దండయాత్ర

అదను చూసి శత్రువును దెబ్బతీయాలన్నది యుద్ధనీతి. దీనిని భారతీయ జనతా పార్టీ బాగానే ఒంటబట్టించుకున్నట్లు కనపడుతోంది. పదిహేడో లోక్ సభ ఎన్నికల్లో కమలం పార్టీ తిరుగులేని విజయం [more]

Update: 2019-07-18 17:30 GMT

అదను చూసి శత్రువును దెబ్బతీయాలన్నది యుద్ధనీతి. దీనిని భారతీయ జనతా పార్టీ బాగానే ఒంటబట్టించుకున్నట్లు కనపడుతోంది. పదిహేడో లోక్ సభ ఎన్నికల్లో కమలం పార్టీ తిరుగులేని విజయం సాధించింది. అదే సమయంలో విపక్షాలు కకావికలమయ్యాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా ఉంది. కనీసం లోక్ సభలో ప్రతిపక్షనేత హోదాను పొందలేని దుస్థితి. దీనికి తోడు అధ్యక్షుడు రాహుల్ గాంధీ నాయకత్వ బాధ్యతలనుంచి తప్పుకున్నారు. దీంతో పార్టీ శ్రేణులన్నీ నిర్వీర్యమయ్యాయి.

కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు….

హస్తం పార్టీని దెబ్బతీసేందుకు ఇదే సరైన అదను అని భావించిన భారతీయ జనతా పార్టీ పావులు కదిపింది. ఆ పార్టీ ప్రభుత్వాలను కబళించడం అసలు ధ్యేయం. ఇందులో భాగంగా దక్షిణాదిలో పెద్దరాష్ట్రమైన కర్ణాటకపై కమలం కన్నేసింది. అక్కడి కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ సంకీర్ణ సర్కార్ ను కూల్చివేసేందుకు వ్యూహం పన్నింది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 224 స్థానాలకు గాను 105 స్థానాలను గెలుచుకోవడం, గవర్నర్ వాజూబాయి వాలా తన మనిషి కావడం, అన్నింటికీ మించి కేంద్రంలో అధికారంలో ఉండటం దానికి కలసి వచ్చాయి. వ్యూహంలో భాగంగా కాంగ్రెస్ అసంతృప్తి ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించింది. ఏదో ఒకరకంగా కుమారస్వామి సర్కార్ ను కూలగొట్టడం, యడ్యూరప్పను గద్దెపై కూర్చోబెట్టడం లక్ష్యంగా పనిచేస్తోంది.

గోవాలో అనైతికంగా…..

ఇక పశ్చిమాన చిన్న రాష్ట్రమైన గోవాలో గత ఏడాది అనైతిక పద్ధతుల్లో అధికారాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. నాటి అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం 40 స్థానాలకు గాను కేవలం 13 స్థానాల సాధించినప్పటికీ అనైతిక పద్ధతుల్లో అధికారాన్ని కైవసం చేసుకుంది. 16 స్థానాలను సాధించిన కాంగ్రెస్ ను కాదని మిత్రులు, స్వతంత్రుల మద్దతుతో ముఖ్యమంత్రి పీఠాన్ని పొందింది. తాజాగా కాంగ్రెస్ శాసనసభ పక్షంలో చీలిక తెచ్చి వారిని తమ పార్టీలో విలీనం చేసుకుంది. దీంతో పార్టీ బలం 27కు పెరిగింది. పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేల్లో ముగ్గురికి మంత్రివర్గంలో స్థానం కల్పించింది. ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ పేరుకే ముఖ్యమంత్రి. కానీ ఈ ఫిరాయింపుల వ్యవహారాలన్నింటినీ ఢిల్లీ పెద్దలు వెనకుండి నడిపించారు.

మధ్యప్రదేశ్ మాదేనని….

గత ఏడాది జరిగిన అసెంబ్లీ గెలిచిన రాజస్థాన్, మధ్యప్రదేశ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చివేసేందుకు కమలం వ్యూహరచన చేస్తోంది. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ ఓడినప్పటికీ, ఎక్కువ స్థానాలను సాధించింది. 230 స్థానాలు గల మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ 114 స్థానాలు సాధించి బీఎస్పీ, స్వతంత్రుల మద్దతుతో ప్రభుత్వాన్ని నడుపుతోంది. 109 స్థానాలను సాధించిన కమలం అప్పట్లో స్వచ్చందంగా అధికారానికి దూరంగా ఉంది. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో కమలం పార్టీ జైత్రయాత్ర కొనసాగడం, కాంగ్రెస్ లో లుకలుకలు, మిత్రపక్షాలతో హస్తం పార్టీకి పొసగక పోవడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో కమల్ నాధ్ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు పావులు కదుపుతోంది. ఇవాళ కాకుంటే ఇంకొన్ని రోజుల్లో అయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి ముప్పు తప్పుదు.

రాజస్థాన్ లోనూ…..

ఇక పశ్చిమ రాష్ట్రమైన రాజస్థాన్ లో తమ జెండా రెపరెపలాడాలన్నది భారతీయ జనతా పార్టీ వ్యూహం. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 200 స్థానాలకు హస్తం పార్టీ 99, బీజేపీ 73 సీట్లు సాధించాయి. స్వతంత్రుల మద్దతుతో అశోక్ గెహ్లాట్ నేతృత్వంలో ని కాంగ్రెస్ సర్కార్ ను కూల్చివేసేందుకు కమలం పార్టీ ప్రణాళిక రచిస్తోంది. కాంగ్రెస్ అసంతృప్త ఎమ్మెల్యేలను ఆకట్టుకోవడం, స్వతంత్రుల మద్దతుతో రాజస్థాన్ పీఠాన్ని కైవసం చేసుకోవవాలన్నది కమలనాధుల వ్యూహం. కేంద్రంలో అధికారంలో ఉండటం, గవర్నర్ కల్యాణ్ సింగ్ తమ పార్టీ మనిషి కావడంతో ఈ కార్యక్రమాన్ని త్వరలో పూర్తి చేయగలమన్న ధీమాలో కమలనాధులున్నారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News