“బండి” దిగి నేల మీద నడిస్తేనే మంచిది

భ్రమ ఎప్పుడూ నాయకులను చెడగొడుతుంది. తన వల్లనే పార్టీ బతుకుందన్న భావన వస్తే అది వినాశానికి దారితీస్తుంది. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పుడు అదే [more]

Update: 2021-01-12 09:30 GMT

భ్రమ ఎప్పుడూ నాయకులను చెడగొడుతుంది. తన వల్లనే పార్టీ బతుకుందన్న భావన వస్తే అది వినాశానికి దారితీస్తుంది. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పుడు అదే ధోరణిలో ఉన్నట్లు కనపడుతుంది. తెలంగాణలో బీజేపీ బలోపేతం తన కారణంగానే జరుగుతుందన్న భ్రమలో బండి సంజయ్ ఉన్నట్లు కనపడుతుంది. ఏదో రెండు ఎన్నికల్లో ఏదో కొంత సానుకూలత వస్తే అది తన వల్లేననుకుంటున్నారు.

అంతా తనవల్లేనని…..

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చినట్లు, టీఆర్ఎస్ ను ప్రజలు తిరస్కరిస్తున్నట్లు బండి సంజయ్ కలలు కంటున్నారు. తన నాయకత్వంలోనే పార్టీ అధికారంలోకి రావాలని బండి సంజయ్ భావిస్తున్నారు. ఇందుకోసం ఆయన చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు వివాదంగా కూడా మారుతున్నాయి. కేసీఆర్ జైల్లోకి వెళ్లతప్పదన్న సంజయ్ వ్యాఖ్యలు వాస్తవానికి ఎంత నిజమవుతాయో తెలియదు కాని, ఒక్క గెలుపుతో ఆయన వైఖరి మారిందంటున్నారు.

దుబ్బాకలో గెలుపు…..

నిజానికి దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపు బండి సంజయ్ తెలివిగా తన ఖాతాలో వేసుకున్నారు. అయితే నిజానికి దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపునకు రెండు కారణాలున్నాయి. ఒకటి రఘునందన్ రావుపై సానుభూతి ఉండటం, రెండు సిట్టింగ్ ఎమ్మెల్యే దివంగత రామలింగారెడ్డి కుటుంబంపై వ్యతిరేకత ఉండటం. ఈ రెండు కారణాలతోనే అక్కడ బీజేపీ గెలిచింది. టీఆర్ఎస్ కనుక సీటు మరొకరికి ఇచ్చి ఉంటే ఫలితం మరోలా ఉండేది. ఈ విషయంలో బీజేపీలోని కింది స్థాయి కార్యకర్తలకూ తెలుసు.

ఏపీలో చేయడానికి….?

ఇక తాజాగా ఏపీలో జరుగుతున్న వ్యవహారాలపై బండి సంజయ్ వ్యాఖ్యలు కూడా వివాదంగానే మారాయి. ఏపీలో ఒక మతం రాజ్యమేలుతుందన్నారు. బైబిల్ కావాలో, భగవద్గీత కావాలో తిరుపతి ప్రజలు తేల్చుకోవాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ గెలుపు అంత సులువు కాదు. దుబ్బాకలో గెలుపు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను సాధించడంతో బండి సంజయ్ ఏపీ రాజకీయాలపై కూడా వేలుపెట్టడం విమర్శలకు తావిస్తోంది. బండి సంజయ్ ఇప్పుడు నేల మీద నడిస్తే మంచిదని ఆయన సన్నిహితులు సయితం సూచిస్తున్నారు.

Tags:    

Similar News