బాబుకు బ్యాడ్ సిగ్నల్స్

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎన్నికల ముందు ట్రబుల్స్ మొదలయ్యాయి. ఆయనకు కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ – టీడీపీ కూటమి ఓటమి, పార్టీలో [more]

Update: 2019-03-06 08:00 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎన్నికల ముందు ట్రబుల్స్ మొదలయ్యాయి. ఆయనకు కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ – టీడీపీ కూటమి ఓటమి, పార్టీలో నుంచి ప్రతిపక్ష వైసీపీలోకి వలసలు, తాజాగా డేటా చోరీ వ్యవహారం వంటివి తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. ఎన్నికలకు రెండు నెలలు కూడా సమయం లేని ఇప్పుడు డేటా చోరీ వ్యవహారం పార్టీకి నష్టం కలిగించేలా ఉంది. దీంతో తెలుగుదేశం పార్టీ నేతల్లో కలవరం మొదలైంది. ఆ పార్టీ నేతలు డిఫెన్స్ లో పడ్డట్లు కనిపిస్తోంది. వరుసగా టీడీపీ నేతలు మాట్లాడుతున్న తీరు ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. అయితే, టీడీపీ ఎదుర్కుంటున్న సమస్యలు ఎవరో తెచ్చినవి కాదు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తలకు చుట్టుకున్నారని విశ్లేషకులు అంటున్నారు.

తెలంగాణ ఎన్నికలతో మొదలు…

తెలంగాణలో ఇంకా కాస్తో కూస్తో క్యాడర్ తెలుగుదేశం పార్టీకి ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ, ప్రచారం వ్యవహారం పూర్తిగా టీటీడీపీకి వదిలేసి ఉంటే సరిపోయేది. అవసరమైతే రెండుమూడు రోజులు చంద్రబాబు ప్రచారం చేసి ఉండాల్సింది. కానీ, చంద్రబాబు ఈ ఎన్నికలను సీరియస్ గా తీసుకున్నారు. కేసీఆర్ ను టార్గెట్ చేసుకుని పెద్దఎత్తున ప్రచారం చేశారు. టీడీపీ స్థానాలతో పాటు కాంగ్రెస్ పోటీ చేస్తున్న స్థానాల్లోనూ ప్రచారం చేశారు. తెలంగాణ ఎన్నికల్లో ఎక్కువగా జోక్యం చేసుకుంటే ఫలితాలు వ్యతిరేకంగా వస్తే ఏపీ ఎన్నికలపై ప్రభావం పడుతుందని ఆయన ఆలోచించలేదు. తెలంగాణలో కేసీఆర్ వర్సెస్ చంద్రబాబుగా ఎన్నికలు సాగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ – టీడీపీ కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. కేవలం రెండు సీట్లకే ఆ పార్టీ పరిమితమైంది. ఈ ఎన్నికల ద్వారా చంద్రబాబు సాధించింది ఏమీ లేకపోగా కేసీఆర్ తో వైరం కొనితెచ్చుకున్నారు. ఆ ఎన్నికల ప్రభావం ఎంతోకొంత ఏపీ ఎన్నికలపైనా పడే అవకాశం ఉంది.

డేటా చోరీ వ్యవహరంతో అనుమానాలు…

ఇక, ఇటీవల వరుసగా నేతలు టీడీపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరడం కూడా టీడీపీకి ఇబ్బందికరమే. ఎన్నికల ముందు అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలోకి వలసలు పెరగడం వల్ల వైసీపీపై ప్రజల్లో అంచనాలు పెరుగుతున్నాయి. ఇక, తాజాగా డేటా చోరీ వ్యవహారాన్ని టీడీపీ నేతలే ఏరికోరి మెడకు చుట్టుకున్నారు. ఓ ప్రైవేటు సంస్థపై సోదాలు జరిగితే చంద్రబాబు సహా టీడీపీ నేతలు చాలా తీవ్రంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ పై తెలంగాణ ప్రభుత్వం దాడిగా ఈ వ్యవహారాన్ని మార్చే ప్రయత్నం చేశారు. వాస్తవానికి, ఈ వ్యవహారాన్ని పెద్దగా పట్టించుకోకుండా ఉంటే సరిపోయేది. టీడీపీ నేతలు ఎక్కువగా స్పందించడం వల్ల ఈ విషయం ప్రజల్లోకి బాగా వెళ్లింది. తమ వ్యక్తిగత వివరాలు ప్రైవేటు సంస్థలకు చేరాయి అనే సరికి ప్రజల్లోనూ ప్రభుత్వం పట్ల కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ విషయాన్ని టీడీపీ నేతలే పెద్దది చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఎన్నికల్లో ఇది టీడీపీకి నష్టం చేసే అవకాశం ఉంది. రెండు నెలల లోపే ఎన్నికలు ఉన్నందున ఈ సమయంలో ఇటువంటి కేసు తెరపైకి రావడం, ప్రభుత్వ పాత్ర ఇందులో ఉందనే అనుమానాలు ప్రజల్లో బలపడటం టీడీపీకి ఇబ్బందిగా మారింది.

Tags:    

Similar News