పసికూన కసి చూశారా … ??

ప్రపంచ క్రికెట్ లో పసికూన ఆ జట్టు అని భావించే వారు. అది గతం . ఇప్పుడు ఆ టీం తో తలపడాలంటేనే వణుకు పుట్టేలా ఎదిగింది [more]

Update: 2019-06-03 02:30 GMT

ప్రపంచ క్రికెట్ లో పసికూన ఆ జట్టు అని భావించే వారు. అది గతం . ఇప్పుడు ఆ టీం తో తలపడాలంటేనే వణుకు పుట్టేలా ఎదిగింది బంగ్లాదేశ్ . బంగ్లాదేశ్ ఇప్పుడు ప్రపంచకప్ క్రికెట్ లో మార్మోగుతున్న సంచలన జట్టు. తమదైన రోజు హీరో లను సైతం జీరోలు గా మార్చే సత్తా బంగ్లాదేశ్ కి ఎప్పుడూ సొంతమే. ఈసారి ప్రపంచకప్ లోకి అడుగు పెడుతూనే ప్రస్తుత ప్రపంచకప్ ఫేవరెట్ టీం లలో ఒకటైన సౌత్ ఆఫ్రికాను మట్టికరిపించి మిగిలిన టీమ్స్ కి హెచ్చరికలు పంపింది. అండర్ డాగ్స్ అని తమను అంచనా వేస్తే అంతే సంగతులని చాటి చెప్పింది.

అంత ఈజీ కాదు …

బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో రాటుదేలిన బంగ్లా ను ఎదుర్కోవడం ఇప్పుడు ప్రతీ టీం కి కత్తి మీద సామే అని గుర్తుంచుకునేలా ఎదిగింది. 2015 లో క్వార్ట్రర్ ఫైనల్స్ వరకు నడిచిన బంగ్లా దేశ్ పోయిన చోటే వెతుక్కునేందుకు వేట మొదలు పెట్టడంతో ఈసారి ప్రపంచ కప్ సాధించాలని కలలు కంటున్న జట్లకు సవాల్ గానే మారుతుందని తేలిపోయింది. వచ్చే మ్యాచ్ లలో బంగ్లా ఇదే ఆటతీరు కనబరిస్తే మాత్రం టోర్నీ హాట్ ఫేవరెట్స్ లో ఒకటిగా మారిపోనుంది.ఇంగ్లాండ్ పిచ్ లపై తొలుత బ్యాటింగ్ చేసి మ్యాచ్ ని కాపాడుకోవడం అంత ఆషామాషీ కాదు అందుకే టాస్ గెలిచిన టీం ముందు ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగించి పిచ్ లో వున్న తేమను, స్వింగ్ ను తమ బౌలర్లకు అనుకూలంగా మార్చుకుని ప్రత్యర్థిని ఖంగు తినిపిస్తుంది. మొన్న జరిగిన పాక్ – విండీస్, ఇంగ్లాండ్ – సౌత్ ఆఫ్రికా మ్యాచ్ లలో ఇదే జరిగింది.

గెలవడమే టార్గెట్ …

అయితే పట్టుదలతో పోరాడితే ప్రత్యర్థి ఎవరైనా టాస్ గెలిచినా ఓడినా విజయతీరానికి చేరుతామని బంగ్లా చెప్పకనే చెప్పింది. తొలుత బ్యాటింగ్ చేసి 330 పరుగుల భారీ స్కోర్ చేయడమే కాదు ప్రత్యర్థిని తమ బౌలింగ్ ఫీల్డింగ్ తో కట్టడి చేసి పరాజయం పాలు చేయడం బంగ్లా వంటి చిన్న టీం లకు సాధ్యం కాని పనే. అయితే తమ అంకితభావంతో టీం మొత్తం చెమటోడ్చి ఈ టోర్నీ లో శుభారంభం చేయడం క్రికెట్ అభిమానులను ఆశ్చర్య పడేలా చేసింది. ఒకప్పుడు బంగ్లా తో మ్యాచ్ అంటే ఏముందిలే అనే క్రికెట్ ఫ్యాన్స్ కి మా తడాఖా ఇప్పుడు చూడండి అంటూ న్యూ ఎంట్రీ ఇచ్చిన బంగ్లా అంటే ఇప్పుడు ప్రత్యర్థులకు భయం పుట్టేలా చేయడం వెనుక ఆ టీం అకుంఠిత దీక్ష, ప్రపంచ కప్ గెలిచి తీరాలన్న కసి, పట్టుదల కనిపిస్తున్నాయి మరి.

Tags:    

Similar News