అయ్యన్న ఫ్యామిలీకి గట్టి షాక్ ఇచ్చేసిన జగన్… ?

జగన్ రాజకీయమే వేరు. ఏపీలోని మొత్తం 175 నియోజకవర్గాల మీద ఆయనకు అవగాహన ఉంది. అంతే కాదు, టీడీపీ ఎక్కడ బలంగా ఉందో చూసి మరీ గట్టి [more]

Update: 2021-07-18 15:30 GMT

జగన్ రాజకీయమే వేరు. ఏపీలోని మొత్తం 175 నియోజకవర్గాల మీద ఆయనకు అవగాహన ఉంది. అంతే కాదు, టీడీపీ ఎక్కడ బలంగా ఉందో చూసి మరీ గట్టి దెబ్బ కొడుతున్నారు. అదే విధంగా తెల్లారిలేస్తే తన మీద పెద్ద నోరేసుకుని విరుచుకుపడిపోతున్న నేతలకు కూడా సమయం చూసి షాక్ ఇచ్చేయడం జగన్ కి అలవాటే. విశాఖ జిల్లా విషయానికి వస్తే తెలుగుదేశం పొలిట్ బ్యూరో మెంబర్, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంట్లో కుంపటి పెట్టి ఆయన్ని పాతిక వేల ఓట్ల తేడాతో ఓడించిన జగన్ వ్యూహం ఇపుడు మరో మారు పదునెక్కింది. ఏకంగా ఆయన తమ్ముడు కుటుంబానికి క్యాబినేట్ ర్యాంక్ పదవిని జగన్ ఇచ్చేశారు.

అదిరే పదవి…

విశాఖ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్ పర్సన్ గా అయ్యన్నపాత్రుడు మరదలు అనితను నియమించి టీడీపీకే నోట మాట రాకుండా చేశారు. అయ్యన్నపాత్రుడు తమ్ముడు సన్యాసిపాత్రుడు ఎన్నికల ముందు వైసీపీలో చేరి అన్న ఫ్యామిలీని టార్గెట్ చేశారు. అయ్యన్నపాత్రుడు ఓటమిలో ఆయన వాటా కూడా ఉంది. ఇక ఈ మధ్య జరిగిన నర్శీపట్నం మునిసిపాలిటీ ఎన్నికల్లో కూడా అయ్యన్న కుటుంబం ఓడడానికి తమ్ముడు కీ రోల్ ప్లే చేశారు. దానికి బహుమతిగా ఆయన సతీమణి అనితకు ప్రతిష్టాత్మకమైన పదవినే జగన్ ఇచ్చారు. దీంతో తమ్ముడి ఇంట ఆనందం తాండవిస్తూండగా అయ్యన్నపాత్రుడు మాత్రం ఇరకాటంలో పడ్డారనే చెప్పాలి.

ఆయనే ఆయుధం…

రామలక్ష్మణులుగా మెలిగిన తమ్ముళ్ల మధ్య రాజకీయమే చిచ్చు రేపింది. అన్న తరువాత ఒకసారి అయినా ఎమ్మెల్యే కావాలని సన్యాసిపాత్రుడు తలపోశారు. కానీ అయ్యన్నపాత్రుడు తన కొడుకు విజయ్ పాత్రుడికే పట్టం అంటూ తమ్ముడికి ఝలక్ ఇచ్చేశారు. దాంతో మూడు దశాబ్దాల రాజకీయ బంధాన్ని టీడీపీతో సన్యాసిపాత్రుడు తెంచుకున్నారు. అలాగే అన్నతో రక్తబంధానికి దూరంగా ఉన్నారు. ఇక సన్యాసిపాత్రుడు సతీమణి అనిత నర్శీపట్నం మునిసిపాలిటీ వైఎస్ చైర్ పర్సన్ గా గత అయిదేళ్ళూ పాలించారు. ఆమె అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని సన్యాసిపాత్రుడికి జగన్ బిగ్ ఆఫర్ ఇచ్చేశారు. ఇపుడు ఆయనే ఆయుధంగా రాజకీయంగా అయ్యన్నపాత్రుడును మరింత దెబ్బ తీసేందుకు పావులు కదుపుతున్నారు.

కష్టమే…?

అయ్యన్నపాత్రుడు రాజకీయం అంతా తమ్ముడి మీదనే ఆధారపడి సాగింది. అయ్యన్న ఎక్కడా ఉన్నా తమ్ముడు అందుబాటులో అటు ప్రజలకు, ఇటు క్యాడర్ కి ఉంటూ వచ్చేవారు. అలాంటి పని ఇపుడు కొడుకు చేయడం అంటే కష్టమే. పైగా విజయ్ కి అనుభవం తక్కువ. అయితే కొడుకే తన వారసుడు అని అయ్యన్నపాత్రుడు భావించడం వల్లనే ఆయన రాజకీయం కష్టాలలో పడింది అంటారు. అన్నదమ్ములు కలిస్తే మాత్రం తిరుగులేదు. కానీ కలవనీయకుండా కొడుకు విజయ్ ఉన్నారు. దాంతో నర్శీపట్నంలో అయ్యన్నపాత్రుడు రాజకీయ శకం ఇలాగే ముగిసిపోతుందా అన్న డౌట్లు అయితే అందరికీ వస్తున్నాయి. మొత్తానికి పులి లాంటి అయ్యన్నపాత్రుడు ఇపుడు రాజకీయంగా ఏమీ కాకుండా ఉంటే తమ్ముడి ఫ్యామిలీలో మాత్రం అధికార వైభోగం కనిపించడం పొలిటికల్ గా చిత్రమే అంటున్నారు.

Tags:    

Similar News