పైకి బలంగా? లోపల మాత్రం?

సగటున రాష్ట్రానికి ఒకటి చొప్పున ప్రాంతీయ పార్టీలు పుట్టగొడుగుల్లా ఆవిర్భవించినప్పటికీ దేశ రాజకీయాల్లో బీజేపీ, కాంగ్రెస్ లదే కీలక పాత్ర. ఈ రెండింటిలో ఏదో ఒక జాతీయ [more]

Update: 2020-02-16 16:30 GMT

సగటున రాష్ట్రానికి ఒకటి చొప్పున ప్రాంతీయ పార్టీలు పుట్టగొడుగుల్లా ఆవిర్భవించినప్పటికీ దేశ రాజకీయాల్లో బీజేపీ, కాంగ్రెస్ లదే కీలక పాత్ర. ఈ రెండింటిలో ఏదో ఒక జాతీయ పార్టీ వైపు ప్రాంతీయ పార్టీలు నిలబడాల్సిందే. అంటే రెండు ప్రధాన జాతీయ పార్టీల చుట్టూనే రాజకీయాలు తిరుగుతున్నాయి. ఈ నేపథ్యాన్ని పరిశీలిస్తే అధికార భారతీయ జనతా పార్టీ బలోపేతంగా కన్పిస్తుంది. విపక్ష కాంగ్రెస్ దయనీయ పరిస్థితిలో ఉన్నట్లు కనపడుతోంది. అయితే ఈ పరిస్థితి వందకు వంద శాతం కరెక్టేనా? అని ప్రశ్నించుకుంటే సరైన సమాధానం దొరకదు. ప్రధాన జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లలో దేనికి ఉండే ఇబ్బందులు దానికి ఉన్నాయి. లోక్ సభ లో 300కు పైగా సీట్లతో బీజేపీ బలంగా, కనీసం విపక్ష హోదా కూడా లేక వందేళ్ల చరిత్ర గల కాంగ్రెస్ ఈసురోమంటున్న దృశ్యం ఆవిష‌్కృతమవుతోంది. సాపేక్షింగా చూస్తే ఇది వాస్తవమే. కానీ లోతుగా అధ్యయనం చేస్తే రెండు పార్టీలూ పోటా పోటీగా ఉన్నాయన్న విషయం స్పష్టమవుతోంది.

రాష్ట్రాల్లో ఖాళీ అవుతూ…..

నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ బలంగా ఉన్నట్లు కనపడుతున్న మాట వాస్తవం. మోదీ, షా ద్వయం సారథ్యంలోని పార్టీ సంస్థాగతంగా పటిష్టంగా ఉంది. కానీ 2019 ఎన్నికల అనంతరం పరిస్థిితి తారుమారైంది. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వాస్తవానికి ఈ నాలుగు రాష్ట్రాల్లో గత ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కమలం పార్టీ విజయఢంకా మోగించింది. లోక్ సభ ఎన్నికల్లో పనిచేసిన మోదీ, అమిత్ షా అంచనాలు, వ్యూహాలు అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురు తన్నాయి. ఈ నాలుగింటిలో మూడు కమలం పార్టీ రాష్ట్రాలే కావడం గమనార్హం. ఫలితంగా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల సంఖ్య కుదించుకుపోయింది. ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, అసోం, త్రిపుర, గోవా, అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో అంటే తొమ్మిది రాష్ట్రాల్లోనే బీజేపీ అధికారంలో ఉంది. మేఘాలయ, మణిపూర్, బీహార్, సిక్కింలలో మిత్రపక్షాలతో సంకీర్ణ ప్రభుత్వంలో ఉంది. లోక్ సభ ఎన్నికల అనంతరం జరిగిన నాలుగు రాష్ట్రాలను బీజపీ కోల్పోయింది. ముఖ్యంగా మహారాష్ట్ర వంటి పెద్ద రాష్ట్రం రాజకీయంగా ప్రాధాన్యత గల ఢిల్లీని కోల్పోవడం కమలనాధులు జీర్ణించుకోలేని విషయమే. కేవలం నరేంద్ర మోదీ, అమిత్ షా ద్వయం వ్యూహాలు సంస్థాగతంగా పటిష్టంగా ఉండటం వల్ల బీజేపీ బలోపేతంగా కన్పిస్తుంది. దానికి ఉండే తలనొప్పులు , చిక్కులు, ఇబ్బందులు దానికి ఉన్నాయి. పైకి కనపడినంత గొప్పగా మాత్రం పరిస్థితులు లేవన్నది చేదునిజం. ఈ విషయాన్ని బీజేపీ ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటోంది.

బలంగానే కాంగ్రెస్…..

వరస ఓటములు, కనీసం విపక్ష హోదా సయితం లేకపోవడం, ధీటైన నాయకత్వ లేమి కారణంగా కాంగ్రెస్ పరిస్థిితి దయనీయంగా ఉన్నట్లు కనపడుతోంది. వాస్తవానికి జాతీయ స్థాయిలో నైరాశ్యం తప్ప రాష్ట్ర స్థాయిలో పరిస్థితి ఒకింత సంతృప్తికరంగానే ఉంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, పంజాబ్, పుదుచ్చేరిలలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పవర్ లో ఉంది. ఇక మహారాష్ట్ర, జార్ఖండ్ లలో సంకీర్ణ సర్కార్ లో ఆ పార్టీ భాగస్వామిగా ఉంది. కర్ణాటక, గుజరాత్ లలో పార్టీ బలంగా ఉంది. ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. వాస్తవానికి ఒకింత వ్యూహాత్మకంగా, సమర్థంగా వ్యవహరించి ఉంటే ఈ రెండు రాష్ట్రాల్లో పార్టీ పాగా వేసి ఉండేదన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. గోవాలో ఏకైక పెద్ద పార్టీగా ఉన్నప్పటికీ గవర్నర్ ను ప్రయోగించి అక్కడ బీజేపీ అధికారాన్ని సాధించింది. మేఘాలయలో సంకీర్ణ సర్కార్ లో పార్టీ భాగస్వామి. ఇక సంస్థాగతంగా పార్టీ క్షేత్రస్థాయిలో బలంగా ఉంది. పార్టీ సంప్రదాయ మద్దతుదారులు, నాయకులు, కార్యకర్తలు చెక్కు చెదరలేదు. ఉన్న సమస్యల్లా వారిని ముందుకు నడిపించే నాయకుడు లేకపోవడమే. పార్టీ అధినేత్రి సోనియా వృద్ధాప్యం, అనారోగ్యం వల్ల క్రియాశీలకంగా లేరు. మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన సమర్థతను నిరూపిించుకోలేక పోయారు. దీంతో పార్టీ యంత్రాంగం నైరాశ్యంలో మునిగిపోయింది. సమర్థ నాయకత్వం ఉంటే పార్టీ ప్రజల్లోకి చొచ్చుకు పోగలదు. బీజేపీకి ధీటుగా పోటీ ఇవ్వగలదు. వచ్చే నాలుగేళ్లలో అయినా పార్టీ పరిస్థితి మారుతుందో? లేదో? చూడాలి.

 

– ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News