బండికి బాధలు మొదలయినట్లేనా?

హుజూరాబాద్ ఉప ఎన్నిక భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కు ప్రిస్టేజ్ గా మారింది. ఆయన పార్లమెంటు పరిధిలో ఈ నియోజకవర్గం ఉండటంతో గెలుపు [more]

Update: 2021-07-28 11:00 GMT

హుజూరాబాద్ ఉప ఎన్నిక భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కు ప్రిస్టేజ్ గా మారింది. ఆయన పార్లమెంటు పరిధిలో ఈ నియోజకవర్గం ఉండటంతో గెలుపు తప్పనిసరి అయింది. అయితే మొన్నటి వరకూ టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకునే బీజేపీకి ఇప్పుడు రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కావడంతో కొంత ఇబ్బందిగా మారింది. పార్టీలో చేరికలు కూడా ఇక ఉండే అవకాశాలు లేవు.

చేరికలు లేెక…?

బీజేపీ మొన్నటి వరకూ తమ పార్టీలోకి కాంగ్రెస్, టీఆర్ఎస్ నుంచి పెద్దయెత్తున నేతలు చేరతారని చెప్పుకుంటూ వచ్చింది. బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడయిన తర్వాత వరసగా దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ మంచి పనితీరు కనపర్చింది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో ఊహించిన ఫలితమే. అయితే రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా నియమితులైన తర్వాత కొంత పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ లోనూ కొంత తత్తరపాటు మొదలయింది.

పాదయాత్రకు….

అందుకే పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. నిజానికి ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. ఈ సమయంలో బండి సంజయ్ పాదయాత్ర చేయడానికి కూడా రేవంత్ రెడ్డి రాక కారణమని చెప్పకతప్పదు. తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ కంటే క్షేత్రస్థాయిలో బలంగా లేదన్నది వాస్తవం. అనేక నియోజకవర్గాల్లో ఇప్పటికీ సరైన నేత లేరు. కొన్ని జిల్లాల్లో పార్టీకి ఓటు బ్యాంకుతో పాటు క్యాడర్ కూడా లేదు.

తామే ప్రత్యామ్నాయం అంటూ….

టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని, గోల్కొండ కోట మీద వచ్చే ఎన్నికల్లో జెండా ఎగురవేస్తామని బండి సంజయ్ పదే పదే చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ క్రమంగా పుంజుకునే పరిస్థితులు కన్పిస్తున్నాయి. మోదీ ఇమేజ్ కూడా గత ఎన్నికల సమయంలో కంటే మరింత పడిపోయింది. దీంతో రానున్న కాలంలో బీజేపీకి తెలంగాణలో నిలదొక్కుకోవడం అంత సులువు కాదన్నది విశ్లేషకుల అంచనా. హుజూరాబాద్ లో అభ్యర్థి ఈటల రాజేందర్ కావడంతో కొంత బీజేపీకి ప్లస్ అనే అనుకున్నా, రానున్న కాలమంతా ఆ పార్టీకి కష్టకాలమే. కాంగ్రెస్ పార్టీ నుంచే దానికి ముప్పు ఉంది. మరి బండి సంజయ్ ఎలాంటి వ్యూహాలు రచిస్తారో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News