అయ్యన్న కోటలో గుదిబండ ?

కట్టుకున్న మేడలు కూలిపోతాయి. మహారాజులూ తరలిపోతారు అని ఒక సినీ కవి పాటలో వేదాంతం వల్లిస్తాడు. రాజకీయాల్లో జరిగేది అదే. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వైభవం గతం [more]

Update: 2021-03-31 12:30 GMT

కట్టుకున్న మేడలు కూలిపోతాయి. మహారాజులూ తరలిపోతారు అని ఒక సినీ కవి పాటలో వేదాంతం వల్లిస్తాడు. రాజకీయాల్లో జరిగేది అదే. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వైభవం గతం కాగా ఆయన ప్రాభవం తగ్గి సొంత ఊరులో కూడా వైసీపీ జెండా గర్వంగా ఎగరేసింది. ఒకటి రెండూ కాదు ఆరు దశాబ్దాల రాజకీయం అయ్యన్నపాత్రుడు కుటుంబానిది. అయ్యన్న తాత లత్సాపాత్రుడు నాలుగు దశాబ్దాల పాటు నర్శీపట్నం పంచాయతీ సర్పంచ్ గా ఏకధాటిగా ఏలారు. ఆయన రాజకీయ జీవితంలో ఒకే ఒక్కసారి ఓడారు. అది జరిగి నాలుగు దశాబ్దాలు అయింది. మళ్లీ ఇపుడు మనవడు అయ్యన్నపాత్రుడు కాలంలో రిపీట్ అయింది.

ఫుల్ సైలెంట్ …

అయ్యన్నపాత్రుడు నిజానికి చాలా మాట్లాడుతారు. మీడియా ముందుకు వచ్చి ప్రతీ రోజూ జగన్ సర్కార్ మీద ఘాటు విమర్శలు చేయకుండా ఊరుకోరు. అలాంటిది నర్శీపట్నం మునిసిపాలిటీలో వైసీపీ గెలవడంతో అయ్యన్నపాత్రుడు సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయారు. అధినాయకుడు చంద్రబాబుకు సీఐడీ నోటీసులు ఇచ్చినా కూడా ఆయన బయటకు వచ్చి సౌండ్ చేయలేదు అంటే నర్శీపట్నం మునిసిపాలిటీ కొట్టిన దెబ్బ నుంచి ఇంకా కోలుకోలేదు అని అర్ధం చేసుకోవాలి.

గుదిబండేనా….?

నర్శీపట్నం మున్సిపాలిటీకి కొత్త చైర్ పర్సన్ గా వైసీపీ తరఫున గుదిబండ ఆదిలక్ష్మి బాధ్యతలు స్వీకరించారు. దాంతో టీడీపీకే కాదు, అయ్యన్నపాత్రుడి ఫ్యామిలీకి కూడా రాజకీయంగా ఆమె గుదిబండ అవుతుందా అన్న చర్చ సాగుతోంది. ఆమె వెనక యువ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఉన్నారు. పాతిక వేల ఓట్ల తేడాతో అయ్యన్నపాత్రుడిని రెండేళ్ళ క్రితం ఓడించిన ఉమా శంకర్ పంచాయతీ ఎన్నికల్లో ఎనభై శాతానికి పైగా సీట్లు లాగేశారు. ఇపుడు పట్టుబట్టి మరీ నర్శీపట్నం మునిసిపాలిటీని చేజిక్కించుకున్నారు. నాలుగు దశాబ్దాలుగా అయ్యన్నపాత్రుడు ఫ్యామిలీ గుప్పిట్లో ఉన్న నర్శీపట్నాన్ని బయటకు తెచ్చామని ఆయన గట్టిగానే జబ్బలు చరుస్తున్నారు.

ఎదురు నిలిచారా…?

మరో వైపు చూస్తే నాలుగు దశాబ్దాల క్రితం అయ్యన్నపాత్రుడు తాత లత్సాపాత్రుడిని సర్పంచ్ ఎన్నికల్లో ఓడించిన ఏకైక మొనగాడు గొలుసు నారాయణమూర్తి కుమారుడు నరసింహ మూర్తి ఇపుడు నర్శీపట్నం కొత్త వైఎస్ చైర్మన్ గా వైసీపీ తరఫున నియమితులయ్యారు. ఇది కూడా అయ్యన్నపాత్రుడు సహించలేని విషయమే. మొత్తానికి గాలి పార్టీ, జగన్ కి జనాలలో ఏమీ లేదు, ప్రజలు తప్పుడు హామీలకు మోసపోయి ఓట్లేశారు, మళ్లీ ఎన్నికలు పెడితే టీడీపీదే అధికారమని అచ్చం చంద్రబాబు గొంతుతో మాట్లాడిన అయ్యన్నపాత్రుడు స్థానిక ఎన్నికల్లో వైసీపీ సాధించిన అఖండ విజయాలను చూసి ఏమీ అనలేక మౌన మునిగా మారిపోయారని అంటున్నారు. ఏది ఏమైనా రాజకీయం ఎపుడూ ఒక వైపే ఉండదు, మారుతుంది, జాతకాలను మార్చేస్తుంది అన్న దానికి అయ్యన్నపాత్రుడు ఇలాకాలో వైసీపీ జెండా ఎగరడమే ఉదాహరణగా చూడాలి.

Tags:    

Similar News