బండారు ఆయాసపడుతూ…. భయపెట్టేస్తున్నారుగా

విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ప్రభుత్వ అధికారులను భయపెట్టేస్తున్నారు. అలా ఇలా కాదు ఏకంగా జైలు కధలు వినిపించేస్తున్నారు. [more]

Update: 2020-05-30 12:30 GMT

విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ప్రభుత్వ అధికారులను భయపెట్టేస్తున్నారు. అలా ఇలా కాదు ఏకంగా జైలు కధలు వినిపించేస్తున్నారు. మీరు జాగ్రత్తగా ఉండకపోతే శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదని కూడా హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతంసవాంగ్ లను ఆయన బెదరగొడుతున్నారు. వైసీపీ నేతలకు జైలు అలవాటే, మీ సంగతే చూసుకోండి అంటున్నారు. వైఎస్సార్ జమానాలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు జైలు ఊచలు లెక్కబెట్టారన్ని కూడా ఫ్లాష్ బ్యాక్ స్టొరీలు చెబుతున్నారు. ఇంతకీ బండారు సత్యనారాయణమూర్తి బాధ ఏంటి అన్నదే ఇక్కడ చర్చగా ఉంది.

మాట వినరట ……

అవుని ఇది నిజమే కదా. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం చెప్పినట్లుగానే అధికారులు పనిచేస్తారు. టీడీపీ హయాంలో అది నిజమై రుజువైంది కూడా. నాడు జగన్ మీద హత్యాయత్నం జరిగితే నాటి డీజీపీ ఆర్పీ ఠాకూర్ అది జగన్ తన మీద తానే సొంతంగా చేయించుకున్నాడన్నంతగా కలరింగ్ ఇచ్చారు. మరి నాడు అధికారులు బాబు మాటలు వినబట్టే కదా ఇపుడు ఎక్కడికో పదవికి దూరంగా వెళ్ళిపోయారు. ఇక అధికారులు ఎపుడైనా బాధ్యులే అవుతారు. ఎందుకంటే ప్రతీ ఫైల్ మీద వారి సంతకాలే ఉంటాయి. ప్రతీ జీవో వారి సంతకంతోనే వస్తుంది. కానీ ప్రభుత్వాన్ని నడిపే రాజకీయ‌ నాయకులు చెప్పినట్లుగానే నడవాల్సి ఉంటుంది. ఇది కొత్తగా బండారు సత్యనారాయణమూర్తి చెబుతున్నారంటే టీడీపీ మాట అధికారులు వినలేదని బాధతోనే.

శంకరగిరిమాన్యాలే…..

అయిదేళ్ల తరువాత శ్రీకృష్ణ జన్మస్థానానిక్ వెళ్తారో, మరేమో కానీ ఇపుడు ప్రభుత్వ పెద్దల మాట వినకపోతే లూప్ లైన్లలోని వెళ్ళిపోతారు. ఏకంగా శంకరగిరి మాన్యాలు కూడా పడతారు. అందుకే ఇవన్నీ తెలిసి అధికారులు తమ మూడున్నర దశాబ్దాల ప్రభుత్వ సేవను చాలా మెలకువతో లౌక్యంగానే చేస్తారు. వారికి అయిదేళ్ళ పాటు అధికారం చలాయించే ఏ రాజకీయ నాయకుడూ వేరేగా పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే వారి బాధ్యతలు, జాగ్రత్తలూ బండారు సత్యనారాయణమూర్తితో సహా ఎవరూ గుర్తు చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వైసీపీ అయినా, టీడీపీ అయినా దొందూ దొందే, అందువల్ల అధికారులు ఎవరి దగ్గర ఎలా మసులుకోవాలో అలాగే వ్యవహరిస్తారు.

అదేనా బాధ…..

చంద్రబాబు విశాఖ టూర్ కి అనుమతించలేదని డీజీపీపైన టీడీపీకి పీకల మీద కోపం ఉంది. అయినా డీజీపీ గౌతం సవాంగ్ ఏం చేయగలరు. అక్కడ ఉన్నది జగన్. ఇక మరో వైపు చూసుకుంటే నీలం సాహ్ని సీనియర్ మోస్ట్ ఐఏఎస్ అధికారిణి. ఆమెకు ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో బాగా తెలుసు. అందుకే జగన్ వద్ద ఏ అధికారి కూడా ఆమెలా మంచిగా ఉండలేదు. జగన్ ఏరి కోరి ఆమె పదవీ కాలాన్ని మరికొన్నాళ్ళు పెంచమని కేంద్రాన్ని కోరుతున్నారు అంటేనే ఆమె తనదైన లౌక్యం చాకచక్యంతో వైసీపీ సర్కార్ లో కుదురుకుందని తెలుస్తోందని అంటున్నారు. ఇదిలా ఉండగా బండారు సత్యనారాయణమూర్తి మరో కీలకమైన ఆరోపణ చేశారు. వైసీపీ సర్కార్ జీవోలన్నీ కూడా సజ్జల రామక్రిష్ణారెడ్డి తయారు చేస్తున్నారుట. గుడ్డిగా నీలం సాహ్ని సంతకాలు పెడుతున్నారుట. అయినా ఆమెకు ఇవన్నీ తెలియవా, దీని మీద బండారు సత్యనారాయణమూర్తి ఊరికే ఆయాస‌పడడం తప్ప ఒనగూడేది లేదుగా. మొత్తానికి ప్రభుత్వ పెద్దల మీద బాణాలు వేసి వేసి విసుగు వచ్చిందో ఏమో ఇపుడు బండారు లాంటి వారు డీజీపీ, చీఫ్ సెక్రటరీల మీద పడ్డారని అంటున్నారు.

Tags:    

Similar News