కాంగ్రెస్ లో పెరిగిన ఆశలు..బీజేపీకి గడ్డు రోజులేనా?

కర్ణాటక రాజకీయాలు మరోెసారి హాట్ టాపిక్ గా మారాయి. 2023లో కర్ణాటక శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్, బీజేపీలు ఇప్పటి నుంచే [more]

Update: 2021-07-28 16:30 GMT

కర్ణాటక రాజకీయాలు మరోెసారి హాట్ టాపిక్ గా మారాయి. 2023లో కర్ణాటక శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్, బీజేపీలు ఇప్పటి నుంచే పోటీ పడుతున్నాయి. అయితే తాజాగా యడ్యూరప్పను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించి బసవరాజు బొమ్మైను సీఎం పీఠం మీద కూర్చోబెట్టడం కాంగ్రెస్ కు కలసి వచ్చిందనే చెప్పాలి. యడ్యూరప్పకు ఉన్న ఇమేజ్ బసవరాజు బొమ్మైకు లేదు.

ఎంపికపై భిన్నాభిప్రాయాలు…

బసవరాజు బొమ్మై మాజీ ముఖ్యమంత్రి ఎస్ఆర్ బొమ్మై కుమారుడు. 2008 లో జనతాదళ్ నుంచి బీజేపీలో బొమ్మై చేరారు. రెండుసార్లు ఎమ్మెల్సీ, మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా ఆయన ప్రజలతో ఉన్న సంబంధాలు అంతంత మాత్రమే. అయితే ఈయనకు ఉన్న ఒకే ఒక్క ప్లస్ పాయింట్ లింగాయత్ సామాజికవర్గం కావడమే. అయితే లింగాయత్ సామాజికవర్గంలోనూ ఈయన ఎంపికపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

ఆ సామాజికవర్గంలోనూ….

యడ్యూరప్ప బీజేపీ నాయకుడిగా ఉన్నప్పుడు లింగాయత్ సామాజికవర్గం ఏకపక్షంగా కమలం పార్టీకి మద్దతు ఇస్తూ వస్తుంది. అది వ్యక్తిగతంగా యడ్యూరప్పను చూసే. మఠాధిపతులందరూ యడ్యూరప్ప మార్పును వ్యతిరేకించారు. అయితే ఈ మార్పు కాంగ్రెస్ కు లాభిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. లింగాయత్ లు ఈసారి బీజేపీకి దూరం జరుగుతారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఎవర అవునన్నా, కాదన్నా కాంగ్రెస్ కర్ణాటకలో బలంగా ఉంది.

జేడీఎస్ సయితం…

ఇప్పుడు డీకే శివకుమార్, సిద్ధరామయ్యలు కలసి సమన్వయంతో పనిచేస్తే కాంగ్రెస్ కు కర్ణాటకలో మంచిరోజులు వచ్చే అవకాశముంది. యడ్యూరప్ప నాయకత్వం నుంచి పక్కకు తప్పుకోవడంతో జనతా దళ్ ఎస్ కూడా బీజేపీ వైపు చూడదంటున్నారు. మళ్లీ హంగ్ అసెంబ్లీ ఏర్పడినా కాంగ్రెస్ వైపే జేడీఎస్ మొగ్గు చూపే అవకాశాలున్నాయి. ఎటు చూసుకున్నా బసవరాజు బొమ్మై ఎంపిక కాంగ్రెస్ ను వచ్చే ఎన్నికల్లో గట్టున పడేస్తుందన్న విశ్లేషణలు విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News