పొడిచేది పెద్దగా లేదట్లుందే

ఏపీలో భారతీయ జనతా పార్టీ పాగా వేయడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఏపీలో రాజకీయ, సామాజిక పరిస్థితులు వేరుగా ఉంటాయి. అప్పట్లో కాంగ్రెస్ కి ముస్లిం [more]

Update: 2019-07-10 00:30 GMT

ఏపీలో భారతీయ జనతా పార్టీ పాగా వేయడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఏపీలో రాజకీయ, సామాజిక పరిస్థితులు వేరుగా ఉంటాయి. అప్పట్లో కాంగ్రెస్ కి ముస్లిం మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు వెన్నుదన్నుగా ఉండేవి. అలాగే అగ్ర కులాలు కూడా ఆ పార్టీకు వత్తాసుగా ఉండేవి. అయితే విభజన తరువాత కాంగ్రెస్ కి ఏపీలో మొత్తం రాజకీయమే తారుమారు అయింది. జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొత్తం కాంగ్రెస్ ఓటు బ్యాంక్ కొల్లగొట్టింది. ఇక టీడీపీ బీసీలు, అగ్ర వర్ణాలు ఇలా ఓ పటిష్టమైన ఓటు బ్యాంక్ తో సై అంటోంది. ఇలా కచ్చితమైన ఓటు బ్యాంక్ ఉన్న పార్టీల మధ్య అధికార మార్పిడికి కాపులు డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉంటున్నారు.

ఆది నుంచి ఇదే కధ….

ఇదిలా ఉండగా కేంద్రంలో అధికారం వచ్చిన ప్రతీసారి భారతీయ జనతా పార్టీ ఏపీలో చేసే హడావుడి అంతా ఇంతా కాదు. అక్కడ వచ్చాం, ఇక్కడా వచ్చేస్తామని నానా హంగామా చేయడం, ఓ అరునెలల తరువాత ఆ పాల పొంగు చల్లారిపోవడం తెలిసిన కధే. వాజ్ పేయ్ హయాం నుంచి ఇదే తీరు. ఇక 2014లో మొదటి సారి మోడీ అధికారంలోకి వచ్చినపుడు కూడా బీజేపీ ఇలాగే చేసింది. అప్పట్లో బీజేపీ వాపుని బలంగా భావించి కొంతమంది పెద్ద నేతలే చేరారు. వారిలో మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు వంటి వారు ఇప్పటికీ ఏమీ కాకుండా ఉన్నారు. ఇక విశాఖ లాంటి జిల్లాల్లో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, మాజీ ఎంపీ సబ్బం హరి లాంటి వారు బీజేపీలోకి వెళ్దామని ఆనాడు గట్టిగానే ఊగారు, కానీ చివరకి ఏపీలో బీజేపీ ఎదగదు అని తీర్మానించుకుని మరీ ఆగిపోయారు.

అదే హడావుడి…..

ఇపుడు కూడా బీజేపీ నాయకులు అచ్చంగా అదే విధంగా హడావుడి చేస్తున్నారు. ఏపీలో అధికారం మాదే, దున్నేస్తాం, టీడీపీ పని అయిపోయింది, ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలు అంటూ దీర్ఘాలు తీస్తున్నారు. అయితే ఇక్కడో విషయం ఉంది. ఏపీలో బీజేపీకి క్షేత్ర స్థాయిలో బలం లేదు. పైగా ఆ పార్టీ విధానాలు జనాలకు అర్ధం కావు. ఏపీలో బీజేపీ కి ఇమేజ్ ఉన్న నాయకులు లేరు. ఉన్నా కూడా వారు ఆ పార్టీ బరువుని మోయలేరు. ఇక ఏపీలో వైసీపీ వైపు ఉన్న వర్గాలు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ వైపు మళ్ళే అవకాశం లేదు. ఇక బీసీలు బీజేపీకి దూరంగానే ఉంటారు. అగ్ర వర్ణాల్లో కమ్మ వారు ఇపుడు రాజకీయంగా కొంత డోలాయమానంగా ఉన్నారు. ఇక బ్రాహ్మణులు, వైశ్యులలో కొంత బీజేపీ వైపు మళ్ళినా గుణాత్మకమైన మార్పు వచ్చే అవకాశాలు లేవు. చిత్రమేంటంటే ఏపీలో కులపరంగా రాజకీయం ఉంది. బీజేపీ జాతీయ వాదం ఇక్కడ దిగదుడుపు అవుతోంది. హిందుత్వ కార్డ్ తీయాలనుకున్న ఇక్కడ మత ఘర్షణలు లేని ప్రశాంతమైన వాతావరణం ఉంది. మొత్తంగా చూస్తే బీజేపీకి ఉడుత వూపులే తప్ప ఆ పార్టీ ఏపీలో ఎదిగేటంత సీన్ మాత్రం లేదని రాజకీయం బాగా ఎరిగిన వారు తేల్చేస్తున్నారు.

Tags:    

Similar News