పీజేఆర్ ను మరచిపోయినట్లేనా?

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలంటే ముందుగా గుర్తుకొచ్చేది పి. జనార్థన్ రెడ్డి. కాంగ్రెస్ నేతగా పీజేఆర్ హైదరాబాద్ లో కీలక నేతగా ఎదిగారు. ఆయన మరణించి దాదాపు పదమూడేళ్లు [more]

Update: 2020-11-25 11:00 GMT

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలంటే ముందుగా గుర్తుకొచ్చేది పి. జనార్థన్ రెడ్డి. కాంగ్రెస్ నేతగా పీజేఆర్ హైదరాబాద్ లో కీలక నేతగా ఎదిగారు. ఆయన మరణించి దాదాపు పదమూడేళ్లు గడుస్తున్నా ఎప్పుడు హైదరాబాద్ ఎన్నికలు జరిగినా ప్రజలు ఆయననే గుర్తు చేసుకుంటారు. పీజేఆర్ వారసులు మాత్రం ఎందుకూ పనికి రాకుండా పోయారు. రాజకీయంగా పీజేఆర్ వారసులు ఎదగకపోవడానికి స్వయంకృతాపరాధమే కారణం.

బంగారు బాట వేసినా….

పీజేఆర్ రాజకీయంగా తన వారసులకు బంగారు బాటను వేశారు. బలమైన కార్మిక నేతగా, పేద వర్గాల ప్రతినిధిగా ఆయన ప్రజల మన్ననలను పొందారు. 2007 డిసెంబరులో పీజేఆర్ గుండెపోటుతో మరణించారు. పీజేఆర్ ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు వరసగా గెలిచారు. ఖైరతా బాద్ నియోజకవర్గం అంటేనే పీజేఆర్ కు కంచుకోటగా ఉండేది. పీజేఆర్ మరణంతో 2008లో జరిగిన ఉప ఎన్నికలలో పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి గెలుపొందారు.

యాక్టివ్ గా లేక….

తర్వాత 2009 లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఖైరతాబాద్ నియోజకవర్గం అనేక నియోజకవర్గాలుగా విడిపోయింది. దీంతో విష్ణువర్ధన్ రెడ్డి జూబ్లీ హిల్స్ నుంచి 2009లో పోటీ చేసి విజయం సాధించారు. అదే ఆయనకు ఆఖరి గెలుపు. అప్పటి నుంచి విష్ణువర్ధన్ రెడ్డి యాక్టివ్ గా లేరు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లోనూ పెద్దగా పాల్గొనడం లేదు. తండ్రి పీజేఆర్ రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకోవడంలో విష్ణువర్ధన్ రెడ్డి విఫలమయ్యారనే చెప్పాలి.

విజయారెడ్డికి అవకాశం దక్కేనా?

ఇక పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి కార్పొరేటర్ గా విజయం సాధించారు. ఆమె టీఆర్ఎస్ లో చేరారు. ప్రస్తుతం జరుగుతున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తిరిగి కార్పొరేటర్ గా పోటీ చేసి మేయర్ పదవిని ఆశిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు కావడంతో పీజేఆర్ ను మరోసారి ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. కానీ పీజేఆర్ వారసులు మాత్రం రాజకీయంగా ఎదగలేకపోతున్నారు. దీనిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Tags:    

Similar News