బాలినేని చేస్తోంది మంచా? చెడా?

వైసీపీలో కీల‌క నాయ‌కుడు. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన సీనియ‌ర్ నేత, ప్రస్తుతం విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాస‌రెడ్డి దూకుడుగా ముందుకు సాగుతున్నార‌నే వ్యాఖ్యలు [more]

Update: 2020-03-20 12:30 GMT

వైసీపీలో కీల‌క నాయ‌కుడు. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన సీనియ‌ర్ నేత, ప్రస్తుతం విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాస‌రెడ్డి దూకుడుగా ముందుకు సాగుతున్నార‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి రెండు కోణాల్లో ఆయ‌నపై విశ్లేష‌ణ‌లు ఊపందు కున్నాయి. ఆయ‌న అనుకూల‌ వ‌ర్గం ఒక‌విధంగాను, వ్యతిరేక వ‌ర్గం మ‌రోవిధంగాను సొంత పార్టీ వైసీపీలోనే వ్యాఖ్యలు చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. పార్టీలో తిరుగులేని నాయ‌కుడిగా ఉన్న బాలినేని శ్రీనివాస‌రెడ్డి త‌న ముఖ్య విధుల‌ను ప‌క్కన పెట్టార‌నే వాద‌న విప‌క్షం నుంచి వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. అయితే ఏది ఎలా ఉన్నప్పటికీ బాలినేని అనుచ‌రులు మాత్రం త‌మ నాయ‌కుడికి తిరుగులేద‌ని జ‌గ‌న్ ద‌గ్గర మంచి మార్కులు ప‌డుతున్నాయ‌ని అంటున్నారు.

కీలక నేతలను…..

మ‌రి ఇలా భిన్నమైన విశ్లేష‌ణ‌లు వ‌స్తున్న బాలినేని శ్రీనివాస‌రెడ్డి వ్యవ‌హార శైలి ఎలా ఉందో చూద్దాం. గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఆయ‌న విజ‌యం సాధించి.. జ‌గ‌న్ కేబినెట్‌లో విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నారు. జ‌గ‌న్‌కు ద‌గ్గర‌ బంధువు కూడా అయిన బాలినేని శ్రీనివాస‌రెడ్డి ప్రకాశంలో ఆది నుంచి వైసీపీ త‌ర‌ఫున చ‌క్రం తిప్పుతున్నారు. ప్రకాశం జిల్లాల్లో 2012 ఉప ఎన్నిక‌ల్లో గెలిచిన ఆయ‌న వైసీపీ తొలి ఎమ్మెల్యే. ఇక‌, ఇటీవ‌ల కాలంలో టీడీపీ అధినేత చంద్రబాబును దెబ్బకొట్టడంపై దృష్టి పెట్టిన బాలినేని జిల్లాలోని టీడీపీ నాయ‌కుల‌ను వైసీపీలోకి చేర్చే ప‌ని చేస్తున్నారు. ఇటీవ‌ల చీరాల ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రాం కుమారుడు వెంక‌టేష్‌తో స‌హా వైసీపీ తీర్థం పుచ్చుకోవ‌డంలో బాలినేని చ‌క్రం తిప్పారు. అన్నివిధాలా వారిని ఒప్పించి కీల‌క స‌మ‌యంలో(స్థానిక ఎన్నిక‌ల‌పై చంద్రబాబు స‌మ‌రం చేస్తున్న స‌మ‌యంలో) క‌ర‌ణం వంటి సిట్టింగ్ ఎమ్మెల్యేను వైసీపీవైపు న‌డిపించారు.

కీ రోల్ పోషిస్తూ…

నిజానికి ఈ ప‌రిణామం టీడీపీని నైతికంగా దెబ్బకొట్టింది. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో 23 సీట్లు ద‌క్కించుకున్న టీడీపీకి ప‌ది నెల‌లు గ‌డిచేస‌రికి వ‌ల్లభ‌నేని వంశీ, మ‌ద్దాలి గిరిధ‌ర్ స‌హా క‌ర‌ణం దూర‌మ‌య్యారు. అదేస‌మయంలో తాజాగా బాప‌ట్ల నుంచి టికెట్ ఆశించి భంగ‌ప‌డిన మాజీ మంత్రి గాదె వెంక‌ట‌రెడ్డి కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీని వెనుక కూడా బాలినేని వ్యూహం ఉంద‌నేది వాస్తవం. గాదె వెంక‌ట‌రెడ్డి త‌న త‌న‌యుడికి ప‌రుచూరు అసెంబ్లీ టిక్కెట్ ఆశించే పార్టీ మారిన‌ట్టు టాక్‌..? ఇక ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన కొద్ది రోజుల‌కే ప‌రుచూరు మాజీ ఇన్‌చార్జ్ రావి రామ‌నాథం బాబును సైతం పార్టీలోకి తీసుకు రావ‌డంలో బాలినేని కీ రోల్ పోషించారు.

వైవీతో సహా అందరూ…

దీంతో జ‌గ‌న్ ద‌గ్గర బాలినేనికి ప్లస్‌లు ప‌డుతున్నాయి. అయితే, ఆయ‌న మంత్రిగా ఉన్న నేప‌థ్యంలో త‌న విధుల‌ను ప‌క్కన పెట్టి వ‌ల‌స‌లను ప్రోత్స‌హించే ప‌నిచేస్తున్నారంటూ. బాలినేని శ్రీనివాస‌రెడ్డి పై విమ‌ర్శలు సాగుతున్నాయి. ముఖ్యంగా సొంత పార్టీలోనే బాలినేని వ్యతిరేక వ‌ర్గం బాబు అనుకూల మీడియాకు లీకులు ఇస్తూ. బాలినేనిపై విమ‌ర్శల ప‌ర్వ సాగిస్తోంది. టీడీపీకి చెందిన వాళ్లను పార్టీలోకి తీసుకు రావ‌డంతో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉన్న వైసీపీ నేత‌లు బాచిన ఫ్యామిలీ, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహ‌న్‌తో పాటు జిల్లాలో ముందు నుంచి బాలినేని వైరి వ‌ర్గంగా ఉన్న టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి లాంటి వాళ్లు బాలినేనిపై అసంతృప్తితో ఉన్నారు. మొత్తానికి బాలినేని దూకుడు పెంచినా కీల‌క‌మైన మంత్రి బాధ్యత‌ల‌ను నిర్వర్తించ‌డం లేద‌నే విమ‌ర్శలు మాత్రం వెంటాడుతున్నాయి.

Tags:    

Similar News