బీజేపీకి ఇక టెన్షన్ లేనట్లే

భారతీయ జనతా పార్టీకి భవిష్యత్ లో బిల్లుల ఆమోదంలో పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ తన బలాన్ని పెంచుకుంది. సంఖ్యా పరంగా [more]

Update: 2020-06-23 17:30 GMT

భారతీయ జనతా పార్టీకి భవిష్యత్ లో బిల్లుల ఆమోదంలో పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ తన బలాన్ని పెంచుకుంది. సంఖ్యా పరంగా కాంగ్రెస్ కంటే రెండింతల బలాన్ని బీజేపీ పెంచుకుంది. దీంతో రాజ్యసభలో బిల్లుల ఆమోదానికి ఇప్పటి వరకూ టెన్షన్ పడుతున్న బీజేపీకి ఊరట లభించినట్లయింది. పార్లమెంటులో అనేక బిల్లుల విషయంలో బీజేపీకి అనేక సార్లు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

రాజ్యసభలో బలం లేక….

రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 245 వరకూ ఉంది. 2014కు ముందు వరకూ కాంగ్రెస్ ఉభయ సభల్లో బలంగా ఉంది. ఆ తర్వాత వరసగా రాష్ట్రాలను కాంగ్రెస్ కోల్పోతూ వస్తుండటంతో రాజ్యసభ ఎన్నికల్లో ఆ పార్టీకి చుక్కెదురవుతూ వస్తుంది. 2014 నుంచి కాంగ్రెస్ బలం క్రమంగా రాజ్యసభ లో తగ్గుతూ వస్తుంది. ప్రధానమైన బిల్లుల విషయంలో బీజేపీ అధికారంలో ఉన్నా ఇతర సభ్యులపైన ఆధారపడాల్సి వస్తుంది.

వరసగా రాష్ట్రాల్లో పాగా వేస్తూ….

వరసగా రాష్ట్రాలను గెలుచుకుంటూ వస్తుండటంతో బీజేపీకి రాజ్యసభలో క్రమంగా బలం పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం బీజేపీ తన మిత్రపక్షాలతో కలసి వంద మంది సభ్యుల బలం ఉంది. కాంగ్రెస్ కు కేవలం 41 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. ఇక బీజేపీకి బయట నుంచి మద్దతు ఇచ్చే సభ్యుల సంఖ్య కూడా పెరుగుతుండటం ఆ పార్టీకి ఊరటనిచ్చే అంశమే. ఇప్పటి వరకూ ఇద్దరు సభ్యులున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం ఆరుకు చేరింది.

మిత్ర పక్షాల బలం కూడా….

వైసీపీ బయట నుంచి బీజేపీకి ప్రతి అంశంలోనూ మద్దతిస్తూ వస్తుంది. అలాగే ఒడిశాకు చెందిన బిజూ జనతాదళ్ కు తొమ్మిది మంది సభ్యులున్నారు. బీజేడీ కూడా బీజేపీకి మద్దతిస్తూనే ఉంది. ఈరెండు మిత్రపక్షాలు కాకున్నా అంశాల వారీగా బీజేపీకి మద్దతిస్తున్నాయి. ఇటీవల జరిగిన 19 రాజ్యసభ స్థానాల్లో బీజేపీ సొంతంగా ఎనిమిది స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ నాలుగు స్థానాలను దక్కించుకుంది. దీంతో ఇక రాజ్యసభలో బీజేపీకి టెన్షన్ లేనట్లే. దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత బీజేపీకి రాజ్యసభలో బలం పెరిగినట్లయింది.

Tags:    

Similar News