అటు లేదు.. ఇటు లేదు… ఎటూ కాకుండానే?

ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ఎటూ కాకుండా పోతుంది. అసలే అంతంత మాత్రంగా ఉన్న బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాలు ఆ పార్టీకి వచ్చే ఎన్నికల్లో కూడా [more]

Update: 2020-03-05 11:00 GMT

ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ఎటూ కాకుండా పోతుంది. అసలే అంతంత మాత్రంగా ఉన్న బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాలు ఆ పార్టీకి వచ్చే ఎన్నికల్లో కూడా ఏ ప్రాంతంలోనూ బయటపడే పరిస్థితులు లేవు. ఈ పరిస్థితిని వారంతట వారే స్వయంగా కల్పించుకుంటున్నారు. రాజధానిని అమరావతిలోనే ఉంచాలంటూ నినాదం చేస్తున్న బీజేపీ కేవలం ప్రకటనకే పరిమితమయింది. పోనీ ఈ నినాదంతో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి లాంటి జిల్లాల్లోనైనా బలపడుతుందా? అని అనుకుంటే అదీ లేదు.

రాజధాని ప్రాంత రైతులే….

దీనికి కారణం రాజధాని రైతులే భారతీయ జనతా పార్టీని నమ్మడం లేదు. వాస్తవానికి బీజేపీపై రాజధాని అమరావతి ప్రాంత వాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రాజధాని తరలింపున బీజేపీ అడ్డుకుంటుందని భావించారు. బీజేపీ నేతల చుట్టూ తిరిగారు. కన్నా లక్ష్మీనారాయణ, సుజనా చౌదరి లాంటి నేతలు రాజధాని తరలింపును అడ్డుకుంటామని ప్రకటించారు. అయితే వీరు మైకు వద్ద తప్పించి చేస్తున్న ప్రయత్నాలు లేవు. కనీసం అమిత్ షా లాంటి వాళ్లను కలసి రాజధాని తరలింపు పై చర్చించలేదు.

ప్రకటనలకే పరిమితమవుతూ….

అలాగే జనసేన కలవడంతో బీజేపీ రాజధాని విషయంలో నిర్ణయం తీసుకుంటుందని ఆశపడ్డారు. కర్నూలు కు హైకోర్టును తరలించడాన్ని అంగీకరించిన బీజేపీ, రాజధాని తరలింపుపై మాత్రం అభ్యంతరం తెలిపింది. ప్రకటనలకు మించి బీజేపీ చేసిన కార్యాచరణ కూడా ఏమీ లేదు. బీజేపీ, జనసేనలు కలసి బెజవాడలో లాంగ్ మార్చ్ ను నిర్వహిస్తామని ఆర్భాటంగా ప్రకటించి వెనక్కు తగ్గాయి. దీనికి సిల్లీ కాజ్ ఒకటి చెప్పేశారు. ఢిల్లీ ఎన్నికల వల్లనే లాంగ్ మార్చ్ ను వాయిదా వేశామని చెప్పిన బీజేపీ ఆ తర్వాత దీని ఊసే ఎత్తడం లేదు.

అక్కడ అసలు నమ్మక….

దీంతో రాజధాని రైతులు ఇటీవల బీజేపీ నేతలను నిలదీశారు. జై అమరావతి అని కూడా అనేందుకు బీజేపీ నేతలు ఎందుకు జంకుతున్నారని రైతులు ప్రశ్నిస్తున్నారు. కేంద్రంలో అధికారం ఉన్నా కనీస ప్రయత్నాలు రాష్ట్ర నేతలు చేయడం లేదని రైతులు వాపోతున్నారు. ఇక రాజధాని తరలింపును అడ్డుకుంటామని ప్రకటించి ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతంలో ఎటూ బలం పెంచుకునే స్థితిలో లేదు. ప్రకటనలకే పరిమితమవ్వడంతో ఈ నాలుగు జిల్లాల్లోనూ జనం బీజేపీని నమ్మడం లేదు. మొత్తం మీద బీజేపీ ఎటూ కాకుండా పోతుందనే వ్యాఖ్యలు ఆ పార్టీ నుంచే విన్పిస్తుండటం విశేషం.

Tags:    

Similar News