అల్లుడు అదుర్స్…ఆయనే వారసుడట

రాజకీయాల్లో గురువుని మించి ఆయన ముందుకు వచ్చారు. గిట్టని వారు ముంచి వచ్చారని అంటారు. ఏదైనా రాజకీయమే కాబట్టి సర్దుకోవచ్చు. ఆయనే విశాఖ జిల్లాకు చెందిన మాజీ [more]

Update: 2020-05-12 14:30 GMT

రాజకీయాల్లో గురువుని మించి ఆయన ముందుకు వచ్చారు. గిట్టని వారు ముంచి వచ్చారని అంటారు. ఏదైనా రాజకీయమే కాబట్టి సర్దుకోవచ్చు. ఆయనే విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి. ఆయన ఓ దశలో ఉమ్మడి ఏపీలో కీలకమైన మునిసిపల్ శాఖ మంత్రిగా పనిచేశారు. బలమైన వెలమ సమాజిక వర్గానికి చెందిన బండారు దూకుడు రాజకీయం చేస్తారని పేరు. అనేక సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచి పార్టీకి, చంద్రబాబుకు వీర విధేయుడుగా మెలిగారు. కానీ బాబు దయ లేని కారణంగా ఒకే ఒకసారి మంత్రి కాగలిగారు.

అదే చిత్రం…..

ఇక బండారు సత్యనారాయణమూర్తి మంత్రిగా ఉన్న కాలంలో కనీసం రాజకీయాల్లో కూడా లేని గంటా శ్రీనివాసరావు తరువాత టీడీపీలో కీలక నేత కావడం, ఆయన వర్గంలో బండారు చేరడం రాజకీయ చిత్రం అనుకోవాలి. ఇక బండారు సత్యనారాయణమూర్తి కి కోపం ఎక్కువ, వ్యూహాలు తక్కువ అంటారు. అందుకే ఆయన దూకుడు కొన్ని సార్లు మేలు చేసినా చాలా సార్లు బెడిసికొట్టింది. ఏకంగా అధినేత చంద్రబాబు మీదనే అలగడంతో ఆయన రెంటికి చెడిపోయారు. ఇదిలా ఉండగా తాజా ఎన్నికల్లో సన్ స్ట్రోక్ తగిలి ఆయన ఓటమి పాలు అయ్యారు.

కొడుకే ఓడించాడు ….

ఇది పెందుర్తిలో అంతా చెప్పుకునే మాట. తన రాజకీయ వారసుడు కొడుకు అప్పలనాయుడు అనుకుని బండారు సత్యనారాయణమూర్తి గుడ్డిగా నమ్మేశారు. అయితే తండ్రిని మించిన కోపంతో, రాజకీయ తెలివిడి లేమితో అప్పలనాయుడు పార్టీని ముంచేశారు. తండ్రిని ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే కొడుకు పెత్తనం చేస్తున్నాడు అందువల్ల ఆయన్నే ఓడిస్తే సరి అని జనం అనుకున్నారు. ఈ దెబ్బకు కొడుకు వయసు ఉన్న అదీప్ రాజ్ వైసీపీ నుంచి మంచి మెజారిటీతో గెలిచి సీనియర్ మోస్ట్ లీడర్ బండారు సత్యనారాయణమూర్తి కి దెబ్బ కొట్టారు. ఓడి ఏడాది అవుతున్నా ఇప్పటికీ అక్కడ సైకిల్ పరుగులు తీయలేకపోవడానికి కారణం కొడుకు నిర్వాకమేనని బండారు సత్యనారాయణమూర్తికి తెలిసినా కిమ్మనలేని పరిస్థితి.

అసలు వారసుడు….

ఇక బండారు సత్యనారాయణమూర్తి రాజకీయ జీవితంలో చేసిన గొప్ప పని ఏంటి అంటే తన కూతురుని మాజీ ఎంపీ దివంగత కింజరపు ఎర్రనాయుడు కొడుకు, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఇచ్చి అల్లుడిని చేసుకోవ‌డం. ఇపుడు ఆయనే అసలైన వారసుడిగా కనిపిస్తున్నారు. బండారు కుటుంబంలో అల్లుడిగా ఉన్నా, కొడుకుగా ఉన్నా ఆయనే రేపటి రాజకీయం అని మాజీ మంత్రి సంతృప్తి చెందాల్సివస్తోంది. వయసు అయిపోతోంది. పార్టీలో పట్టు జారుతోంది, కొడుకు పగ్గాలు అందుకోలేకపోతున్నారు. దాంతో ఈ సీనియర్ నేతకు భవిష్యత్తు మీద బెంగ పట్టుకుందని అంటారు. 2024 నాటికి పెందుర్తి లో టికెట్ తనకు దక్కుతుందా లేదా అన్న కలవరం కూడా ఉంది. పోటీలో చాలా మంది నాయకులు ఉన్నారు. అదే కనుక జరిగితే అల్లుడు అదుర్స్ అనుకుంటూ శేషజీవితం గడపాల్సిందే.

Tags:    

Similar News