బేల రాజేనా.. ఆ పార్టీలోకి మేము రామంటున్న క్యాడర్..!

Update: 2018-11-18 13:30 GMT

రాజకీయాల్లో ఒక్కోసారి స్టెప్పులు రాంగ్ అవుతూంటాయి. తెలిసి చేసినా, పొరపాటు అయినా కూడా వెనక్కు తీసుకోలేరు. అలాంటి తప్పే విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు చేశారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. జనసేనకు విశాఖ ఏజెన్సీలో పట్టు లేదు. ఆ మాటకు వస్తే జిల్లాలోనే బలం అంతగా లేదు. అటువంటిది సీనియర్ నేతగా ఉన్న బాలరాజు వారం క్రితం కాంగ్రెస్ ని వదిలేసి పవన్ పార్టీలో చేరిపోయారు. ఆయన భవిష్యత్తు అపుడే కళ్ళ ముందు కనిపించేలా అనుచరులు, కార్యకర్తలు మేము మీ వెంట ఆ పార్టీలోకి రామని తెగేసి చెబుతున్నారట.

కండువా కప్పుకున్న బాలరాజు

తన మిత్రుడు, కాంగ్రెస్ లో ఒకనాటి సహచరుడు నాదేండ్ల మనోహర్ చెప్పాడ‌నో.. మరో కారణమో గానీ బాలరాజు అయితే షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. ఆయన జనసేనలో చేరడాన్ని అనుచరులే తప్పు పట్టే పరిస్థితి వచ్చింది. చేరితే వైసీపీలో చేరాలి లేదా కాంగ్రెస్ లోనే ఉండాలి, మధ్యలో జనసేనకు ఎందుకు వెళ్లారో అని పక్కనున్న వారే అయోమయంలో పడుతున్నారట. బాలరాజుకు మంచి పట్టు ఉన్న చింతపల్లి, జేకే వీధి మండలాల్లోని కార్యకర్తలు, నాయకులైతే మేము మీ వెంట రామని తెగేసి చెప్పేశారట. మేము కాంగ్రెస్ లోనే ఉంటామని కూడా అంటున్నారట. బాలరాజు వెంట ఇన్నాళ్లు నడచిన వారే ఇలా అనేసరికి ఆయన సైతం షాక్ తినే పరిస్థితి ఎదురవుతోంది.

పార్టీ నిర్మాణమేదీ

జనసేనలో బాలరాజు అయితే చేరారు కానీ పార్టీ నిర్మాణం మాత్రం జరగడం లేదు. పైగా ఏజెన్సీలో ఎన్నికల వేళ పార్టీ నిర్మాణం జరిపి మరీ ఎన్నికలకు పోవడం సాధ్యమయ్యే పనేనా.? అనే ప్రశ్నలు వస్తున్నాయి. నమ్ముకున్న కార్యకర్తలు, అనుచరులు మాజీ మంత్రికి షాక్ ఇచ్చేసరికి ఆయన సైతం డైలామాలో పడిపోయారంటున్నారు. నిజానికి బాలరాజు కాంగ్రెస్ లో ఉంటే పాడేరు టికెట్ పొత్తులో భాగంగా దక్కేది. అలా గెలిచే వీలు కూడా ఉండేది. ఆదృష్టం కలసి వస్తే టీడీపీ మళ్లీ పవర్లోకి వస్తే మంత్రి పదవి అయినా దక్కేది. అందుకే పార్టీని వీడి వెళ్లవద్దంటూ ద్వితీయ శ్రేణి నాయకులు సైతం బాలరాజుకు చెప్పి చూశారట. అయినా ప్రయోజనం లేకపోయిందని అంటున్నారు.

బల ప్రదర్శన

ఇక బాలరాజు తన బలం ఏపాటిదో తాను చూసుకోవడానికి త్వరలో విశాఖలో ఓ బహిరంగ సభను పెడుతున్నారు. జనసేనలో చేరినందుకు సన్మాన కార్యక్రమం అని అంటున్నా బాలరాజుతో కలసి వచ్చేవారెవరో, కాంగ్రెస్ లో ఉండిపోయే వారెవరో తేల్చి చూసుకునే మీటింగ్ ఇది. మరి ఈ సభకు వచ్చే జనం పైనే ఈ బాలరాజు గారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.

Similar News