శాసించేది ఆయనే… పార్టీకి శాపమూ ఆయనేనా?

అవును! ఇప్పుడు వైసీపీ నేత‌లు ప్రతి జిల్లాలోనూ మంత్రుల‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే, కొన్ని జిల్లాల్లో నాయ‌కులు త‌మ అసంతృప్తిని బాహాటంగా వెళ్లగ‌క్కుతుంటే.. మ‌రికొన్ని [more]

Update: 2020-09-21 02:00 GMT

అవును! ఇప్పుడు వైసీపీ నేత‌లు ప్రతి జిల్లాలోనూ మంత్రుల‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే, కొన్ని జిల్లాల్లో నాయ‌కులు త‌మ అసంతృప్తిని బాహాటంగా వెళ్లగ‌క్కుతుంటే.. మ‌రికొన్ని జిల్లాల్లో మాత్రం మౌనంగా భ‌రిస్తున్నారు. ఇదే తేడా. ఇలా.. బ‌ట్టబ‌య‌లైన ఓ జిల్లా వ్యవ‌హారం.. ఇప్పుడు రాజ‌కీయంగా చ‌ర్చనీయాంశంగా మారింది. రాజ‌కీయంగా సీనియ‌ర్ నాయ‌కుడు, సీఎం జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడుగా గుర్తింపు సాధించిన నాయ‌కుడు, ప్రకాశం జిల్లాకుచెందిన మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి. పార్టీలో ఈయ‌న ఇప్పుడు మంచి హ‌వాలో ఉన్నారు. ఆయ‌న మాట‌కు ఎదురులేద‌నే భావ‌న ఉంది.

ఆయన కనుసన్నల్లోనే…..

ఆయ‌న క‌నుస‌న్నల్లోనే గ‌త ఐదేళ్ల నుంచి కూడా జిల్లా వైసీపీ కార్యక్రమాలు జ‌రుగుతున్నాయి. అదే స‌మయంలో పార్టీలోనూ ఆయ‌న మాట‌కు తిరుగులేదు. జ‌గ‌న్ బాలినేనిని వాసు మామా అని పిలుస్తారు. జ‌గ‌న్ బాబాయ్ వైవి.సుబ్బారెడ్డి బావే బాలినేని. వాస్తవంగా చెప్పాలంటే సుబ్బారెడ్డే జ‌గ‌న్‌కు సొంత బాబాయ్. అయినా జ‌గ‌న్ బాలినేనికి ఎంత ప్రయార్టీ ఇస్తారో చెప్పక్కర్లేదు. జ‌గ‌న్ పార్టీ పెట్టిన‌ప్పటి నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి జిల్లా వైసీపీని శాసిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్కింది. అయితే, ఇప్పుడు జిల్లాలో నాయ‌కుల‌ను ఆయ‌న ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, త‌మ గోడు వినిపించుకోవ‌డం లేద‌ని నాయ‌కులు వాపోతున్నారు. కేవ‌లం కొంద‌రికి మాత్రమే బాలినేని శ్రీనివాసరెడ్డి అందుబాటులో ఉంటున్నార‌ని పెద్దగానే ప్రచారం జ‌రుగుతోంది.

విభేదాలను మౌనంగా….

ఇక‌, పార్టీలో తీవ్ర ఘ‌ర్షణ‌ల‌కు దారిచ్చేలా కొంద‌రు వ్యవ‌హ‌రిస్తున్నా.. ఆయ‌న మౌనంగా ఉంటున్నార‌ని, అంతా అయిపోయిన త‌ర్వాత‌.. ఏదో ఒకటి తేల్చుకుని త‌న వ‌ద్దకు వ‌చ్చాక పంచాయ‌తీ చేయాల‌నే కోణంలో ఉన్నార‌ని అంటున్నారు. విశ్వస‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్రకారం ఇటీవ‌ల ఓ ఎమ్మెల్యే మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ని క‌లిశారు. సీఎంతో అప్పాయింట్‌మెంట్ ఇప్పించాల‌ని అభ్యర్థించారు. అలాకాదు.. నీ స‌మ‌స్య ఏంటో నాకు చెప్పు.. అని బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రశ్నించ‌డంతో స‌ద‌రు నాయ‌కుడు త‌న స‌మ‌స్యను వివ‌రించారు. ఇంతోటి దానికి సీఎం దాకా ఎందుకు? నేనే తేల్చేస్తా.. అన్న మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి త‌ర్వాత స‌ద‌రు నాయ‌కుడికి తానే అప్పాయింట్‌మెంట్ ఇవ్వడం మానేశారు.

వైవీయే నయమంటూ….

ఈ ప‌రిస్థితిపై ఆ ఎమ్మెల్యే తీవ్రంగా ఫైర‌వుతున్నారు. గ‌తంలో వైవీ సుబ్బారెడ్డి అంతో ఇంతో త‌మ ప‌నులు చేసిపెట్టేవార‌ని, ప్రభుత్వంలో లేక‌పోయినా.. ఆయ‌న ఎంపీగా ఉండి అధికారుల‌ను పుర‌మాయించార‌ని, ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి మాత్రం త‌మ‌కే చుక్కలు చూపిస్తున్నార‌ని స‌ద‌రు ఎమ్మెల్యే బాహాటంగానే ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్నారు. దీంతో ఇది.. జిల్లా వ్యాప్తంగా చ‌ర్చకు దారితీసింది. ఇక చీరాల లాంటి చోట్ల కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి క‌ర‌ణంకు స‌పోర్ట్ చేస్తుండ‌డంతో అక్కడ ఆమంచి కూడా బాలినేనిపై గుస్సాతో ఉన్నారు. మ‌రి ఇలాంటి ప‌రిణామాలు… ప్రతిప‌క్షాల‌కు బ‌లం చేకూర్చవా ? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్రశ్న.

Tags:    

Similar News