జగన్ మనసు మారిందా…. అయితే ఇక అంతేనా?

విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ నిక్షేపాలు దండీగా ఉన్నాయి. వాటి మీద పెట్టుబడిదారుల కన్ను పడి రెండు దశాబ్దాల కాలం అయింది. ఉమ్మడి ఏపీకి చంద్రబాబు సీఎంగా ఉన్నపుడే [more]

Update: 2020-12-25 03:30 GMT

విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ నిక్షేపాలు దండీగా ఉన్నాయి. వాటి మీద పెట్టుబడిదారుల కన్ను పడి రెండు దశాబ్దాల కాలం అయింది. ఉమ్మడి ఏపీకి చంద్రబాబు సీఎంగా ఉన్నపుడే బాక్సైట్ తవ్వకాలకు అనుమతులు ఇచ్చారు. ఆ తరువాత పెద్ద ఎత్తున నిరసనలు రావడంతో అది మానుకున్నారు. ఇక వైఎస్సార్ సీఎం అయ్యాక ఏకంగా ఆన్‌ రాక్‌ ప్రాజెక్టు పేరిట ఒక కంపెనీ ఏజెన్సీ ముఖద్వారంలో ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదిరింది. దానికి అవసరమైన బాక్సైట్ గనుల సరఫరాకు ఏజెన్సీ నుంచే తవ్వకాలు జరపాలని కూడా నాడు అనుమతులు ఇచ్చారని అంటారు. దాని మీద నాటి విపక్షం టీడీపీ ఆందోళన చేయడంతో అది నిలిచిపోయింది.

బాబు వచ్చినా అంతే….

ఇక చంద్రబాబు విభజన ఏపీకి సీఎం గా వచ్చాక మరోమారు బాక్సైట్ తవ్వకాల మీద కదలిక వచ్చింది. బాబు సర్కార్ ఏకంగా 97 జీవోను విడుదల చేసింది. తవ్వకాలకు అనుమతులు ఇచ్చింది. అయితే దీని మీద మళ్ళీ గిరిజనం ఉద్యమించడంతో దాన్ని అబియన్స్ లో పెట్టారు. ఆనాడు విపక్ష నేతగా ఉన్న జగన్ బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా పాడేరులో అతి పెద్ద సభ పెట్టి మరీ చంద్రబాబుని హెచ్చరించారు. బాక్సైట్ తవ్వకాలు జరిపితే చూస్తూ ఊరుకోమని కూడా స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వస్తే జీవో 97ను రద్దు చేస్తామని చెప్పారు.

అనుమానాలు మొదలు….

జగన్ అధికారంలోకి వచ్చిన తొలి నాళ్ళలోనే బాక్సైట్ జీవో 97ను రద్దు చేశారు. అయితే ఈ మధ్యన మళ్ళీ బాక్సైట్ తవ్వకాల మీద వైసీపీ సర్కార్ ఆలోచనలు మారుతున్నాయని అనుమానాలు వస్తున్నాయి. దానికి కారణం ఏంటి అంటే గతంలో వైఎస్సార్ హయాంలో ప్రాజెక్ట్ ఏర్పాటు చేసిన ఆన్‌ రాక్‌ ప్రాజెక్టుకు జగన్ సర్కార్ పచ్చ జెండా ఊపడమే. ఆన్‌ రాక్‌ ప్రాజెక్టుకు కావాల్సిన బాక్సైట్ గనుల సరఫరాకు సంబంధించి పరిశీలన చేయడానికి ఆరుగురు ఉన్నతాధికారులతో జగన్ సర్కార్ తాజాగా ఒక కమిటీని నియమించింది. ఇపుడు దాని మీద గిరిజనం అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. ఆన్‌ రాక్‌ ప్రాజెక్టుకు అవసరమైన బాక్సైట్ గనులు ఎక్కడ నుంచి సరఫరా చేస్తారో ప్రభుత్వం స్పష్టంగా చెపాలంటూ గిరిజన సంఘాలు, వామ‌పక్షాలు మళ్ళీ ఉద్యమ‌బాట పడుతున్నాయి.

రాజకీయంగా దెబ్బే ….

జగన్ సర్కార్ కనుక బాక్సైట్ తవ్వకాల విషయంలో మడమ తిప్పితే ఏజెన్సీలో అగ్గి రాజుకోవడం ఖాయం. ఇప్పటికి రెండు ఎన్నికల్లో వైసీపీకి బంపర్ మెజారిటీ అందించిన విశాఖ ఏజెన్సీ ప్రాంతాలు ఒక్క సారిగా రివర్స్ అయినా అవుతాయి. మరో వైపు బాక్సైట్ గనుల విషయంలోనే టీడీపీకి మావోయిస్టులకు కూడా తీవ్ర విభేదాలు రావడం, ఆ పార్టీకి చెందిన వారిని పొట్టన పెట్టుకోవడం జరిగాయి. ఇపుడు వైసీపీ కూడా అలా మావోలకు టార్గెట్ అయినా ఆశ్చర్యం లేదు. అన్నిటికీ మించి విశాఖ ఏజెన్సీలో తిరుగులేని రాజకీయ ఆధిపత్యం చలాయిస్తున్న వైసీపీ హవాకు కూడా గండి పడుతుంది. కానీ తన తండ్రి హయాంలో విశాఖ ఏజెన్సీలో ఆన్‌ రాక్‌ ప్రాజెక్టు కు అనుమతించారు. పైగా బలమైన ఆ పెట్టుబడిదారి వర్గాలు ఇపుడు మళ్ళీ జగన్ సర్కార్ ని లాబీయింగ్ చేస్తున్నారని ప్రచారం అయితే సాగుతోంది. దానికి కనుక వైసీపీ సర్కార్ తల ఒగ్గితే చిక్కుకు తప్పవని చెబుతున్నారు. రాజకీయంగా ఆలోచిస్తే మాత్రం జగన్ బాక్సైట్ గనుల తవ్వకాల విషయంలో అనుమతులు ఇవ్వవద్దు అన్న మాటకే కట్టుబడి ఉండడమే అన్ని రకాలుగా మేలు అంటున్నారు.

Tags:    

Similar News