పీవీ చేసిన పాపం ఏంటి…?

కాంగ్రెస్ దిగ్గజం, మాజీ రాష్ట్ర పతి ప్రణబ్ ముఖర్జీ, ప్రముఖ అస్సామీ గాయకుడు దివంగత భూపేన్ హజారికా, సంఘసేవలో చరితార్ధుడైన నానాజీ దేశ్ ముఖ్ లను ఇటీవల [more]

Update: 2019-02-14 17:30 GMT

కాంగ్రెస్ దిగ్గజం, మాజీ రాష్ట్ర పతి ప్రణబ్ ముఖర్జీ, ప్రముఖ అస్సామీ గాయకుడు దివంగత భూపేన్ హజారికా, సంఘసేవలో చరితార్ధుడైన నానాజీ దేశ్ ముఖ్ లను ఇటీవల కేంద్ర ప్రభుత్వం భారతరత్నలను ప్రకటించింది. ఇది దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారం. వీటిని మించి మరో అత్యున్నత అవార్డు లేదు. తమ రంగాల్లో నిష్ణాతులైన ప్రణబ్, హజారికా, దేశ్ ముఖ్ లకు భారతరత్న ఇవ్వడంపై ఎటువంటి అభ్యంతరాలు లేవు. విమర్శలు విన్పించలేదు. అధికార, ప్రతిపక్షాలు సహా అందరూ స్వాగతించారు. కానీ అంతర్గతంగా కొన్ని అభిప్రాయాలు ఉన్నప్పటికీ బహిరంగంగా కాదనే సాహసం ఎవరూ,ఏ పార్టీ సయితం చేయలేకపోయాయి. అన్ని పార్టీలూ పరిణితితో వ్యవహరించాయి. అవార్డు గ్రహీత సేవలు, చిత్తశుద్ధి, నిజాయితీలను ఎవరూ ప్రశ్నించలేరనడంలో సందేహం లేదు.

బెంగాల్ లో పట్టుకు….

అయితే కేంద్రప్రభుత్వమే అవార్గుల ప్రకటన వెనక రాజకీయం చేసిందన్న వాదన వినపడుతోంది. ఇది పసలేని వాదన కాదు. దీనిని తోసిపుచ్చడం అంత తేలిక కాదు. తరచి చూస్తే ప్రభుత్వం రాజకీయ లబ్దితోనే వ్యవహరించినట్లు కనపడుతోంది. ఉదాహరణకు ప్రణబ్ ముఖర్జీనే తీసుకుంటే ఈ విషయం ప్రస్ఫుటంగా బోధపడుతుంది. ప్రణబ్ ప్రస్థానమంతా హస్తం పార్టీలోనే సాగింది. మధ్యలో ఒకసారి 90వ దశకంలో పార్టీనుంచి బయటకు వచ్చి కొద్దికాలనే మళ్లీ స్వగృహ ప్రవేశం చేశారు. రేపటి లోక్ సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ లో రాజకీయంగా లబ్ది పొందేందుకే ఆయనకు భారత రత్న ఇచ్చి గౌరవించారన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. బెంగాల్ లో రాజకీయంగా కాంగ్రెస్, సీపీఎం క్రమంగా కనుమరుగవుతున్నాయి. ఈ నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ కు గట్టి ప్రత్యర్థిగా ఎదగాలన్నదే కమలనాధుల ఆలోచన. రేపటి లోక్ సభ ఎన్నికలలో బెంగాల్ లో కమలం పార్టీ 12 స్థానాలను గెలుచుకుంటుందన్న సర్వేల నేపథ్యంలో ప్రణబ్ కు అవార్డు ఇవ్వడం మేలు చేస్తుందన్నది బీజేపీ ఆలోచన. సొంత నాయకుడిని కాంగ్రెస్ గుర్తించనప్పటికీ, తాము గుర్తించామని ప్రచారం చేసుకోవడానికి ఇది ఉపయోగ పడుతుంది. రెండుసార్లు (1984, 2004) ప్రధాని అయ్యే అవకాశం వచ్చినప్పటికీ పార్టీ సుముఖంగా లేకపోవడంతో నిరాశ చెందిన ప్రణబ్ ను అత్యున్నత పురస్కారంతో గౌరవించడం ఓట్ల పరంగా లబ్ది కలిగిస్తుందన్నది కమలనాధుల దూరాలోచన. బెంగాలీలకు సెంటిమెంట్ ఎక్కువ. మేధోసంపత్తి తమసొత్తు అని వారు భావిస్తుంటారు. తమ ‘‘బెంగాలీ బాబు’’ ను గుర్తించడం సగటు బెంగాలీని సంతోష పర్చింది. ఇది ఎంతో కొంత మేలు చేయకపోదన్నది బీజేపీ ఆశ.

ఆందోళనల కట్టడికే….

ఇక భూపేశ్ హాజారికా పరిస్థితి కొంచెం అటు ఇటుగా అంతే. ప్రభుత్వం తీసుకురానున్న పౌరసత్వ సవరణ బిల్లుతో ఈశాన్య భారతం ప్రస్తుతం అట్టుడికి పోతోంది. ఈ బిల్లును ఆ ప్రాంత ప్రజలు తిరస్కరిస్తున్నారు. నిరసనలు, ఆందోళనలతో ఈశాన్య ప్రాంతం దద్దరిల్లుతోంది. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించేందుకు ఈ బిల్లు అవకాశం కల్పిస్తోంది. దీనివల్ల తమ అస్తిత్వం దెబ్బతింటోందన్నది ఈ ప్రాంత ప్రజల భావన. ముఖ్యంగా అస్సోం ప్రజలు బిల్లుకు ససేమిరా అంటున్నారు. ఈ నేపథ్యంలో అస్సోంకు చెందిన భూపేన్ హాజారికాకు భారతరత్న ఇవ్వడం ద్వారా అక్కడి ప్రజల ఆందోళనకు అడ్డుకట్ట వేయవచ్చన్నది కమలనాధుల వ్యూహం. హజారికా ప్రముఖ గాయకుడైనప్పటికీ బీజేపీ నాయకుడు. 2004 లోక్ సభ ఎన్నికల్లో గుహవటి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి 3,53,250 ఓట్లు రాగా, హజారికాకు 2,92,099 ఓట్లు లభించాయి. ఈ వాస్తవాలు తెలిసిన వారు ప్రభుత్వం నిర్ణయంలోని రాజకీయాన్ని తెలిగ్గా పసిగట్టగలరు.

ఆర్ఎస్ఎస్ ను తృప్తి పర్చడానికే…..

నానాజీ దేశ్ ముఖ్ పరిస్థితి అంతే. మధ్యప్రదేశ్ కు చెందిన నానాజీ మొదట్లో రాజకీయ నాయకుడు. జనసంఘ్ లో చురుగ్గా పనిచేశారు. 1977లో జనతా పార్టీ ఆవిర్భావంలో ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అనంతర కాలంలో సంఘసేవపై దృష్టి సారించారు. జీవిత చరమాంకం వరకూ గిరిజనులు, వెనకబడిన , బలహీన వర్గాల సేవలోతరించారు. ఇటీవల కాలంలో ఆగ్రహంగా ఉన్న ఆర్ఎస్ఎస్ ను సంతృప్తి పర్చడానికి మోదీ ప్రభుత్వం నానాజీ దేశ్ ముఖ్ కు భారతరత్న ఇచ్చిందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. ఇక తెలుగువాడైన పాముల పర్తి వెంకట నరసింహారావును గుర్తించడంలో కేంద్రం ఉదాసీనంగా వ్యవహరించిందన్న విమర్శ లేకపోలేదు. రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా,కేంద్రమంత్రిగా, ఏఐసీసీ అధ్యక్షుడిగా, ప్రధానమంత్రిగా సేవలు అందించిన పీవీని గౌరవిస్తే బీజేపీ ప్రభుత్వ ప్రతిష్ట మరింత పెరిగేది. కష్టకాలంలో ఉన్న దేశానికి ధీటైన నాయకత్వం అందించి గాడిలో పెట్టిన నేతను విస్మరించడంలో ఔచిత్యం లేదు. సేవలు, సమర్థత ప్రాతిపదికన కాకుండా, రాజకీయ కోణంలో అవార్డులు ఇస్తే వాటి ప్రతిష్ట మసకబారుతుంది.

 

 

– ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News