అన్నదమ్ముల సవాల్...!

Update: 2018-05-02 17:30 GMT

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సారెకొప్ప బంగారప్పకు ఆయన సొంత నియోజకవర్గం సొరబకు అవినాభావ సంబంధం ఉంది. ఇది బంగారప్పకుటుంబానికి కంచుకోట వంటిది. నియోజకవర్గం ఆవిర్భావం నుంచి ఇక్కడ ఒక్కసారి మినహా మిగిలిన అన్ని సార్లూ బంగారప్ప కుటుంబమే గెలుస్తూ వస్తోంది. 1967, 1972, 1978, 1983, 1985, 1994 లో బంగారప్ప ఇక్కడి నుంచే అసెంబ్లీకి వెళ్లారు. కాంగ్రెస్ అభ్యర్థిగా, సొంత పార్టీ కర్ణాటక క్రాంతి విరంగ... ఇలా ఏ పార్టీ నుంచి పోటీచేసినా ఆయనను విజయలక్ష్మి వరిస్తూ వచ్చింది. ఆయన తదనంతరం కూడా ఆయన కుమారుల్లో ఎవరో ఒకరు విజయం సాధిస్తున్నారు. 1996 ఉప ఎన్నిక, 1999, 2004 ఎన్నికల్లో బంగారప్ప కుమారుడు కుమార బంగారప్ప ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఒక్క 2008 ఎన్నికల్లో మాత్రమే బంగారప్ప కుటుంబం ఓడిపోయింది. నాటి ఎన్నికల్లో బీఎస్ యడ్యూరప్ప సారథ్యంలోని కర్ణాటక జనతా పార్టీ అభ్యర్థి హెచ్. హోలప్ప విజయం సాధించారు. 2013లో జనతాదళ్ (ఎస్) అభ్యర్థిగా పోటీ చేసిన మధు బంగారప్ప గెలుపొందారు. ఈ విధంగా సొరబ స్థానం బంగారప్ప కుటుంబ స్థావరంగా మారిపోయింది.

అన్నదమ్ములు బద్ధ శత్రువులు....

తాజా ఎన్నికల్లో కూడా బంగారప్ప కుమారులిద్దరూ ఇక్కడ నుంచి పోటీ పడుతున్నారు. తమ్ముడు మధు బంగారప్ప మళ్లీ జనతాదళ్ (ఎస్) అభ్యర్థిగా బరిలోకి దిగారు. అన్న కుమార బంగారప్ప బీజేపీ అభ్యర్థిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 2004 నుంచి 2013 వరకూ మూడుసార్లూ జరిగిన ఎన్నికల్లో చెరోసారి గెలుపొందారు. ఒక దఫా ఇద్దరూ ఓడిపోయారు. కుమార బంగారప్ప గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అన్నదమ్ములైన మధు బంగారప్ప, కుమార బంగారప్ప మధ్య బధ్ద వైరం ఉంది. ఏ ఎన్నిక జరిగినా పై చేయి సాధించేందుకు ఇద్దరూ పోటీ పడుతుంటారు. ఇద్దరూ ఇప్పటికే తండ్రి పేరు చెప్పుకునే రాజకీయాలు సాగిస్తుంటారు. స్థానిక సంస్థలు, సహకార ఎన్నికలు... ఇలా ప్రతిఎన్నికల్లోనూ అన్నదమ్ములు తలపడుతుంటారు. జనతాదళ్ (ఎస్) నాయకుడైన మధు బంగారప్ప ముందస్తుగానే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. నియోజకవర్గంలో రైతుల అవసరాల కోసం సాగునీటి పథకాలను ప్రారంభించాలని కోరుతూ ఆందోళనలు నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జేడీఎస్ అభ్యర్థులు గెలుపొందడంతో, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విజయం తనదేనన్న ధీమాతో ఆయన ప్రచారం చే్తున్నారు. 1996లో తండ్రి బంగారప్ప లోక్ సభకు ఎన్నిక కావడంతో కుమారుడు కుమార బంగారప్ప అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కుమార బంగారప్ప ఎన్నికయ్యారు. నాటి ముఖ్యమంత్రి ఎస్.ఎం.కృష్ణ మంత్రివర్గంలో చిన్న నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. అనంతర కాలంలో ఇద్దరు అన్నదమ్ముల మద్య విభేదాలు ప్రారంభమయ్యాయి. చివరకు బంగారప్ప సైతం జీవిత చరమాంకంలో మధు బంగారప్ప వద్దే గడిపారు. 2013 ఎన్నికల్లో జేడీఎస్ తరుపున పోటీ చేసిన మధు బంగారప్ప 58,541 ఓట్లతో విజయం సాధించారు. కర్ణాటక జనతా పార్టీ అభ్యర్థి హోలప్పకు 37,316 ఓట్లు, కుమార బంగారప్పకు 33,176 ఓట్లు వచ్చాయి.

కులాల లెక్కలివే....

శివమొగ్గ జిల్లాలోని సొరబ నియోజకవర్గం ఒక రకంగా వివిధ సామాజిక వర్గాల కేంద్రం. అత్యధికంగా 58 వేల మంది ఈడిగ సామాజిక వర్గ ఓటర్లున్నారు. బంగారప్ప కూడా ఇదే సామాజిక వర్గం నాయకుడే. ఈడిగ తర్వాత అత్యధికంగా పాతిక వేల మంది లింగాయత్ ఓటర్లున్నారు. సుమారు 15 వేల మంది అల్ప సంఖ్యాక ఓటర్లున్నారు. బ్రాహ్మణ, గంగపుత్ర, రజక ఓటర్లూ నలభై వేల వరకూ ఉంటారని అంచనా. సాధారణంగా ఈడిగ ఓటర్లు బంగారప్ప తనయుల మధ్య చీలిపోతారు. లింగాయత్ ఓటర్లు సాధారణంగా బీజేపీ వైపే ఉంటారు. వారిని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రత్యేక మతంగా గుర్తించడంతో కొంతమంది కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని అంచనా. అల్ప సంఖ్యాక ఓటర్లలో ఎక్కువ మంది కాంగ్రెస్ వైపే ఉంటారు. సామాజిక వర్గ సమీకరణాలతో పాటు, డబ్బు పంపిణీ వంటి అంశాలు విజయావకాశాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. మధు బంగారప్ప, కుమార బంగారప్పలకు రాజకీయాలతో పాటు సినీరంగంతో సైతం మంచి అనుబంధం ఉంది. కుమార బంగారప్ప స్వయంగా సినిమాల్లో నటిస్తుంటారు. మధు బంగారప్ప చలనచిత్ర పంపిణీదారుగా వ్యవహరిస్తున్నారు.

సోషలిస్టు కర్మభూమిగా...

సోషలిస్టుల కర్మభూమిగా మారిన పడమటి కనుమల్లోని శివమొగ్గ జిల్లాలో సొరబ నియోజకవర్గం విస్తరించి ఉంది. ప్రకృతి వనరులకు సొరబ కేంద్రం. కానీ వాటిని సద్వనియోగం చేసుకుని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో ఈ ప్రాంత నాయకులు విఫలయమ్యారు. నియోజకవర్గంలో మౌలిక వసతులు కొరవడ్డాయి. ‘‘మేము స్వతహాగా సోషలిస్టులం. మాకు స్వార్థం ఉండదు. మా నియోజకవర్గాన్ని మాత్రమే అభివృద్ధి చేసుకుని ఇతర నియోజకవర్గాలను విస్మరించడం మా విధానం కాదు. అందువల్ల సొరబ నియోజకవర్గానికి అవసరమైన కనీస సౌకర్యాలు మాత్రమే కల్పించాను’’ అని బంగారప్ప చెబుతుండేవారు. ఈ కారణంగా నియోజకవర్గం వెనుకబడి ఉంది. ఆయన తనయులు కూడా అదే బాటలోనడవటంలో సొరబలో అభివృద్ధి మందగమనం తో నడుస్తోంది.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News