‘క్యాబ్ ’తో కట్టడి

కేంద్రప్రభుత్వం రాజకీయంగా రోజురోజుకీ బలపడుతోంది. రాజ్యాంగ పరంగానూ తమ పార్టీ సిద్దాంతానికి అనుగుణమైన మార్పుల దిశలో వేగంగా చర్యలు తీసుకుంటోంది. భారతీయ జనతాపార్టీ 2014లో సొంతంగా లోక్ [more]

Update: 2019-12-10 16:30 GMT

కేంద్రప్రభుత్వం రాజకీయంగా రోజురోజుకీ బలపడుతోంది. రాజ్యాంగ పరంగానూ తమ పార్టీ సిద్దాంతానికి అనుగుణమైన మార్పుల దిశలో వేగంగా చర్యలు తీసుకుంటోంది. భారతీయ జనతాపార్టీ 2014లో సొంతంగా లోక్ సభలో ఆధిక్యం సాధించి అధికారం సాధించినప్పుడు కొన్ని సందేహాలుండేవి. అప్పట్లో కొన్ని శషభిషలు, తటపటాయింపు ఉండేవి. రెండోసారి 2019 లో మరింత బలాధిక్యంతో ఎన్నికైన తర్వాత వీటన్నిటికి చెక్ పెట్టేసి తన అజెండా అమలుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. వివాదాస్పద అంశాల విషయంలోనూ కఠినంగా ముందుకెళ్లేందుకే సిద్ధమైంది. పార్టీ అధ్యక్షుడైన అమిత్ షా ను హోం మంత్రి స్థానంలో కూర్చోబెట్టి ఆచరణకు శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వం. కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు పూర్తయింది. అయోధ్యలో రామజన్మభూమికి క్లియరెన్స్ వచ్చేసింది. ఇక మిగిలింది ఉమ్మడి పౌరస్మృతి మాత్రమే. దానికి సంబంధించి కూడా త్రిపుల్ తలాక్ బిల్లు తో పాక్షికంగా బాటలు వేసుకున్నారు. తాజాగా పౌరసత్వ సవరణ బిల్లు . ఇది వివాదాస్పదమే కాకుండా కేంద్ర ప్రభుత్వ అజెండాలో అత్యంత కీలకంగా మారింది. పొరుగుదేశాల నుంచి వలస వచ్చేవారి పౌరసత్వానికి మతాన్ని ప్రాతిపదికగా తీసుకుంటూ ప్రవేశపెట్టిన ఈ బిల్లు ద్వారా బీజేపీ ఆశించే లక్ష్యాలు భిన్నంగా ఉన్నాయి.

భిన్నధ్రువాలు…

లోక్ సభలో సొంతంగానే మెజార్టీ ఉన్న బీజేపీకి మద్దతు దారుల కొరత కూడా లేదు. రకరకాల కారణాలతో కేంద్రప్రభుత్వానికి ప్రాంతీయపార్టీలు మద్దతు పలుకుతున్నాయి. పార్టీ పరంగా బిల్లులోని అంశాలతో విభేదించాల్సి ఉన్నప్పటికీ రాజకీయ అనివార్యత ఆయా పార్టీలను కేంద్రం వెంట నడవకతప్పని పరిస్థితి కల్పిస్తోంది. బీజేడీ, ఏఐఏడీఎంకే వంటి పార్టీల మద్దతు దీనికి ఒక ఉదాహరణగా చెప్పుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, వైసీపీలు చాలా విషయాల్లో కేంద్రానికి మద్దతుగా నిలిచాయి. కీలకమైన బిల్లుల విషయంలో ఈ రెండు పార్టీలు బీజేపీకి అండగా నిలుస్తూ వచ్చాయి. అయితే తొలిసారిగా ఈ బిల్లు విషయంలో వైసీపీ, టీఆర్ఎస్ లు పరస్పర భిన్నవైఖరులను తీసుకున్నాయి. రాష్ట్రంలో వైసీపీకి ముస్లిం మైనారిటీల మద్దతు బలంగా ఉంది. రాయలసీమ జిల్లాల్లో ఆ పార్టీ ఘనవిజయంలో వారి పాత్ర చాలా ఎక్కువగానే కనిపిస్తుంది. పౌరసత్వ సవరణ బిల్లును ముస్లిం పార్టీలు, ఆయా వర్గాలు వ్యతిరేకిస్తున్న స్థితిలో కేంద్రానికి మద్దతుగా వైసీపీకి నిర్ణయం తీసుకోవడం చాలా కీలకమనే చెప్పాలి. రాష్ట్రానికి ఉన్న ఆర్థిక అవసరాలు, కేంద్ర్రప్రాజెక్టులు, రాజకీయ సహకారం దృష్టిలో పెట్టుకునే కేంద్రానికి వైసీపీ అండగా నిలిచింది. అదే సమయంలో టీఆర్ఎస్ మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముస్లిం జనాభా సంఖ్య, ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకుని కొంత దృఢంగానే వ్యవహరించింది. కేంద్రప్రభుత్వ మనోభిప్రాయానికి భిన్నంగా పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకించడానికే నిశ్చయించుకుంది.

మైనారిటీలకు మంచిదేనా..?

దేశంలో ఉండే ముస్లిం మైనారిటీలు ఈ బిల్లును స్థూలంగా వ్యతిరేకిస్తున్న మాట నిజం. కానీ పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆప్గనిస్తాన్ నుంచి ముస్లింలు పెద్ద ఎత్తున వలస వస్తే జరిగే నష్టం ఎవరికనే ప్రశ్నకు సమాధానం వెదకాల్సి ఉంటుంది. కేంద్రప్రభుత్వం బహిరంగంగా చెబుతున్న అంశానికి, అంతర్గత ఉద్దేశానికి మధ్య వైరుద్ధ్యం ఉంది. పొరుగున ఉన్న ఆయా దేశాల్లో మైనారిటీ మతస్థులైన హిందువులు మతపరమైన వివక్షను ఎదుర్కొంటున్నారు కాబట్టి వారికి భారత పౌరసత్వం ఇవ్వడంలో సహజ న్యాయం ఉందనేది బహిరంగంగా చెబుతున్న ఉద్దేశం. అయితే ఆయా దేశాల నుంచి ప్రత్యేకించి ముస్లింలు వస్తే వారికి పౌరసత్వం ఇస్తే ఆ ముసుగులో ఉగ్రవాదులు చొరబడే ప్రమాదం ఉందనేది అంతర్గత అనుమానం. అయితే సాధారణ పౌరులు ఆలోచించుకోవాల్సిన అంశం కూడా మరొకటి ఉంది. ఆయా దేశాల్లో ప్రజాస్వామిక లక్షణాలు చాలా తక్కువ. అందువల్ల భారత లౌకిక తత్వాన్ని ఇష్టపడి లక్షల్లో ముస్లిం లు తరలివస్తే ఇక్కడి స్థానిక ముస్లింలకూ ఇబ్బందే. వివిధ రాష్ట్రప్రభుత్వాలు, కేంద్రం మైనారిటీలకు అనేక రకాల ప్రయోజనాలు సమకూరుస్తున్నాయి. ఇతర దేశాల నుంచి తరలివచ్చే ముస్లింలు పౌరసత్వం పొందితే వారంతా కూడా ఆయా పథకాల్లో పోటీదారులవుతారు. ఈ విషయంపై పెద్దగా చర్చ జరగడం లేదు. ఎలాగూ కేంద్రమే వారి పౌరసత్వాన్ని నిరోధిస్తుంది కాబట్టి దానిపై పెద్దగా చర్చ అనవసరమనుకుంటున్నారు. హిందువులతోపాటు పౌరసత్వం విషయంలో ముస్లింలకూ వివక్ష ఉండకూడదనే అంశమే చర్చల్లో చోటు చేసుకుంటోంది. ఒకవేళ అటువంటి నిబంధన ఎత్తివేస్తే ఇప్పటికే వెనకబడి ఉన్న దేశీయ ముస్లిం వర్గాలు ఇతర దేశాల నుంచి వచ్చే తమ మతస్థుల నుంచే సంక్షేమ పథకాల విషయంలో పోటీని ఎదుర్కోవాల్సి వచ్చే ప్రమాదం ఉంటుంది.

ఏకచ్ఛత్రాధిపత్యం…

బీజేపీ రాజకీయ లక్ష్యాల విషయంలో చాలా దూకుడుగానే వ్యవహరిస్తోంది. రేపటి పొలిటికల్ మ్యాప్ ఏరకంగా ఉండబోతుందో ఎవరికి తెలుసనే ధోరణిలో సైద్దాంతికంగా దేశాన్ని ఏకచ్చత్రాధిపత్యం కిందకు తేవాలనే యత్నాలను వేగవంతం చేసింది. 2018 నాటికి దేశంలో భౌగోళికంగా 70శాతం పైగా రాష్ట్రాల్లో బీజేపీ అధికారం చెలాయించింది. 2019 లోక్ సభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించినప్పటికీ భౌగోళికంగా దేశంలో 45 శాతం ప్రాంతాల్లోనే బీజేపీ అధికారంలో ఉంది. రాష్ట్రాల సంఖ్య పరంగా చూస్తే మాత్రం సగానికి పైగా బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయి. బీజేపీ వ్యవస్థాపన నుంచి చెబుతూ వచ్చిన ప్రధానాంశాలన్నీ సాకారమైపోయాయి. ఉమ్మడి పౌరస్మృతి ఒక్కటే మిగిలి ఉంది. పౌరసత్వ సవరణ వంటి వాటినీ పట్టాలపైకి ఎక్కిస్తోంది. ఏదేమైనా 2024 ఎన్నికలో కమలం పార్టీ అధికారంలోకి వచ్చినా, రాకపోయినా సైద్దాంతికంగా తాను అనుకున్నది ఈలోపుగానే సాధించాలనే తపన బీజేపీలో కనిపిస్తోంది. అందుకనుగుణంగానే రాజ్యాంగ సవరణలకు సైతం సిద్దమవుతోంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News