ఈ మాజీ మంత్రిపై అనుమానమేనట?

ఆయన విశాఖ జిల్లాలో సీనియర్ మోస్ట్ టీడీపీ నేత. ఒకసారి మంత్రిగా కూడా చంద్రబాబు క్యాబినెట్లో పనిచేసిన బండారు సత్యనారాయణమూర్తి పదవులకు మరో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడే [more]

Update: 2020-08-27 06:30 GMT

ఆయన విశాఖ జిల్లాలో సీనియర్ మోస్ట్ టీడీపీ నేత. ఒకసారి మంత్రిగా కూడా చంద్రబాబు క్యాబినెట్లో పనిచేసిన బండారు సత్యనారాయణమూర్తి పదవులకు మరో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడే ఎపుడూ అడ్డు. ఇద్దరూ వెలమ సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో అయ్యన్నకు పెద్ద పీట వేసి మంత్రి పదవులు ఇచ్చిన చంద్రబాబు బండారు ను మాత్రం బుజ్జగిస్తూ వచ్చారు. ఒకే జిల్లా, సీనియర్ నేతలు, ఒకే సామాజికవర్గం కావడంతో బండారుకు ప్రతీసారీ అన్యాయమే జరిగింది. ఒకసారి ఎపుడో అయ్యన్న పార్లమెంట్ కి ఎంపీగా రెండేళ్ళ పాటు వెళ్తే ఆ సమయంలోనే బండారు మంత్రి అయ్యారన్నమాట.

అల్లుడు అలా …..

ఇక బండారు సత్యనారాయణమూర్తి రాజకీయంగా మాజీ మంత్రిగా ఉన్నా కూడా అల్లుడు, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు ఎర్రన్నాయుడు వారసుడు రామ్మోహననాయుడుని చూసి కొంత నిబ్బరంగా ఉండేవారు. ఇపుడు కింజరాపు కుటుంబమే ఇబ్బందుల్లో పడిపోయింది. రెండున్నర నెలలుగా అచ్చెన్నాయుడు బెయిల్ పొందలేక అవస్థ పడుతున్నారు. ఆయన అరెస్ట్ తో కింజరాపు కుటుంబం చిక్కులో పడింది. రామ్మోహననాయుడు బాబాయ్ ని విడిపించలేక, టీడీపీ అధినాయకత్వం నుంచి సరైన సహకారం రాక తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. దాంతో ఆ కాక మామకు కూడా తగిలిందని అంటున్నారు.

సైకిల్ దిగుతారా….

ఇపుడు చూసుకుంటే బండారు సత్యనారాయణమూర్తికి టీడీపీలో మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా అన్నది ఒక డౌట్. పెందుర్తిలో వైసీపీ నుంచి వచ్చిన గండి బాబ్జీకే హై కమాండ్ ప్రాధాన్యత ఇస్తుండడంతో బండారు ఆందోళన‌ పడుతున్నారుట. అదే విధంగా తన కుమారుడు అప్పలనాయుడుని భావి వారసుడిగా ప్రకటించుకున్నారు. కానీ ఆయన వల్లనే గత ఎన్నికల్లో బండారు ఓడిపోయారు. దాంతో తండ్రీ కొడుకులను పక్కన పెట్టేందుకు హై కమాండ్ రెడీ అయింది. ఈ పరిణామాలతో బండారు సత్యనారాయణమూర్తి టీడీపీలో ఇమడలేకపోతున్నారని అంటున్నారు. పైగా ఆయన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు టచ్ లో ఉండే నేత కావడంతో ఆయన కదలికల మీద అనుమానాలు ఉన్నాయట.

బీజేపీలోకా…?

ఈ పరిణామాల నేపధ్యంలో బండారు సత్యనారాయణమూర్తి బీజేపీలోకి వెళ్తారా అన్న చర్చ కూడా ఉందని అంటున్నారు. అల్లుడు రామ్మోహన్నాయుడు బీజేపీ వైపు చూస్తున్నారని ఎటూ టాక్ ఉంది. మరో వైపు గంటా కూడా తన మనసులో మాట చెప్పకపోయినా వైసీపీ కాకపోతే బీజేపీ అంటున్నట్లుగా భోగట్టా. ఇలా తన చుట్టూ ఉన్న వారు కాషాయం కట్టేందుకు రెడీ అయితే బండారు సత్యనారాయణమూర్తి కూడా వారి బాటలో నడుస్తారని అంటున్నారు. తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు ముఖ్యమని భావిస్తున్న బండారు బీజేపీలో చేరడానికి కూడా అదే కండిషన్ పెడతారు అంటున్నారు. మొత్తానికి బండారు సత్యనారాయణమూర్తి వంటి సీనియర్ సైకిల్ దిగితే అది పార్టీకి బాగా దెబ్బ అని అంటున్నారు. చూడాలి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News