మరో ఛాన్స్ వద్దంటున్నాడే

విశాఖ జిల్లా సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు రాజకీయాల్లో మరో ఛాన్స్ కోరుకోవడంలేదా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. నిజానికి తాజా ఎన్నికల్లోనే [more]

Update: 2019-11-30 12:30 GMT

విశాఖ జిల్లా సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు రాజకీయాల్లో మరో ఛాన్స్ కోరుకోవడంలేదా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. నిజానికి తాజా ఎన్నికల్లోనే పోటీకి అయ్యన్నపాత్రుడు వద్దనే చెప్పారు. అయితే ఈ ఎన్నికలు చావో రేవో అంటూ చంద్రబాబు అయ్యన్నపాత్రుడుని పోటీకి దిగమని చెప్పడంతో బలవంతంగా దిగారు. ఫలితం కూడా అలాగే వచ్చింది. దాదాపుగా 27 వేల ఓట్ల తేడాతో అయ్యన్నపాత్రుడు ఓటమి పాలు అయ్యారు. మరో వైపు చూస్తే జిల్లాలో ఉన్న నాయకులంతా ఓడిపోయారు. వారిలో కొంతమంది వైసీపీ బాట పట్టారు. మరికొందరు బీజేపీలో చేరారు. మిగిలిన వారు మౌనంగా ఉన్నారు. దాంతో సీనియర్ మోస్ట్ లీడర్ అయిన అయ్యన్నపాత్రుడునే చంద్రబాబు ముందు పెట్టి పార్టీని న‌డిపించాలనుకుంటున్నారు. అయితే ఎన్నికల రాజకీయాల నుంచి తాను తప్పుకోవాలని అయ్యన్నపాత్రుడు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. తన బదులుగా కుమారుడు విజయ్ పాత్రుడిని రంగంలో ఉంచాలని అయ్యన్నపాత్రుడు ఆలోచన‌గా ఉంది.

లైన్ క్లియర్ అయిందిగా….?

ఇక నర్శీపట్నం నియోజకవర్గంలో అన్న అయ్యన్నపాత్రుడుకు తోడుగా ఉన్న సీనియర్ నేత, తమ్ముడు అయిన సన్యాసిపాత్రుడు వైసీపీలో చేరిపోయారు. అన్న ఎలాగూ తనకు మద్దతు ఇవ్వరని భావించే ఆయన తప్పుకున్నారు. ఇక ఆయన సతీమణి, నర్శీపట్నం మున్సిపాలిటీ చైర ప‌ర్సన్ అనిత, ఇద్దరు కుమారులు కూడా వైసీపీలో చేరారు. మరోవైపు బాబాయి పార్టీని వీడి వెళ్ళిపోవడంతో అబ్బాయికి పూర్తిగా లైన్ క్లియర్ అయిందని అంటున్నారు. అయ్యన్నపాత్రుడు వారసుడిగా విజయ్ నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాలను ముందుండి చూసుకుంటున్నారు. పార్టీ సభ్యత్వాల ప్రక్రియ ఇపుడు జోరుగా సాగుతోంది. దానికి విజయ్ పాత్రుడే నాయకత్వం వహించారు. ఆయన కూడా తండ్రి బాటలో నడుస్తూ వైసీపీ మీద పదునైన విమర్శలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ధీటైన నాయకత్వంతో ముందుకు రావాలని విజయ్ పాత్రుడు ఇప్పటి నుంచే కసిగా పనిచేస్తున్నారని తమ్ముళ్ళు అంటున్నారు.

జిల్లా బాధ్యతలు అయ్యన్నకేనా?

ఇవన్నీ ఇలా ఉంటే విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడుగా అయ్యన్నపాత్రుడిని నియమించాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సీనియర్ గా ఉండడమే కాదు, బాబుకు నమ్మిన బంటుగా ఉన్న అయ్యన్నపాత్రుడు పార్టీ కోసం ఎందాకైనా వెళ్తారని పేరు తెచ్చుకున్నారు. ఎటువంటి ప్రలోభాలాలకు లొంగకుండా ఆయన పార్టీ పటిష్టతకు కృషి చేస్తారని బాబుకు విశ్వాసం ఉంది. దాంతో ఆయన చేతిలోనే జిల్లా పగ్గాలను పెట్టాలను బాబు డిసైడ్ అయ్యారట. అయితే తాను పొలిటి బ్యూరోలో కొనసాగుతూ జిల్లా బాధ్యతలను వేరే ఎవరికైనా ఇస్తే బాగుంటుందని అయ్యన్నపాత్రుడు అనుకుంటున్నారట. కానీ ఇపుడు పార్టీ క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటోందని, సీనియర్లు జిల్లాల్లో నాయకత్వం వహిస్తేనే పార్టీ ఒడ్డున పడుతుందని బాబు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి చూడాలి అయ్యన్న జిల్లా పగ్గాలను చేపడతారో లేదో. ఏది ఏమైనా అయ్యన్న నర్శీపట్నం వరకూ మాత్రం కుమారుడికే పూర్తిగా పార్టీ బాధ్యతలను అప్పగించేశారని అంటున్నారు.

Tags:    

Similar News