ఏపీలో గోవా మార్క్ ఫార్ములా

బీజేపీ ఒక్కసారిగా దూకుడు పెంచేసినట్లుగా ఉంది. అన్నీ వైపులా దక్కినా కూడా దక్షిణం అంటూ కలవరిస్తున్న బీజేపీ ఇక ఆగలేనట్లుగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయడానికి [more]

Update: 2019-09-05 03:30 GMT

బీజేపీ ఒక్కసారిగా దూకుడు పెంచేసినట్లుగా ఉంది. అన్నీ వైపులా దక్కినా కూడా దక్షిణం అంటూ కలవరిస్తున్న బీజేపీ ఇక ఆగలేనట్లుగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయడానికి ఏమేం చేయాలో అన్నీ చేసేలా కనిపిస్తోంది. ఏపీ అసెంబ్లీలో ఒక్క సీటు కూడా లేని ఆ పార్టీ ఇపుడు ఒక్కసారిగా ప్రధాన ప్రతిపక్షంగా మారాలనుకుంటోంది. మొత్తం అసెంబ్లీలో పది శాతం సభ్యులు అంటే 18 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే కానీ ప్రతిపక్ష పాత్ర దక్కదు. మరి బీజేపీ ఏ ధైర్యంతో ఈ స్టేట్ మెంట్ ఇచ్చిందన్నది ఏపీలో వాడివేడిగా జరుగుతున్న చర్చ. ఏపీ అసెంబ్లీలో టీడీపీ బొటాబొటిన ప్రతిపక్ష పాత్రకు తగ్గ సీట్లు తెచ్చుకుంది. జనసేనకు ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నారు. మొత్తానికి మొత్తం వూడ్చేసినట్లుగా వైసీపీ 151 మంది ఎమ్మెల్యేలను తన ఖాతాలో వేసుకుంది. ఈ రకమైన కాంపొజిషన్లో బీజేపీ ఎలా ఏపీ అసెంబ్లీలో ఎంట్రీ ఇస్తుందన్నది హీటెక్కించే చర్చగానే ఉంది.

టీడీపీ నుంచేనా…?

రెండు తెలుగు రాష్ట్రాలో చూసుకుంటే బీజేపీకి ఏపీలోనే బలం పెంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు అంటున్నారు. నలుగురు ఎంపీలు, ఒక ఎమ్మెల్యే, ఎంతో మంది లీడర్లు, బలమైన క్యాడర్ ఉన్న తెలంగాణా కంటే ఏపీలో బీజేపీకి ఎలా బలం వస్తుందని ఆయన ఈ మాట అన్నారని తరచి చూస్తే ఫిరాయింపుల మీదనే అధారపడి అన్న సమాధానం వస్తుంది. ఇప్పటికే ఏపీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులను టీడీపీ నుంచి లాగేసిన బీజేపీ ఇపుడు ఎమ్మెల్యేల మీద గురిపెట్టినట్లుగా కనిపిస్తోంది. టీడీపీలో ఎమ్మెల్యేలు ఇపుడు అటూ ఇటూ కాకుండా నలిగిపోతున్నారు. వారికి ఏ పార్టీలో చేరాలన్న ఫిరాయిస్తే అనర్హత వేటు కత్తి హడలెత్తిస్తోంది. అయితే రాజ్యసభ‌లో మాదిరిగా విలీనం అన్న ఆయుధంతో ఒక్కసారిగా గుంపుగా చేరిపోవచ్చు. ఇపుడు మురళీధరరావు అంటున్న మాటలు చూస్తూంటే బీజేపీలొకి పోలోమంటూ పెద్ద ఎత్తున ఎమ్మెల్యే తమ్ముళ్ళు వచ్చేసేలా సంకేతాలు ఉన్నాయేమో అనిపిస్తోంది.

గోవా రూట్లోనే…?

వచ్చిన వారిని వచ్చినట్లుగా కాషాయ కండువా కప్పేసి గోవాలో ప్రతిపక్షం అన్నది లేకుండా కాంగ్రెస్ ని మటాష్ చేసి పారేసిన బీజేపీ ఏపీలో అదే ఫార్ములాను అనుసరిస్తుందా అనిపిస్తోంది. మూడొంతుల మంది ఎమ్మెల్యేలు ఒకేసారి పార్టీ ఫిరాయిస్తే వారికి అనర్హత వేటు వర్తించదని అంటున్నారు. ఆ విధంగా చూసుకుంటే అరడజను మంది తప్ప మొత్తానికి మొత్తం టీడీపీ నుంచి బయటకు వచ్చేస్తారన్న అంచనాలేవో బీజేపీకి ఉన్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ తీరు చూస్తే ఫిరాయించేదేదో ఇప్పటినుంచే తమ పార్టీలోకి వచ్చేస్తే రానున్న కాలమంతా వారు బీజేపీ ఎమ్మెల్యేలుగా జనంలో ఉంటారు. పార్టీ కూడా బలపడుతుందన్న ఆలోచనలు ఉన్నట్లున్నాయి. మొత్తానికి చూసుకుంటే మురళీధరరావు పెద్ద బాంబే పేల్చారు. ఇపుడు చంద్రబాబు తేరుకున్నా కూడా జరిగేది చూస్తూండడం తప్ప చేయగలిగేది ఏదీ లేదేమో.

Tags:    

Similar News