును తమ సిద్ధాంతాలవైపు ఎలా ఆకర్షిస్తాయనేదే ఈ రెండు పార్టీల ముందు నిలుస్తున్న ప్రశ్న.

చంద్రబాబు విశ్వాసరాహిత్యం…

తెలుగుదేశం పార్టీని బీజేపీ తనంతతానుగా దూరం పెట్టలేదు. బీజేపీకి, నరేంద్ర మోడీకి దేశవ్యాప్తంగా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్న తప్పుడు అంచనాతో చంద్రబాబు నాయుడు జాతీయ పార్టీని దూరం చేసుకున్నారు. తెరవెనకకు నెట్టిన ఏపీ ప్రత్యేక హోదాను ముందుకు తెచ్చి నరేంద్రమోడీని లక్ష్యంగా చేసుకుంటూ విఫల పోరాటం సాగించారు. దాంతో అటు తెలుగుదేశం, ఇటు బీజేపీ రెండూ నష్టపోయాయి. ముఖ్యంగా తెలుగుదేశం రెంటికీ చెడ్డ రేవడిలా మిగిలింది. అటు కేంద్రంలో బలమైన మిత్రుడిని కోల్పోయింది. ఇటు రాష్ట్రంలో అధికారాన్ని పోగొట్టుకుంది. 1999, 2014 లలో చంద్రబాబు నాయుడు విజయం సాధించిన రెండు సందర్బాల్లోనూ బీజేపీతో కలిసే నడిచారు. కానీ తర్వాత ఆ పార్టీని దూరం పెట్టారు. దీంతో చంద్రబాబు నాయుడు కష్టకాలంలో నమ్మదగ్గ మిత్రుడు కాదని బీజేపీ అగ్రనాయకత్వం ఒక అంచనాకు వచ్చింది. టీడీపీ నుంచి పొత్తు సంకేతాలు వచ్చినప్పటికీ ఉదాసీనంగానే వ్యవహరించింది. జనసేనతో చేతులు కలిపేందుకు ముందుకు వచ్చింది. ఈనేపథ్యంలోనే టీడీపీ, వైసీపీ రెండు పార్టీలకూ సమదూరం పాటిస్తామని రాష్ట్రవ్యహారాల ఇన్ ఛార్జి స్పష్టంగా ప్రకటించారు. బీజేపీతో మంచిగా మెలగాలని ప్రయత్నిస్తున్న అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ రెంటికీ ఇది చేదు పరిణామమే.

వైసీపీ తో వర్కవుట్ కాదు…

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అనేక అంశాల్లో కేంద్రానికి అండగా నిలుస్తోంది. పౌరసత్వ సవరణ చట్టం విషయంలోనూ మద్దతు ఇచ్చింది. పైపెచ్చు రాష్ట్రంలో అత్యంతబలమైన రాజకీయ పార్టీగా ఉంది. అయితే సైద్ధాంతిక విభేదాలు బీజేపీ, వైసీపీ పొత్తు అవకాశాలను సన్నగిల్ల చేశాయి. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి స్వయంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో మతమార్పిడులు జరుగుతున్నాయని ఆరోపించారంటే బీజేపీ కోణం అర్థమవుతుంది. మైనార్టీలు, ఎస్సీ,ఎస్టీ వర్గాలు వైసీపీకి రాష్ట్రంలో బలమైన అండగా ఉన్నారు. అదే సమయంలో వాణిజ్య, అగ్రవర్ణ, మధ్యతరగతి బీసీ ఓటింగుపైనే బీజేపీ ఆధారపడుతోంది. జగన్ మోహన్ రెడ్డిపైన ఉన్న తీవ్ర ఆర్థిక నేరాల ఆరోపణల విషయంలోనూ బీజేపీ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఒకవేళ వైసీపీతో పొత్తు పెట్టుకోవాలనుకుంటే కేంద్రం ముందు కొన్ని డిమాండ్లు, రాజకీయ బేరసారాలు తప్పనిసరి కావచ్చు. అదే జరిగితే బీజేపీకి తాత్కాలిక ప్రయోజనం చేకూరినప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో ఎదుగుదలకు గండి పడినట్లే. వైసీపీ విదిల్చే సీట్లతోనే సంతృప్తి పడాల్సి వస్తుంది.

సీట్ల సర్దుబాబు…..

జనసేనతో సీట్ల సమస్య పెద్దగా ఎదురుకాదు. రాష్ట్రంలో పార్టీ బలపడటానికి పవన్ కల్యాణ్ ప్రచారం బాగా లాభించవచ్చు. పౌరసత్వ సవరణ చట్టం బీజేపీ ఎదుర్కొంటున్న పెద్ద సవాల్. మైత్రి పొడిచిన మొదటి రోజే పవన్ కల్యాణ్ సీఏఏ పై ఇచ్చిన వివరణ అదే విషయాన్నిస్పష్టం చేస్తోంది. ఇంతవరకూ రాష్ట్రంలో బీజేపీ నాయకులు ఎవరూ చెప్పలేనంత స్పష్టంగా పవన్ క్లారిటీ ఇచ్చారు. ఇది కచ్చితంగా బీజేపీకి సంతృప్తి కలిగించే అంశం. పొత్తుకే జనసేన, బీజేపీలు పరిమిత మవు తాయా? లేకపోతే మరింత ముందుకు వెళ్లి జనసేనను విలీనం చేసి రాష్ట్ర నాయకత్వ పగ్గాలు చేపట్టమనే పాత ప్రతిపాదనను కేంద్ర నాయకత్వం మళ్లీ పవన్ ముందుకు తెస్తుందా? అన్న ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. దాంతో పాటు ఇప్పటికీ బలంగా ఉన్న టీడీపీని కలుపుకోకుండా వైసీపీని ఎదిరించేంతటి ప్రజాబలం జనసేన, బీజేపీలు సమకూర్చుకోవడం వాస్తవిక రాజకీయ పరిస్థితుల్లో సాధ్యమేనా? అన్న అంశమూ కాలం తేల్చాల్సిందే.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News