ఆ ముగ్గురి టార్గెట్ ఎవరు?

భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కొంత పుంజుకుంటుందన్న సమయంలో నేతల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. కేంద్రంలోకి మరోసారి అధికారంలోకి రావడంతో కొందరు కీలక నేతలు ఇష్టాను సారం [more]

Update: 2019-09-03 11:00 GMT

భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కొంత పుంజుకుంటుందన్న సమయంలో నేతల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. కేంద్రంలోకి మరోసారి అధికారంలోకి రావడంతో కొందరు కీలక నేతలు ఇష్టాను సారం వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికే తెలంగాణ నుంచి కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డికి స్థానం కల్పించారు. తాజాగా బండారు దత్తాత్రేయకు గవర్నర్ పదవి ఇచ్చారు. త్వరలో మరికొన్ని కీలక పదవులను భర్తీ చేస్తామన్న అధిష్టానం సంకేతాలను కూడా ఏమాత్రం బీజేపీ నేతలు పట్టించుకోవడం లేదు.

నలుగురు గెలిచినా…..

ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మొత్తం నలుగురు పార్లమెంటు సభ్యులు బీజేపీ నుంచి గెలిచారు. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి గెలుపొందగా ఆయనకు కేంద్రంలో మంత్రి పదవి లభించింది. ఇక నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, ఆదిలాబాద్ నుంచి సోయం బాబూరావు, కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి బండి సంజయ్ గెలుపొందారు. అయితే పార్టీ కార్యక్రమాల్లో కిషన్ రెడ్డికి మినహా మరెవ్వరికి ప్రాధాన్యత దక్కడం లేదన్నది ఆ ముగ్గురి ఎంపీల ఆరోపణ.

ఆయనపై యుద్ధమేనంటూ…

ముగ్గురు ఎంపీలు ఇప్పుడు ఒక్కటై బీజేపీలో ఒక కీలకనేతపై యుద్ధం ప్రకటించారు. తాము రాష్ట్ర పరిస్థితులపై మాట్లాడాలని భావిస్తున్నామని, తమకు అపాయింట్ మెంట్ ఇవ్వాలని ఈ ముగ్గురు పార్లమెంటు సభ్యులు పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జెపి నడ్డాను కోరారు. ప్రధానంగా వీరు కొంతకాలంగా తమలో ఉన్న అసంతృప్తిని నడ్డా ముందు వెళ్లగక్కాలనుకుంటున్నారు. అందుకోసం తమకు సమయం కేటాయించాల్సిందిగా కోరారు.

అవమానిస్తున్నారంటూ….

ముగ్గురు ఎంపీలకు తెలంగాణ రాష్ట్ర బీజేపీ ప్రాధాన్యత ఇవ్వకపోవడమే కారణం. ఇటీవల జేపీ నడ్డా హాజరైన సమావేశంలోనూ తమను పార్టీ రాష్ట్ర నేత ఒకరు అవమానించారని చెబుతున్నారు. ప్రొటోకాల్ పాటించకుండా తమను పక్కనపెట్టారంటున్నారు. టీఆర్ఎస్ దిగ్గజాలైన కవిత, వినోద్ కుమార్ లను ఓడించినా తమను చిన్నచూపు ఏంటన్నది వారి ప్రశ్న. తాము కష్పపడి పార్టీ కోసం పనిచేస్తున్నా గుర్తింపు లేకుండా పోయిందంటున్నారు. వీరి అసంతృప్తి బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ మీదా? లేక మురళీధరరావు మీదా? అనే చర్చ పార్టీలో జరుగుతుంది.

Tags:    

Similar News