ఆ నలుగురు....!!

Update: 2018-11-19 15:30 GMT

భారతీయ జనతాపార్టీ కేంద్రంలో అధికార పార్టీ. తెలంగాణలో మాత్రం బుల్లిపక్షమే. 2014 ఎన్నికల్లో తెలుగుదేశంతో జతకట్టి అయిదో పెద్ద పార్టీగా నిలిచింది. తాజాగా సొంతంగా బరిలోకి దిగుతోంది. హిందూ ఓట్లను పోలరైజ్ చేయడం ద్వారా తనదైన ప్రభావాన్ని చూపాలనే లక్ష్యం పెట్టుకుంది. పీఠాధిపతి పరిపూర్ణానందను ప్రధాన ప్రచారకునిగా నియమించుకుంది. అధికార పార్టీ టీఆర్ఎస్ తో సన్నిహిత సంబంధాలు నెరపుతోందనే ప్రచారం ప్రజల్లోకి వెళ్లింది. దీంతో పార్టీ స్వతంత్రమైన ఓటు బ్యాంకును పటిష్ఠపరచుకోవడానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. క్యాడర్ లోనూ విశ్వాసం కలగడం లేదు. పైపెచ్చు ఒకవైపు ఫ్రండ్ కార్డు చూపుతూనే, కొందరు బీజేపీ నాయకులకు టీఆర్ఎస్ గాలం వేసి లాగేస్తోంది. ఆయా పరిస్థితుల దృష్ట్యా సమ్మోహక ప్రచారం నిర్వహిస్తే తప్ప కమలం వైపు కన్నెత్తి చూసే నాథుడు ఉండరని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. 40 మంది వరకూ స్టార్ క్యాంపెయినర్లను పార్టీ గుర్తించింది. వారిలో ఓట్లు తెచ్చిపెట్టగలవారు జాతీయస్థాయిలో మోడీ మాత్రమే. అమిత్ షా సమన్వయానికి మాత్రమే పనికివస్తారు. అందుకే అతివలపైనే ప్రధానంగా ఆధారపడాలని భావిస్తోంది.

చిన్నమ్మతో...

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో సుష్మా స్వరాజ్ పాత్ర చిరస్మరణీయం. అప్పటి ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీకి లోక్ సభ పక్షం నాయకురాలిగా ఉన్న సుష్మ రాష్ట్ర విభజన బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. నిబంధనల ఉల్లంఘన జరిగినప్పటికీ అధికార యూపీఏ ను నిలదీయకుండా ఏదోరకంగా రాష్ట్రం ఏర్పడితే చాలని తలచారు. ఫలితంగా యూపీఏకి సభలో సంపూర్ణ ఆధిక్యం లేకపోయినప్పటికీ విభజన బిల్లు నెగ్గింది. రాష్ట్ర ఏర్పాటులో తనది చిన్నమ్మ పాత్ర అంటూ తనను తాను అభివర్ణించుకున్నారామె. ఇప్పుడు ఆ పాత్రను గుర్తు చేస్తూ చిన్నమ్మను ప్రచారంలోకి దింపాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. కనీసం మూడు రోజులపాటు సుష్మ ప్రచారంలో పాల్గొనేలా ప్రణాళికను రూపొందిస్తున్నారు.

ఫైర్ బ్రాండ్...

స్మృతి ఇరాని పేరు చెబితే పక్కింటి పొరుగావిడ గుర్తుకు వస్తుంది. కట్టుబొట్టుతో సంప్రదాయంగా కనిపించినా గొంతు విప్పితే ప్రత్యర్థులపై నిప్పులు కురిపించే ఫైర్ బ్రాండ్. రాహుల్ గాంధీపైనే పోటీ చేసి చుక్కలు చూపించిన ధైర్యవంతురాలు. తెలంగాణకు , ఆమెకు కొంత మేరకు మానసిక అనుబంధం ఉంది. జైబోలో తెలంగాణ చిత్రంలో కీలక భూమిక పోషించారామె. ఉద్యమ సమయంలో వచ్చిన ఆ చిత్రంలో ఆమె ధీరోదాత్తతను ప్రేక్షకులు ఇంకా మరిచిపోలేదు. పైపెచ్చు టీవీ నటిగా కూడా చిరపరిచితమే. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా కేంద్రమంత్రి స్మ్రుతిని ప్రచార పర్వంలోకి దింపబోతున్నారు బీజేపీ నాయకులు. స్మ్రుతి ప్రచారం తో బీజేపీ కి మంచి ఊపు వస్తుందని క్యాడర్ విశ్వసిస్తోంది.

రక్షణ కవచం...

రక్షణ మంత్రి నిర్మల సీతారామన్ తెలుగింటి కోడలు. రెండు దశాబ్దాల పాటు హైదరాబాదు కేంద్రంగానే ఆమె పనిచేశారు. బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగింది కూడా ఇక్కడే. స్థానికంగా చర్చల్లో పాల్గొంటూ, క్రమేపీ జాతీయ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. 2014 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెకు వాణిజ్యశాఖమంత్రిగా పదవి లభించింది. సమర్థంగా బాధ్యతలు నిర్వహించడంతో పదోన్నతి దక్కింది. అత్యంత కీలకమైన పోర్టుఫోలియో లభించింది. రక్షణమంత్రిగా ఆమెను నియమించారు. ప్రధాని, హోం, ఆర్థిక, విదేశీ వ్యవహారాల శాఖల ముందు వరస ప్రాధాన్యత క్రమంలో ఉంటుంది రక్షణ శాఖ. కొత్త సచివాలయ నిర్మాణానికి రక్షణశాఖ భూములను కోరుతోంది రాష్ట్రప్రభుత్వం. ఈనేపథ్యంలో మంచి తెలుగు మాట్టాడే నిర్మలను బీజేపీ ప్రచారంలోకి దింపుతోంది.

ఆకర్ష..ఆకర్ష..

ఎన్నికల ప్రచారానికి సినిమా ఆకర్షణను మించిన తారకమంత్రం లేదు. బీజేపీ ముఖ్య నాయకురాలు, ఎంపీ హేమమాలినిని తెలంగాణ ఓటర్లపై ప్రయోగించబోతోంది బీజేపీ. ఒకనాటి డ్రీమ్ గర్ల్ హేమమాలిని అంటే తెలియని ప్రేక్షకులు ఉండరు. గ్లామర్ తో పాటు హిందీలో దంచి కొట్టగల సామర్థ్యమూ ఆమెకు ఉంది. ఈ షో లే హీరోయిన్ తో రోడ్డు షోలు, బహిరంగ సభలను హోరెత్తించాలని ప్లాన్ చేస్తున్నారు. హేమ తన ఆకర్షణతో ఎంతమేరకు ఓటర్లను మంత్రముగ్ధం చేస్తారో వేచి చూడాలి. అధికారికంగా నలభై మంది వరకూ స్టార్ క్యాంపెయినర్లు ఉన్నప్పటికీ ఈ నలుగురితోనే పార్టీకి ప్రచారం ఎక్కువగా లభిస్తుందని నాయకులు చెబుతున్నారు. వీరి సభలకు జనాన్ని తరలించడానికి పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదంటున్నారు.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News