బండి వెనక డైరెక్షన్ వారిదేనా?

తెలంగాణలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గం కూర్పు వివాదాస్పదమయింది. బండి సంజయ్ కార్యవర్గం నియామకంలో నిక్కచ్చిగా వ్యవహరించారంటున్నారు. అగ్ర నేతల సిఫార్సులను కూడా పక్కన పెట్టేశారు. దాదాపు 80 [more]

Update: 2020-08-09 16:30 GMT

తెలంగాణలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గం కూర్పు వివాదాస్పదమయింది. బండి సంజయ్ కార్యవర్గం నియామకంలో నిక్కచ్చిగా వ్యవహరించారంటున్నారు. అగ్ర నేతల సిఫార్సులను కూడా పక్కన పెట్టేశారు. దాదాపు 80 శాతం మంది పాత వారికి పదవులు దక్కలేదు. దీంతో అగ్రనేతల్లోనూ బండి సంజయ్ పై అసంతృప్తి కనపడుతుంది. ఇటీవలే బండి సంజయ్ తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించారు. మొత్తం 23 మందితో కార్యవర్గాన్ని ప్రకటించారు. ఇటు కార్యవర్గం ప్రకటన వెలువడిన వెంటనే అసంతృప్తులు బాహాటంగానే బయటపడ్డాయి.

అసంతృప్తి చెలరేగినా…

బీజేపీకి ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యే రాజాసింగ్ వాట్సప్ మెసేజ్ ద్వారా తన బండి సంజయ్ కు తన అసంతృప్తిని తెలియజేశారు. రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యేను ఇంతగా అవమానిస్తారా? అని ఆయన నిలదీశారు. కొత్త కార్యవర్గంలో బండి సంజయ్ సీనియర్ నేతలను కూడా పక్కన పెట్టేశారు. ప్రస్తుతం కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి సిఫార్సులను కూడా బండి సంజయ్ పక్కన పెట్టారు. దీంతో బండి సంజయ్ పై అధినాయకత్వానికి ఫిర్యాదు చేసేందుకు కొందరు సీనియర్ నేతలు రెడీ అవుతున్నారు.

80 శాతం మందికి ఉద్వాసన….

నిజానికి బండి సంజయ్ 80 శాతం మందిని పాతవారిని తొలగించడం వెనక కారణం కూడా ఉందంటున్నారు. వారు పనిచేయక పోగా పార్టీకి భారంగా మారారన్నది ఆయన అభిప్రాయంగా ఉంది. ఇంతకు ముందు అగ్రనేతల అనుచరులు కమిటీలో హల్ చల్ చేసేవారు. అగ్రనేతల సిఫార్సులతో వచ్చి వారు పార్టీ పనికన్నా వ్యక్తిగత ప్రయోజనాలను ఎక్కువగా చూసుకునే వారు. అందుకనే బండి సంజయ్ వారందరినీ పక్కన పెట్టి కార్యవర్గంలో కొత్త రక్తాన్ని ఎక్కించినట్లు చెబుతున్నారు.

సంఘ్ సూచనలతోనే…..

మరోవైపు కొత్త కార్యవర్గం కూర్పు వెనక సంఘ్ సూచనలు ఉన్నాయంటున్నారు. సంఘ్ కు కార్యవర్గం జాబితాను పంపి, అక్కడి నుంచి ఆమోదం లభిచడం వల్లనే ప్రకటన ఆలస్యమయిందంటున్నారు. మరోవైపు కార్యవర్గం ఏర్పాటుపై బండి సంజయ్ కేంద్రంలో కీలక నేతను కూడా సంప్రదించిన తర్వాతనే ప్రకటించారని చెబుతున్నారు. అందుకనే బండి సంజయ్ కార్యవర్గం విషయంలో ఖరాఖండీగా వ్యవహరించారంటున్నారు. లక్ష్మణ్, కిషన్ రెడ్డి వర్గాలు పక్కన పెట్టడం వెనక కూడా అదే రీజన్ అని చెబుతున్నారు. మొత్తం మీద సంఘ్ డైరెక్షన్ లోనే బండి సంజయ్ నడుస్తున్నట్లు క్లియర్ గా అర్థమవుతోంది.

Tags:    

Similar News