“బండి” ముందుకు కదలనిస్తారా?

స్పీచ్ లు బాగానే ఉన్నాయి… శపథాలు కూడా అదిరిపోయాయి… సవాళ్లకు కొరతేమీ లేదు…ఆశలకు అంతే లేదు…ఇదీ తెలంగాణ భారతీయ జనతా పార్టీ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికై పదవీ [more]

Update: 2020-03-25 18:29 GMT

స్పీచ్ లు బాగానే ఉన్నాయి… శపథాలు కూడా అదిరిపోయాయి… సవాళ్లకు కొరతేమీ లేదు…ఆశలకు అంతే లేదు…ఇదీ తెలంగాణ భారతీయ జనతా పార్టీ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికై పదవీ బాధ్యతలను చేపట్టిన బండి సంజయ్ పరిస్థితి. తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా బండి సంజయ్ ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే ఆయనకు పార్టీలో సీనియర్ నేతలు సహకరిస్తారా? ఆయన చెబుతున్నట్లు బీజేపీ తెలంగాణలో బలోపేతం అవుతుందా? అంటే అవునని ఎవరూ గట్టిగా సమాధానం చెప్పలేని పరిస్థితి.

ఊహించని విధంగా…..

బండి సంజయ్ ఊహించని విధంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. సంజయ్ కి పదవి రావడం వెనక ఆర్ఎస్ఎస్ ఉందన్నది వాస్తవం. ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఎదిగిన బండి సంజయ్ ను అమిత్ షా, జేపీ నడ్డా సయితం దగ్గరతీశారంటారు. వారి ఆశీస్సులు బండి సంజయ్ కు పుష్కలంగా ఉన్నాయంటారు. అందుకే బండి సంజయ్ పదవి చేపట్టిన వెంటనే రేపటి నుంచే కేసీఆర్ పై యుద్ధమేనని ప్రకటించారు.

అగ్రనేతల సహకారంతో…..

కేసీఆర్ పై ఇప్పటి వరకూ పదవుల్లో ఉన్న రాష్ట్ర నేతలు పెద్దగా విరుచుకుపడలేదని అధిష్టానం భావించిందంటున్నారు. వచ్చిన అవకాశాలన్నింటినీ వదిలేసుకుందని భావిస్తోంది. సీఏఏ పై పార్లమెంటులో టీఆర్ఎస్ వ్యతిరేకించినా తెలంగాణలో బీజేపీ చప్పుడు చేయలేదని అధిష్టానం తీవ్రంగా భావించిందంటున్నారు. అందుకే ఏరికోరి బండి సంజయ్ ను నియమించిందని చెబుతున్నారు. అయితే అధిష్టానం నమ్మకాన్ని వమ్ము చేయనంటున్న బండి సంజయ్ కు సీనియర్ నేతలు ఏ మేరకు సహకరిస్తారన్నది సందేహమే.

సీనియర్ నేతలు కలసి వస్తారా?

తెలంగాణలో క్యాడర్ లేకపోయినా నేతలు మాత్రం బీజేపీకి పుష్కలంగా ఉన్నారు. లక్ష్మణ్, రాజాసింగ్, డీకే అరుణ, జితేందర్ రెడ్డి, ధర్మపురి అరవింద్ తదితర నేతలు ఇప్పటికే బండి సంజయ్ నియామకంపై అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. అయితే ఇప్పటికిప్పుడు తెలంగాణాలో ఎన్నికలు ఏవీ లేకపోవడంతో బండి సంజయ్ కు ఒకరకంగా ఊరటేనని చెప్పాలి. అయితే ఆయన రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర, రధయాత్ర చేస్తానని చెప్పారు. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పెట్టుకుని తన పనితీరు ఉంటుందని బండి సంజయ్ చెబుతున్నారు. మరి బండి సంజయ్ బీజేపీ బండిని ఎలా లాక్కొస్తారో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News